
లీకులేనా నిజంగానే అసెంబ్లీకి వస్తారా ?
సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశ్యం కేసీఆర్ కు ఉంటే ఆ విషయాన్ని తానే బహిరంగంగా ప్రకటించవచ్చు
కేసీఆర్ లేదా బీఆర్ఎస్ వైఖరి భలే విచిత్రంగా ఉంటుంది. సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని మీడియాలో లీకులు కనబడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు నేతలపేర్లు లేకుండా మీడియాలో లీకులు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశ్యం కేసీఆర్ కు ఉంటే ఆ విషయాన్ని తానే బహిరంగంగా ప్రకటించవచ్చు. అసెంబ్లీకి హాజరవ్వద్దని కేసీఆర్ ను ఎవరైనా అడ్డుకున్నారా ? మరెందుకు హాజరవ్వటంలేదు ? ఎందుకంటే ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అసెంబ్లీకి హాజరుకాకూడదని కేసీఆరే నిర్ణయించుకున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ విషయంలో తాను ఎలా వ్యవహరించింది కేసీఆర్ కు బాగా గుర్తుండే ఉంటుంది. అప్పటి సమావేశాల్లో రేవంత్ ను బీఆర్ఎస్ సభ్యులు నోరెత్తనిచ్చేవారు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు సమావేశాల నుండి రేవంత్ ను సస్పెండ్ చేశారో కూడా అందరు చూసిందే. కాబట్టి ఇపుడు అదే పద్దతిలో రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు తనవిషయంలో ఇపుడు అలాగే వ్యవహరిస్తారనే ఆలోచనతోనే కేసీఆర్ సభకు హాజరవ్వటంలేదు. అప్పటికీ రేవంత్, మంత్రులు చాలాసార్లు అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ ను కోరారు. సభలో కేసీఆర్ గౌరవానికి భంగంకలగకుండా చూసుకుంటామని కూడా రేవంత్ ప్రకటించారు. అయినా సమావేశాలకు హాజరవ్వటానికి కేసీఆర్ ఇష్టపడటంలేదు.
అలాంటిది 29వ తేదీనుండి సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఈసమావేశాలకు అయినా కేసీఆర్ హాజరవ్వాలని రేవంత్, మంత్రులు విజ్ఞప్తులు చేశారు. ఈవిషయంలో కేసీఆర్ ఇప్పటివరకు నేరుగా ఏమీ మాట్లాడలేదు. ఈమధ్యనే సుమారు గంటన్నరపాటు మీడియాతో మాట్లాడిన కేసీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీరేస్తానని, బహిరంగసభలు పెట్టి ప్రభుత్వం తోలు వలిచేస్తానని ప్రకటించారు. అయితే తాను అసెంబ్లీకి హాజరయ్యే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. సభలో ప్రభుత్వాన్ని నిలదీయమన్నారు, ప్రాజెక్టుల అంశంపై సభలో మాట్లాడే విషయంలో దిశానిర్దేశం చేశారు అని లీకులు ఇస్తున్నారంతే. ఈ లీకుల్లో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతానని తమతో చెప్పారని పేర్లు రాయకుండానే పార్టీనేతలు చెప్పినట్లుగా మీడియాలో బీఆర్ఎస్ వార్తలు రాయించుకుంటోంది.
కేసీఆర్ సభకు హాజరవ్వటం ఏమంతా బ్రహ్మాండమైన వార్త. కేసీఆర్ సభకు హాజరవుతారు అన్న వార్తలను లీకుల రూపంలో ఎందుకు రాయించుకుంటున్నారో అర్ధంకావటంలేదు. డైరెక్టుగా కేసీఆరే ప్రకటించవచ్చు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్, మంత్రులు, బీజేపీ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదేపదే ఆరోపిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా జరగనంత అన్యాయం కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళల్లో జరిగిందని రేవంత్ తదితరులు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. ఇదేసమయంలో సమైక్య రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తాను తొమ్మిదిన్నరేళ్ళల్లోనే చేసినట్లు కేసీఆర్ చెప్పుకుంటున్నారు.
తన హయంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ? అనే విషయాన్ని కేసీఆర్ సమావేశాల్లోనే మాట్లాడవచ్చు. అలాగే కేసీఆర్ వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏమిటి ? ఏఏరంగాల్లో అన్యాయం జరిగిందన్న విషయాలను రేవంత్, మంత్రులు సభ ద్వారా జనాలకు వివరిస్తారు. అసెంబ్లీలో రెండువైపుల వాదనలు, ప్రతివాదనలు విన్నజనాలు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ విషయం తెలిసికూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వటంలేదు అంటే ప్రజాస్వామ్యమన్నా, ప్రజా సమస్యలపై చర్చ, అసెంబ్లీ అన్నా కేసీఆర్ కు ఎంతటి గౌరవం ఉందో అర్ధమైపోతోంది.

