కర్ణాటకలో బీజేపీ నేత నారాయణ గౌడ కాంగ్రెస్‌లో చేరుతున్నారా?
కర్ణాటకలో మాండ్య స్థానాన్ని బీజేపీ జేడీ(ఎస్)కు కట్టబెట్టడంతో అసంతృప్తి చెందిన బీజేపీ నేత నారాయణ గౌడ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
కర్ణాటకలో బీజేపీ జేడీ(ఎస్)తో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా మాండ్య లోక్‌సభ స్థానాన్ని జేడీ(ఎస్) కేటాయించడంతో స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో బీజేపీ నేత కేసీ నారాయణ గౌడ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.చెలువరాయస్వామి తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉందని, చేరిన తర్వాత ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనే దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
బీజేపీతో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా జేడీ(ఎస్) కోలార్, హాసన్, మాండ్య స్థానాల్లో పోటీ చేయనుంది.
గౌడ గతంలో జేడీ(ఎస్)లో ఉన్నారు. 2019 జూలైలో అప్పటి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనానికి దారితీసిన 17 మంది కాంగ్రెస్-జెడి(ఎస్) శాసనసభ్యులలో గౌడ కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలుపొంది గత కాషాయ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మాండ్యాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్.. జేడీ(ఎస్) నిఖిల్ కుమారస్వామిపై విజయం సాధించారు. తిరిగి ఈ సారి బీజేపీ తనకే టికెట్ కేటాయిస్తుందని ఆశించారు. కాని జేడీ(ఎస్) చేజిక్కించుకుంది. మాండ్య స్థానాన్ని జెడి (ఎస్) కు కేటాయించొద్దని కొంతమంది బీజేపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
2019 అసెంబ్లీ ఉపఎన్నికల్లో (కృష్ణరాజ్‌పేటలో) మాండ్య జిల్లాలోని వొక్కలిగ బస్తీలో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేయడం ద్వారా గౌడ చరిత్ర సృష్టించారు.అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
కాగా మాండ్య, హాసన్, కోలార్ సెగ్మెంట్ల నుంచి జేడీ(ఎస్) పోటీ చేస్తుందని కర్ణాటక ఎన్నికల ఇంచార్జ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ శనివారం తెలిపారు.
జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి, పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సీఎస్ పుట్టరాజు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.