
వైఎస్ పొలిటికల్ మోడల్ ఫాలో అవుతున్న రేవంత్...
2023లో పార్టీని అధికారంలోకి తేవటంలో కూడా రేవంత్ అంతే కష్టపడ్డాడు
రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరైనా తనకు ఎదురుండకూడదనే అనుకుంటారు. అయితే ఊహించనిరీతిలో స్పీడ్ బ్రేకర్లు తప్పవు. అందులోను కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు అడుగడుగునా ఉండటంలో ఆశ్చర్యమేలేదు. అలాంటి స్పీడ్ బ్రేకర్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన వారినే పదవులు కూడా వరిస్తాయి. ఇపుడీ విషయం అంతా ఎందుకంటే ముఖ్యమంత్రి (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి గురించే. చాలా చిన్న వయసులోనే, తక్కువ సమయంలోనే రేవంత్ ముఖ్యమంత్రి అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలతో పోల్చితే రేవంత్ అనుభవం చాలా చాలా తక్కువనే చెప్పాలి.
2017లో టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ కాంగ్రెస్ లో చేరాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీచేసి గెలిచాడు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలుతీసుకున్న రేవంత్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎంఎల్ఏగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే పార్టీలో రేవంత్ అనుభవం కేవలం ఆరు ఏళ్ళు మాత్రమే అని అర్ధమవుతోంది.
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నపుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవటాన్ని కూడా చాలామంది సీనియర్లు వ్యతిరేకించారు. పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ తో పాటు చాలామంది సీనియర్లు పోటీపడ్డారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి లాంటి చాలామంది నేతలు రేవంత్ కు పూర్తి వ్యతిరేకం అన్న విషయం తెలిసిందే. ఈవిషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు కాబట్టే వీళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నాడు. అప్పుడు పార్టీలోకాని ఇపుడు ప్రభుత్వంలోకాని సీనియర్లను కలుపుకుని వెళ్ళటానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. దీనివల్ల సీనియర్లలో తనపైన వ్యతిరేకత తగ్గించుకుని ‘అందరివాడు’ అనిపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
వైఎస్సే గుర్తుకు వస్తున్నారా ?
ఈ ప్రయత్నాలను చూస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయత్నాలే గుర్తుకువస్తున్నాయి. వైఎస్ కు కూడా పార్టీలో చాలామంది బద్ధశతృవులు ఉండేవారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డితో ఏ విషయంలో కూడా వైఎస్ కు పడేదికాదు. శతృవుకు శతృవు మిత్రుడు అన్నపద్దతిలో వ్యతిరేకులంతా కలిసి వైఎస్ ను సంవత్సరాల పాటు ఎదగకుండా ఒకతొక్కు తొక్కిన విషయం అందరికీ తెలిసిందే. సంవత్సరాల పాటు పార్టీలో అసమ్మతినేతగా చెలామణి అయిన వైఎస్ వేరేదారిలేక విజయమో వీరస్వర్గమే అని తేల్చుకునేందుకు 2003లో పాదయాత్రకు శ్రీకారంచుట్టారు. 60రోజుల్లో 11జిల్లాల్లోని 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ చేసిన పాదయాత్ర పార్టీనేతల్లో జోష్ రగిలించి, ప్రజల్లో కూడా మద్దతుపెరగటంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచింది. 2004 ఎన్నికల్లో పార్టీని గెలిపించిన తననే అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేయక తప్పని పరిస్ధితులను వైఎస్ కల్పించారు.
ముఖ్యమంత్రి అవగానే పార్టీలోని తన వ్యతిరేకులందరినీ పిలిపించుకుని మాట్లాడి శతృవులు లేకుండా చేసుకున్నారు. అంతకుముందు పాదయాత్ర సమయంలోనే వ్యతిరేకులను కలుపుకుని వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.
అప్పట్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని రావటానికి వైఎస్ ఎంత కష్టపడ్డారో 2023లో పార్టీని అధికారంలోకి తేవటంలో కూడా రేవంత్ అంతే కష్టపడ్డాడు. అప్పట్లో నారా చంద్రబాబునాయుడు తొమ్మిదిన్నరేళ్ళు వరుసగా అధికారంలో ఉండి మూడోసారి అధికారం కోసం పోటీపడి ఓడిపోయారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా రెండుసార్లు గెలిచి మూడోసారి అధికారం అందుకునేందుకు 2023లో పోటీపడి ఓడిపోయారు.
ఇమేజి పెంచుకుంటున్నాడు
ఇపుడు విషయం ఏమిటంటే పార్టీతో పాటు ప్రభుత్వంలో తనకు ఎదురులేదు అనిపించుకునేందుకు వైఎస్ పద్దతిలోనే రేవంత్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన మద్దతుదారుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నే నియమించుకున్నారు. బొమ్మని నియమించటంలో రేవంత్ బీసీకార్డును ఉపయోగించుకున్నారు. బొమ్మ నియామకంతో పార్టీపరంగా రేవంత్ కు పెద్ద సమస్య లేదనే అనుకోవాలి. ముఖ్యమంత్రిగా సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర, భట్టి శాఖల్లో జోక్యం చేసుకోవటంలేదు కాబట్టి వీళ్ళకు కూడా రేవంత్ పైన వ్యతిరేకత తగ్గింది. పైగా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత రేవంత్ ఇస్తుండటంతో సీనియర్ మంత్రులు కూడా హ్యాపీగానే ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రెండు కారణాలు. మొదటిది కేసీఆర్ మీద జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకత. రెండో కారణం రేవంత్ పర్సనల్ ఇమేజి. కేసీఆర్ ను ఢీకొట్టగలిగే దమ్మున్న నేత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ మాత్రమే అని జనాలు నమ్మటం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. రేవంత్ కాకుండా పీసీసీ అధ్యక్షుడిగా ఇంకే సీనియర్ నేతున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావటం కలలోని మాటే. రేవంత్ వాక్చాతుర్యం, ఆర్ధిక సంపత్తి, జనాల్లో ముఖ్యంగా యువతలో ఫాలోయింగ్ కాంగ్రెస్ లోని మరేనేతకు లేవన్నది వాస్తవం.
ఈ విషయాలన్నింటినీ గుర్తించింది కాబట్టే అధిష్ఠానం కూడా రేవంత్ ను ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. తాను ఏచిన్న పొరబాటు చేసినా ముఖ్యమంత్రి పీఠం చేజారిపోతుందని బాగా తెలుసు కాబట్టే రేవంత్ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించారు. మొన్ననే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్ధానాల్లో గెలిచేట్లు చక్రంతిప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047ను విజయవంతం చేశారు. అటు అధిష్ఠానం గుడ్ లుక్స్ లో ఉంటు ఇటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంల్సీలను కలుస్తున్నారు. పార్టీ క్యాడర్ తో కూడా టచ్ లో ఉండటమే కాకుండా తరచూ ప్రజాక్షేత్రంలో పర్యటిస్తు వైఎస్ లాగే తనకు కూడా ఎదురులేదనిపించుకుని ‘జననేత’ అనే ట్యాగ్ లైన్ కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు బాగా అర్ధమవుతున్నది. రేవంత్ జోరు ఎంతకాలం సాగుతుందో చూడాలి.
వైఎస్ స్ధాయి రేవంత్ కు రాదు : బీ కేశవులు
పార్టీ, ప్రభుత్వంలో ఎదిగేందుకు వైఎస్ లాగే రేవంత్ కూడా ప్రయత్నిస్తున్నది వాస్తవమే అని తెలంగాణ మేథావుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ బీ కేశవులు అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘సామన్య జనాల్లో వైఎస్ కు ఉన్నంత క్రేజ్ రేవంత్ కు లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘జననేత అనిపించుకునేందుకు రేవంత్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంకా చాలా చేయాలి’’ అని చెప్పారు. ‘‘హామీల అమలువిషయంలో వైఎస్ సక్సెస్ అయితే రేవంత్ ఫెయిలయ్యాడు’’ అని అన్నారు. ‘‘వైఎస్ ప్రజలకు ఉపయోగపడే హామీలను నెరవేరిస్తే రేవంత్ తనతో పాటు తన కోటరీకి మాత్రమే ఉపయోగపడే పనులు చేస్తున్నాడు’’ అని ఆరోపించారు. ప్రజోపయోగ పనుల విషయంలో రేవంత్ జీరో అయితే వైఎస్ నూరుశాతం సక్సెస్ అయ్యారు’’ అని డాక్టర్ తెలిపారు. ‘‘వైఎస్ తో రేవంత్ ను ఏవిషయంలోను పోల్చలేము’’ అని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పారు.
అలాగే ‘‘ప్రత్యర్ధుల విషయంలో రేవంత్ ఉపయోగిస్తున్న భాషను ప్రజలు హర్షించటంలేదు’’ అని తెలిపారు. ప్రత్యర్ధుల విషయంలో వైఎస్ ఏనాడు బూతులు మాట్లాడలేదు’’ అని డాక్టర్ గుర్తుచేశారు. ‘‘రేవంత్ నోరిప్పితే తిట్లుతప్ప మరోటి రావటంలేదు’’ అని అన్నారు. ‘‘బీఆర్ఎస్ పైన జనాల్లో బాగా వ్యతిరేకతుంది కాబట్టే తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు రావు’’ అన్నారు. అంతమాత్రాన కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చే ఫలితాలు తన గొప్పతనమే అని రేవంత్ అనుకునేందుకు లేదు’’ అని హెచ్చరించారు. ‘‘హామీల విషయంలో రేవంత్ నిజాయితీగా ఉండి అమలుచేస్తున్నపుడే జనాలు నమ్మతారు’’ అని సలహా ఇచ్చారు. ‘‘కామన్ మ్యాన్ హ్యాపీగా ఉన్నపుడే జననేత అవుతారు’’ అని ఒక్కమాటలో తేల్చేశారు. ‘‘వైఎస్ హయాంలో కామన్ మ్యాన్ కూడా హ్యాపీగా ఉండేవారు’’ అని గుర్తుచేశారు.
రేవంత్ కు సమయం పడుతుంది :పూల
‘‘సంక్షేమపథకాలు, ఉచితపథకాలు ఎక్కువైపోయాయి’’ అని పూల దేవేందర్ చెప్పారు. ‘‘ఒకపుడు చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా కాకుండా కంపెనీ సీఈవోలుగా పిలిచేవారు’’ అని గుర్తుచేశారు. ‘‘చంద్రబాబు ప్రయత్నాలకు వైఎస్ ప్రత్యామ్నాయ పథకాలను రూపొందించారు’’ అని చెప్పారు. ‘‘ తన హామీలద్వారా వైఎస్ రైతులు, విద్యార్ధులు, పేదలకు బాగా చేరువయ్యారు’’ అని చెప్పారు. ‘‘అప్పటి సంక్షేమపథకాలు ఇపుడు దేశవ్యాప్తంగా మరింతగా ఎక్కువైపోయాయి’’ అని అభిప్రాయపడ్డారు. వైఎస్ కు రేవంత్ కు పోలికే లేదు. ‘‘ఉచిత విద్యుత్తుతో రైతులను, ఆరోగ్యశ్రీతో పేదలను, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తో విద్యార్దులను వైఎస్ శాశ్వత ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు’’ అని పూల చెప్పారు. ‘‘అలాంటి శాశ్వత ఓటుబ్యాంకు రేవంత్ కు ఇంకా తయారుకాలేదు’’ అని చెప్పారు.
‘‘వైఎస్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ లాంటి నేతలు కనుమరుగయ్యారు’’ అని గుర్తుచేశారు. ‘‘రేవంత్-వైఎస్ ఇద్దరు సంక్షేమాలనే టార్గెట్ చేశారు’’ అని చెప్పారు. ‘‘పదేళ్ళ బీఆర్ఎస్ పైన వ్యతిరేకతే వల్లే జనాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మళ్ళారు’’ అని అభిప్రాయపడ్డారు. సోషల్ ట్రాన్స్ ఫార్మేషన్ రాలేదని జనాలందరు ఫీలవుతున్నారు. ‘‘పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ అడ్వాంటేజ్ తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘‘కేసీఆర్ ను ఎటాక్ చేయటంతోనే రేవంత్ జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘పార్టీ, ప్రభుత్వంలో వైఎస్ ఇమేజీని రేవంత్ తెచ్చుకోవాలంటే ఇంకా చాలాకాలం పడుతుంది’’ అన్నారు. ‘‘కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా జనాలు రేవంత్ ను చూస్తున్నారా ? లేకపోతే రేవంతే తమ నేతగా జనాలు చూస్తున్నారా అన్నది తేలాలి’’ అని అన్నారు. ‘‘అప్పట్లో వైఎస్ కు కలిసొచ్చిన అవకాశాలు ఇపుడు రేవంత్ కు లేవన్న విషయాన్ని గుర్తించాలి’’ అని పూల దేవేందర్ చెప్పారు.

