
ఐఏఎస్ లకు రేవంత్ ఫుల్లు క్లాసు, కారణమిదేనా ?
అధికారంలో నుండి బీఆర్ఎస్ పక్కకుపోయి రెండున్నరేళ్ళుదాటినా ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులు కారుపార్టీ పెద్దలకే మద్దతుగా పనిచేస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే
గతంలో ఎప్పుడూ లేనట్లుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా 33 జిల్లాల కలెక్టర్లకు ఫుల్లుగా క్లాసు పీకారు. ‘‘పనిచేయలేకపోతే తప్పుకోండి’’..‘‘సెలవులో వెళ్ళినా అభ్యంతరంలేదు’’..‘‘లూప్ లైన్ పోస్టు కావాలంటే వెంటనే ఇచ్చేస్తా’’..‘‘అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం తనకు తెలుసు’’..‘‘కొన్నిరాష్ట్రాల్లో అమలవుతున్న నిర్భంద రిటైర్మెంట్ విధానాన్ని ఇక్కడా పరిశీలిస్తాను’’..‘‘పనిచేయని అధికారుల వివరాలను మార్చి 4వ తేదీన బయటపెడతాను’’ ఇవి తన ఆధ్వర్యంలో జరిగిన ఐఏఎస్ అధికారులతో రేవంత్ మాట్లాడిన మాటలు. ఈ మాటలు విన్నతర్వాత ఐఏఎస్ ల పనితీరుపై రేవంత్ లో ఎంతటి అసంతృప్తి పేరుకుపోయిందో అర్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో నుండి బీఆర్ఎస్ పక్కకుపోయి రెండున్నరేళ్ళుదాటినా ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులు కారుపార్టీ పెద్దలకే మద్దతుగా పనిచేస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీనికి ఉదాహరణ ‘హిల్ట్ పాలసీ’ లీకవ్వటమే. మూసేసిన పరిశ్రమల భూములను, పనిచేస్తున్న పరిశ్రమల దగ్గరున్న మిగులు భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుని వాటికి ప్రత్యామ్నాయంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలివైపున కేటాయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ప్రభుత్వం పరిశీలన దశలోనే ఉన్న విధానపరమైన అంశం వివరాలు బీఆర్ఎస్ నేతలకు చేరింది. ఇంకేముంది కారుపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలకనేత హరీష్ రావు తదితరులు రేవంత్ ప్రభుత్వంపై ఎంతగా దుమ్మెత్తిపోశారో అందరికీ తెలిసిందే.
కొద్దిరోజుల పాటు తెలంగాణ రాజకీయాలను బాగా హీటెక్కించేసిన హిల్ట్ పాలసీ చర్చలు దశలోనే ఉన్న వివరాలు బయటకు ఎలాగ పొక్కింది అన్న విషయం ప్రభుత్వానికి అర్ధంకాలేదు. తర్వాత విధానపరమైన అంశాలు లీక్ అయిన వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంటే దీనివల్ల అర్ధం అవుతున్నది ఏమిటంటే కీలకమైన ప్రభుత్వశాఖల్లో ఉన్నతాధికారుల్లో ఇంకా బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారని. ఇలాంటి అనేక అంశాలు రేవంత్ దృష్టిలో ఉన్నాయేమో అందుకనే తాజా సమావేశంలో అంత కఠినంగా హెచ్చరించాల్సొచ్చింది.
ఐఏఎస్ పాత్ర కీలకం
నిర్ణయాలు తీసుకునేది, తీసుకోవాల్సింది పాలకులే అయినా తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాల్సింది మాత్రం ఐఏఎస్ అధికారులే. పాలకుల నిర్ణయాలను ఐఏఎస్ లు సరిగా అమలుచేయకపోతే ప్రభుత్వంపై జనాగ్రహానికి గురికాక తప్పదు. పాలకుల్లో ముఖ్యమంత్రిది ఎంతటి కీలకపాత్రో విధానాల రూపకల్పన, అమలులో చీఫ్ సెక్రటరీది అంతే కీలకపాత్రని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలను మంత్రులు నూరుశాతం పాటిస్తారో లేదో తెలీదు కాని చీఫ్ సెక్రటరీ ఆదేశాలను మాత్రం జిల్లాల కలెక్టర్లు తప్పకుండా పాటిస్తారు. చీఫ్ సెక్రటరీగా, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులుగా, కమీషనర్లుగా, జిల్లాల కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతటి ఐఏఎస్ లపైన రేవంత్ ఇంత కటువుగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ?
పనిచేయలేకపోతే తప్పుకోమని చెప్పారు. సెలవులో వెళ్ళినా ఎలాంటి అభ్యంతరంలేదని తేల్చేశారు. తప్పదు అనుకుంటే లూప్ లైన్లో కూడా పంపించేస్తాను అని హెచ్చరించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చారు. ఇవేవీ కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిర్భందపు రిటైర్మెంట్ విధానాన్ని కూడా తెలంగాణలో అమలుచేయటానికి వెనకాడనని హెచ్చరించారంటేనే పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో రేవంత్ కు బాగానే అర్ధమయ్యుంటుంది. పైగా పనిచేయని అధికారుల జాబితాను మార్చి 4వ తేదీన బయటపెడతానని కూడా చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళయింది కాబట్టి ఎవరి పనితీరు ఎలాగుందో తనదగ్గర పూర్తి రిపోర్టుందని కూడా చెప్పారు.
బీఆర్ఎస్ మద్దతుదారుల వివరాలున్నాయా ?
రేవంత్ తాజావ్యాఖ్యలు లేదా హెచ్చరికలతో బీఆర్ఎస్ కు మద్దతుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఎవరు అన్నరిపోర్టు కచ్చితంగా అందుంటుంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఈనెల 4వ తేదీన పనిచేయని అధికారుల వివరాలను బయటపెడతాను అని చెప్పింది. ఇదేసమయంలో లూప్ లైన్ అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. నిజానికి ఏ అధికారి కూడా లూప్ లైన్ అంటే అప్రాధాన్య పోస్టులో పనిచేయాలని కోరుకోరు. అధికారుల్లో అత్యధికులు తాము ప్రాధాన్యత ఉన్న పోస్టులు, కీలకశాఖల్లోనే పనిచేయాలని కోరుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ నేపధ్యంలోనే రేవంత్ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. మార్చి 6వ తేదీనుండి జూన్ వరకు 99 రోజులు కార్యక్షేత్రంలోనే పనిచేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ 99 రోజుల్లో కలెక్టర్లు, జిల్లాల అధికార యంత్రాంగం మొత్తం ప్రాజక్షేత్రంలోనే పనిచేయబోతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వచ్చత, శుభ్రతసహా అభివృద్ధి కార్యక్రమాలు, అవ్యవసర పనులు, సమస్యల పరిష్కారంపైనే రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు కలెక్టర్లతో పాటు యావత్ అధికార యంత్రాంగం అంతా రోడ్లపైనే ఉండబోతున్నారు. ప్రజలకు అధికారయంత్రాంగం చేరువకావాలని, జవాబుదారీగా ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారు.
కనీస అవసరాలపై పరిశీలన
యాక్షన్ ప్లాన్ ప్రారంభమైన తర్వాత 5-12వ తేదీల మధ్య రేవంత్ కోర్ అర్బన్ పరిధిలో రోజుకొక విభాగం పరిధిలోని పనులను ప్రత్యక్షంగా పరిశీలించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. రోడ్ల పరిస్ధితిని, పారిశుధ్యం, చెత్తవేసే ప్రాంతాలు, మంచినీటి సౌకర్యం తదితరాలను రేవంత్ పరిశీలించబోతున్నారు. మరి ఈ యాక్షన్ ప్లాన్ లో ఏమిజరుగుతుందో చూడాలి.

