ఎన్నికల్లో గెలవడానికి దక్షిణాదిని మోసం చేస్తారా మోదీ: రేవంత్
x

ఎన్నికల్లో గెలవడానికి దక్షిణాదిని మోసం చేస్తారా మోదీ: రేవంత్

డిలిమిటేషన్‌పై సీఎం వ్యాఖ్యలు, దక్షిణ రాష్ట్రాల ఆందోళనలు, సీట్ల పెంపు ప్రభావం, కొత్త మోడల్ ప్రతిపాదన.


ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి, గెలవడం కోసం దక్షిణాదిని బలి చేయొద్దంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రదాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, ఈ విషయం తెలిసి కూడా మోదీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిలిమిటేషన్ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అంశంపై దక్సిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత కనపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

డిలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలవడానికి దక్షిణాదిని మోసం చేస్తున్నారా అని ప్రధాని మోదీని ప్రశ్నించినట్లు వెల్లడైంది. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పెంపు దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణను క్రమశిక్షణగా అమలు చేసిన రాష్ట్రాలే ఇప్పుడు నష్టపోతున్నాయని అభిప్రాయపడ్డారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానం అమలైతే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరుగుతాయని చెప్పారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల పరిమితంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న అంతరం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. సీట్ల పెంపు తర్వాత ఈ వ్యత్యాసం మరింత పెరిగి దక్షిణాదికి రాజకీయ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ విధానం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకొస్తున్న చర్యగా ఆయన అభివర్ణించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలను ద్వితీయ శ్రేణి స్థితికి నెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరైనది కాదని సూచించారు. ఈ రెండు అంశాలు వేర్వేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లకు తమ పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

డిలిమిటేషన్‌పై తాను కొత్త మోడల్ ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జీఎస్‌డీపీ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలని అభిప్రాయపడ్డారు. సీట్ల పెంపు విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

2027 పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే మంచిదని పేర్కొన్నారు. దేశ సమగ్రత దృష్ట్యా ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు డిలిమిటేషన్ అంశంపై రాజకీయ చర్చను మరింత వేగవంతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Read More
Next Story