
తెలంగాణకు వయసైపోతోందా ? ఆందోళన కలిగిస్తున్న రిపోర్ట్
2036 నాటికి తెలంగాణ ‘ఏజింగ్ స్టేట్’ జాబితాలో చేరిపోవటం ఖాయమని ఆర్బీఐ నివేదిక జోస్యంచెప్పింది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా తెలంగాణకు యువతే పెద్ద అడ్వాంటేజ్ అని పదేపదే చెబుతుంటాడు. రేవంత్ చెప్పాడని కాదుకాని (Telangana)తెలంగాణలో ఎక్కడచూసినా యువత పెద్దసంఖ్యలోనే కనబడుతుంటారు. కాని మనకు కనబడేదంతా నిజంకాదని ఇపుడు అర్ధమవుతోంది. విషయం ఏమిటంటే తెలంగాణలో వృద్ధుల జనాభా(Aging State) పెరిగిపోతోంది. ఈ విషయాన్ని (RBI)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘‘స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26’’ నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఉత్తరాధి రాష్ట్రాలతో పోల్చితే ధక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో జననాల రేటు తగ్గిపోవటంతో పాటు వృద్ధులజనాభా పెరిగిపోవటంపై ఆర్బీఐ తీవ్ర ఆందోళనను వ్యక్తంచేసింది.
జపాన్, చైనాలో యువత సంఖ్య తగ్గిపోయి ముసలివాళ్ళ జనాభా పెరిగిపోతోందనే రిపోర్టులను మనం చదివుంటాము. వృద్ధుల సంఖ్య ఎక్కువైపోవటం వల్ల ఆదేశాల్లోని ప్రభుత్వాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయనే రిపోర్టులను కూడా చదివే ఉంటాము. అలాంటిది తొందరలోనే తెలంగాణకు కూడా అలాంటి పరిస్ధితే వస్తుందని రిపోర్టులో ఉండటం విస్మయకరమే. 2036 నాటికి తెలంగాణ ‘ఏజింగ్ స్టేట్’ జాబితాలో చేరిపోవటం ఖాయమని ఆర్బీఐ నివేదిక జోస్యంచెప్పింది. ఏజింగ్ స్టేట్ గా మారిపోతుంది అనేందుకు నివేదిక రెండుపాయింట్లను కీలకంగా ప్రస్తావించింది. అవేమిటంటే జననాల రేటు పడిపోతుండటం. తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కి తగ్గిపోయింది. పుట్టేవాళ్ళ సంఖ్య తగ్గిపోతే యువత ఎలా పెరుగుతుంది. అలాగే జీవన ప్రమాణాలు పెరగటం వల్ల మనుషుల ఆయుర్ధాయం పెరిగింది.
సంతానోత్పతికి సంబంధించి సంతానోత్పత్తి రీప్లేస్ మెంట్ రేటు 2.1గా ఉండాలి. అప్పుడే జననాలు, మరణాల రేటు కాస్త బ్యాలెన్స్ అవుతుంది. అయితే తెలంగాణలో మరణాల రేటు తగ్గటంతో పాటు జననాల రేటు 2.1 నుండి 1.5కి పడిపోయింది. అంటే తల్లి, దండ్రులకు సగటున ఇద్దరు పిల్లలు కూడా పుట్టడంలేదు. వివిధ కారణాలతో చాలామంది దంపతులు ఒక్క సంతానంతో మాత్రమే సరిపెట్టుకుంటున్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ సమస్య ఎప్పటినుండో మొదలైపోయింది. ఈ రాష్ట్రాల సరసన ఇపుడు తెలంగాణ కూడా చేరింది.
రీప్లేస్ మెంట్ రేటు తగ్గిపోతోందా ?
పుట్టేవాళ్ళ సంఖ్య తగ్గిపోయి మరణాల సంఖ్యా తగ్గిపోతే సమాజంలో ముసలివాళ్ళ సంఖ్య పెరగక ఏమవుతుంది ? ఇపుడు తెలంగాణలో జరుగుతున్నది ఇదే అని నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. బీహార్ లో 2.9, ఉత్తరప్రదేశ్ లో 2.6, మధ్యప్రదేశ్ లో 2.5 రీప్లేస్ మెంట్ రేటు తగ్గటంలేదు. కాబట్టే పై రాష్ట్రాల్లో పుట్టేవాళ్ళ సంఖ్య, వృద్ధుల సంఖ్య దాదాపు బ్యాలెన్స్ అవుతోంది. పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య తగ్గిపోవటం వల్ల తెలంగాణలో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఆర్బీఐ నివేదిక స్పష్టంగా హెచ్చరించింది. ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో కష్టపడి పనిచేసే యువత సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఉత్పత్తి కర్మాగారాల్లో శారీరక కష్టంచేసే వాళ్ళకు కొరత పెరిగిపోతుంది. ఈ ప్రభావం రాష్ట్ర ఆర్ధిక వృద్ధిరేటుపై తీవ్రంగా పడుతుందని నివేదిక విశ్లేషించింది. ‘వర్కింగ్ ఏజ్ పాపులేషన్’ ఎంత ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రం లేదా దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. దీనినే ‘డెమొగ్రఫిక్ డివిడెండ్’ అనంటారు.
అయితే తెలంగాణలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల డెమొగ్రఫిక్ డివిడెండ్ తగ్గిపోయి విండో ఆఫ్ ఆపర్చునిటీస్ వేగంగా మూసుకుపోతుందని నివేదిక చెప్పింది. తెలంగాణలో 2026 చివరకు పనిచేసే వయస్సున్న జనాభా 67.8 శాతంకు గరిష్టంగా చేరుకుని తర్వాత నుండి క్రమంగా తగ్గిపోతుందని నివేదిక అంచనా వేసింది. 2036 నాటికి పనిచేసే వయస్సున్న జనాభా 66.7శాతానికి తగ్గిపోతుందనే అంచనా నిజంగా ఆందోళన కలిగించేదే. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 2036 తర్వాత కూడా పనిచేసే వయస్సున్న వారిసంఖ్య పెరుగుతునే ఉంటుందని నివేదిక తెలిపింది. దీనికి కారణం సంతానోత్పత్తి రేటు బాగా ఉండటమే.
వృద్ధుల సంఖ్య పెరిగితే నష్టమేంటి ?
వృద్ధుల సంఖ్య పెరగటం వల్ల ఉద్యోగులకు ఇస్తున్న పెన్షన్లు పెరిగిపోతాయి. దీనివల్ల ప్రభుత్వాలపై ఆర్ధికభారం పెరిగిపోవటం ఖాయం. ఇపుడు తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య సుమారుగా 3 లక్షలుంటుంది. వీళ్ళకు ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్ సుమారుగా రు. 2 వేల కోట్లుంటుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యేకొద్దీ పెన్షన్ల సంఖ్య పెరుగుతునే ఉంటుంది. కాబట్టి వీళ్ళకు చెల్లించే పెన్షన్లు కూడా ఏ నెలకానెల పెరుగుతునే ఉంటుంది. అలాగే వృద్ధాప్యం కారణంగా సహజంగా మొదలయ్యే అనారోగ్యాలు పెరుగుతాయి. దీనివల్ల ఆసుపత్రుల చుట్టూ తిరగటం, డాక్టర్లకు చూపించుకోవటం వల్ల మందుల ఖర్చలు కుటుంబాలకు పెరిగిపోతాయి. ఇపుడు చాలామంది ఆరోగ్యబీమా చేయించుకుంటున్నారు కాబట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీలకు క్లైములు బాగా పెరిగిపోతాయి.
ప్రభుత్వంపై సామాజిక భద్రతకు బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులు బాగా పెరిగిపోతాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళలో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నాయి. సో, భవిష్యత్తులో తెలంగాణలో డెమొగ్రఫిక్ డివిడెండ్ సమస్యలు తగ్గకూడదని అనుకుంటే సంతానోత్పత్తి శాతం పెరగాలి. రీప్లేస్ మెంట్ రేటు 1.5 నుండి కనీసం 2.5 శాతంకు పెంచుకోకపోతే భవిష్యత్తులో అంటే ఎప్పుడో కాదు మరో పదేళ్ళల్లోనే జపాన్, చైనా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణలో కూడా పెరిగిపోయి సమాజం అనేక సమస్యల్లో కూరుకుపోవటం ఖాయమని ఆర్బీఐ నివేదిక స్పష్టంగా చెప్పింది.

