ఈవీఎంలు వద్దే వద్దంటున్న మధ్యప్రదేశ్ పెద్దాయన
ఈవీఎం డబ్బాల్లో ఏదో గూడుపుఠాణీ జరుగుతూ ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అనుమానిస్తా ఉంది. ఈ డబ్బాలొద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అంటున్నది. ఇంతకీ గొడవేంటంటే..
ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. దీంతో రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ల ((EVMs)) వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ యోచిస్తున్నారు. రైతులు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఈవీఎంలపై వర్చువల్ యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంలు ప్రజాస్వామ్య ఎన్నికల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని దిగ్విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంల గురించి ఆయన కొన్ని అసాధారణ విషయాలను ప్రస్తావించారు. వాటిపై తనకున్న సందేహాల నివృత్తి చేసేందుకు ఈసీని సమయం కోరారు. కానీ కమిషన్ అతనికి అవకాశం ఇవ్వలేదు.
ఈవీఎంల తొలగింపు..
గత శనివారం దేశ రాజధానిలోని నార్త్ అవెన్యూలో దిగ్విజయ్ సింగ్ (Digvijay singh) ఏర్పాటు చేసిన సమావేశానికి దాదాపు 200 మంది హాజరయ్యారు. రాజకీయ, సామాజిక, వృత్తిపర నిపుణులతో కూడిన ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ‘‘ఈవీఎంల ద్వారా ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగం’’ గురించి అవగాహన కల్పించాలని వారు నిర్ణయించారు.
ఈవీఎం హటావో మోర్చా..
దాదాపు మూడు గంటల చర్చ అనంతరం లోక్‌సభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ ఉదిత్‌రాజ్‌ని ప్రతిపాదిత ఫ్రంట్ కన్వీనర్‌గా నియమించాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న వారు ఈవీఎంల ద్వారా ఓటు వేయడం గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన పోల్స్ ఫలితాలు చాలా నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులతో సరిపోలడం లేదని అభిప్రాయపడ్డారు.
ఈవీఎంలపై ఇండియా కూటమి (INDIA alliance) చర్చించే అవకాశం ఉంది.
ఈవీఎంలను రద్దు చేసి పాత, విశ్వసనీయమైన బ్యాలెట్ పత్రాల విధానాన్ని తీసుకురావాలని దిగ్విజయ్ కోరుకుంటున్నారు. ‘‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ఇది తప్పనిసరి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంత త్వరగా రద్దు చేస్తే అంత మంచిది..
ఈవీఎంల వాడకం వల్ల పేదరికం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడే వారి ప్రాథమిక హక్కును కోల్పోయే అవకాశం గురించి ఉదిత్‌రాజ్ ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈవీఎంలను ఎంత త్వరగా రద్దు చేస్తే అంత మంచిదని పేర్కొన్నారు.
విశేషమేమిటంటే.. డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కొన్ని రోజుల ముందు దిగ్విజయ్ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఇండియా కూటమి నేతల నాల్గో సమావేశం కావడం వల్ల ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
నేతల అభ్యతరం..
మార్చిలో శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్షాలు సమావేశమై ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చర్చించాయి. పవార్ ఇంట్లో సమావేశమైన నేతలు ఈవీఎంల పాత్రపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘంతో మాట్లాడాలని నిర్ణయించారు. అయితే ఓటింగ్ మిషన్‌ను హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం కుదరదని ఎన్నికల సంఘం వాదిస్తోంది. ఈ విషయంలో 2017లో ఎన్నికల కమిషన్ పార్టీలకు సవాల్ కూడా విసిరింది. చివరకు ఈవీఎం వ్యవహారం దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) పేపర్ ట్రయిల్‌లోని కొంత భాగాన్ని లెక్కించడం ద్వారా ఈవీఎంల ప్రామాణీకరణ జరగాలని కోర్టు తీర్పునిచ్చింది. కానీ సంశయవాదులు పేపర్ ట్రయిల్‌ను వంద శాతం లెక్కించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌కు చెందిన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది నరేంద్ర మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తి ముందు బహిరంగ ఈవీఎం ఆడిట్ కోసం పిటిషన్ వేశారు. నవంబర్ 17న తన సొంత రాష్ట్రంలో ఓటు వేసిన తర్వాత మిశ్రా అలా చేశారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై కోర్టు ఎన్నికల సంఘం నుంచి సమాధానం రావాల్సి ఉంది.