
వైఎస్ఆర్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకానికి రేవంత్ ప్రభుత్వం మంగళం ?
రేవంత్ ప్రభుత్వ వైఖరి వల్ల 1.5 లక్షలమంది విద్యార్ధుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడబోతోందా ?
పేదరికం కారణంగా విద్యార్ధులు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫీజు రీఎంబర్స్‌మెంట్’ పథకానికి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడేస్తోందా ? హైకోర్టు తాజాతీర్పు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే గడచిన నాలుగేళ్ళుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకంలో కాలేజీలకు ప్రభుత్వం రు. 10వేలకోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇదేవిషయమై 15 కాలేజీల యాజమాన్యాలు దాఖలుచేసిన కేసును విచారించిన హైకోర్టు ఫీజులను విద్యార్ధుల దగ్గరనుండి వసూలు చేసుకోమని చెప్పింది. ప్రభుత్వం ఫీజు బకాయిలను కాలేజీలకు చెల్లించిన తర్వాత అప్పటికే వసూలుచేసిన ఫీజులను యాజమాన్యాలు విద్యార్ధులకు తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు కండీషన్ పెట్టింది.
ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అదేమిటంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించేది లేదు, యాజమాన్యాలు వసూలుచేసిన ఫీజులను విద్యార్ధులకు తిరిగిచ్చేదీ ఉండదు. దీనికి కారణం ఏమిటంటే గడచిన నాలుగేళ్ళుగా రేవంత్ ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలకు రు. 10 వేలకోట్ల ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలుపడింది. రు. 10 వేలకోట్లను చెల్లించటం అంటే ప్రభుత్వానికి తలకుమించిన భారమనే చెప్పాలి. ప్రతినెలా వేలాది కోట్ల రూపాయల అప్పుల మీద నడుస్తున్న ప్రభుత్వం ఒక్కసారిగా రు. 10 వేల కోట్ల బకాయిలను తీర్చాలంటే జరిగేపనికాదు.
పంచాయితీలకు సుమారు రు. 4 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ సుమారు రు. 12 వేల కోట్లు చెల్లించాలి. ఇలా లెక్కలు తీస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రు. 30 వేల కోట్లదాకా ఉంటుంది. ఇటువంటి పరిస్దితిల్లో కాలేజీల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిలు రు. 10 వేల కోట్లను చెల్లించటం కష్టమే. ఈ విషయం బాగా తెలిసిన కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం బకాయిలను చెల్లించేవరకు విద్యార్ధుల నుండే ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఆమోదించారు. అందుకనే ప్రభుత్వం బకాయిలు చెల్లించేవరకు కాలేజీల యాజమాన్యాలను విద్యార్ధుల నుండే ఫీజులను వసూలు చేసుకునేందుకు అనుమతిస్తు తీర్పుచెప్పారు. అయితే 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే అడ్మిషన్లకే ఈ తీర్పు వర్తిస్తుందని జస్టిస్ మెలికపెట్టారు. మరి ఇప్పటికే బకాయిలుపడిన రు. 10 వేల కోట్ల మాటేమిటి ?
హైకోర్టు తాజా తీర్పుతో ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి రేవంత్ ప్రభుత్వం మంగళంపాడినట్లే అని అర్ధమవుతోంది. ఎలాగంటే 2026-27 విద్యా సంవత్సరం నుండి ఫీజులను విద్యార్ధుల నుండే వసూలు చేసుకోవచ్చని కోర్టు చెప్పింది కాబట్టి యాజమాన్యాలు ఫీజులను విద్యార్దుల నుండి కచ్చితంగా వసూలు చేసుకుంటాయి. ప్రభుత్వం ఫీజులను రీఎంబర్స్ చేసిన తర్వాత యాజమాన్యాలు వసూలుచేసిన ఫీజులను తిరిగి విద్యార్ధులకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫీజుల మొత్తాన్ని కాలేజీలకు చెల్లించేది ఉండదు, యాజమాన్యాలు విద్యార్ధులకు ఫీజుల మొత్తాన్ని తిరిగి ఇచ్చేదీ ఉండదు. కోర్టుతీర్పు కారణంగా పేదవిద్యార్ధులు ఫీజులు కట్టలేక నానా అవస్తలుపడటం ఖాయం. పీజులు కట్టకపోతే యాజమాన్యాలు విద్యార్ధులకు కాలేజీలో అడ్మిషన్లు ఇవ్వవు. దాంతో అర్హులైన పేద విద్యార్ధులు లక్షలమంది ఉన్నత చదువులకు దూరమవటం ఖాయం.
కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర
2004లో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి రైతులకు విద్యుత్ బకాయిల రద్దు హామీతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలు కీలకపాత్ర పోషించాయి. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కూడా పై రెండు పథకాలు కీలకమనే చెప్పాలి. ఇపుడు రేవంత్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కేసీఆర్ ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చినవే. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రిస్టేజియస్ గా అమలుచేసిన ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని రేవంత్ నేతృత్వంలోని అదే కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడేసేట్లుగా వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో దివంగత సీఎం వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తున్న రేవంత్ మరి లక్షలమంది విద్యార్ధులు, కుటుంబాలకు సంబంధించిన ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకాన్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్ధంకావటంలేదు.
లక్షలమందికి వెసులుబాటు
ఒక విద్యార్దికి ప్రభుత్వం ఫీజు కడుతోందంటే అది విద్యార్ధి తల్లి, దండ్రులకు కూడా ఎంతో మేలుచేసినట్లే లెక్క. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకంలో సుమారు 1.5 లక్షలమంది విద్యార్ధులు లబ్దిపొందుతున్నారు. 1.5 లక్షలమంది విద్యార్ధులు లబ్దిపొందుతున్నారు అంటే వారి తల్లి, దండ్రులు లేకపోతే కుటుంబాల్లోని సభ్యులను లెక్క తీసుకుంటే సుమారు 2.5-3 లక్షలమందిపైన ఆర్ధిక భారం తప్పించినట్లే లెక్క.
యాజమాన్యాల కోణం
ఏయాజమాన్యమైనా కాలేజీ పెట్టుకునేది ప్రజాసేవ చేయటానికి కాదన్నది అందరికీ తెలిసిందే. విద్య అన్నది చాలాకాలంగా వ్యాపారమైపోయింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి ముందు విద్యార్ధులే ఫీజులను కట్టేవాళ్ళు. వచ్చే ఫీజులడబ్బుతోనే యాజమాన్యాలు కాలేజీలను అభివృద్ధిచేయటం, ఫ్యాకల్టీని నియమించుకోవంటం, నాన్ టీచింగ్ ఉద్యోగులను నియమించుకునేవి. ఉద్యోగుల జీతబత్యాలు, కాలేజీ డెవలప్మెంట్ అంతా ఫీజులతోనే సరిపోయేది. అలాంటిది ఎప్పుడైతే వైఎస్సార్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రకటించారో అప్పటినుండి విద్యార్ధులు ఫీజులు చెల్లించటం మానేశారు. వైఎస్సార్ ఉన్నంతవరకు బాగానే నడిచిన పథకం తర్వాత ఇబ్బందుల్లో పడిపోయింది.
2014 లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా ఈ పథకాన్ని కొనసాగించారు. ఏదో పద్దతిలో కాలేజీలకు బకాయిలను చెల్లించేవారు. అయితే చివరి రెండేళ్ళు 2020-21 విద్యా సంవత్సరం నుండి బకాయిలు చెల్లింపును కేసీఆర్ ప్రభుత్వం నిలిపేసింది. దానిప్రభావం 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ప్రభుత్వం మీదపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికే వేలాది కోట్లరూపాయల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో అత్యవసరమైన బిల్లులకు మాత్రమే ప్రభుత్వం డబ్బులు చెల్లింపులు చేస్తోంది. ‘అత్యవసరం’ అన్నవాటిల్లోకి ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకంకు చోటు దక్కలేదు. అందుకనే బకాయిలు రు. 10 వేల కోట్లకు పెరిగిపోయింది. యాజమాన్యాల ఒత్తిళ్ళను తట్టుకోలేక ప్రభుత్వం విడుదలచేసింది కేవలం రు. 600 కోట్లు మాత్రమే.
విద్యార్ధులూ ఫీజులు చెల్లించక, ప్రభుత్వమూ బకాయిలు తీర్చకపోతే యాజమాన్యాలు మాత్రం ఎన్ని సంవత్సరాలని జేబులో నుండి డబ్బులు ఖర్చుపెట్టుకోగలవు. ఉద్యోగులకు జీత, బత్యాలు సొంతంగా చెల్లించుకోలేక కొన్ని కాలేజీలు మూతపడంతో ఆకాలేజీల్లోని ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు. మిగిలిన కాలేజీలు కూడా మూతపడితే నష్టపోయేది లక్షల్లోని విద్యార్ధులే కాదు వేలాది ఉద్యోగులు కూడా.
వెంటనే బకాయిలు చెల్లించాలి : ఫాతి
కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రు. 10 వేలకోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రైవేటుకాలేజీల యాజమాన్యసంఘాల సమాఖ్య(FATHI) ఛైర్మన్ నిమ్మటూరి రమేష్ బాబు, ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎస్ రవికుమార్, కార్యదర్శి కే రామదాసు, కోశాధికారి కొడాలి కృష్ణారావు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయల్లోపు ఉన్న బీసీ, అగ్రవర్ణాల కుటుంబాల్లోని విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీల కుటుంబాల వార్షిక ఆదాయం రు. 2 లక్షల లోపున్న విద్యార్ధులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది’’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 150, పీజీ, డిగ్రీ కాలేజీలు 1250, ఇంటర్మీడియట్ కాలేజీలు 1500, బీఈడీ 205, ఫార్మసీ కాలేజీలు 123, ఎంబీఏ+ఎంసీఏ కాలేజీలు 200, నర్సింగ్ కాలేజీలు 70, లా కాలేజీలు 26 ఉన్నాయి’’ అన్నారు. ‘‘కార్పొరేట్ కాలేజీలతో ఫాతికి సంబంధంలేదు’’ అని అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ చెప్పారు. ‘‘పైన చెప్పిన అన్నీకాలేజీల్లో సుమారుగా 1.5 లక్షలమంది విద్యార్ధులు చదువుతున్నారు’’ అని ప్రధాన కార్యదర్శి కేఎస్ రవికుమార్ తెలిపారు. ‘‘విద్యార్ధుల నుండి ఫీజులను వసూలు చేసుకోవచ్చనే తీర్పు 2026-27 విద్యాసంవత్సరం నుండి వర్తించటమే కాకుండా తర్వాత సంవత్సరాల్లో రెన్యువల్స్ కు కూడా వర్తిస్తుంది’’ అని ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్ వివరించారు. ‘‘మొత్తం కాలేజీలయాజమాన్యాల్లో 15మాత్రమే కోర్టుకు వెళ్ళాయని, మిగిలిన కాలేజీల యాజమాన్యాలు కూడా ఇంప్లీడ్ అవ్వాలని నిర్ణయించాయి’’ అని కార్యదర్శి కే రామదాసు చెప్పారు. సో, కోర్టు తీర్పు, యాజమాన్యాల కోణం, ప్రభుత్వం వైఖరిని జాగ్రత్తగా గమనిస్తే ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకానికి మంగళం పాడేస్తున్నట్లే అన్న విషయం అర్ధమవుతోంది.

