బీసీలకు 42శాతం రిజర్వేషన్ అవకాశంలేదా ?
x
BC Reservations row

బీసీలకు 42శాతం రిజర్వేషన్ అవకాశంలేదా ?

రాజకీయ నేతల హామీలు చాలావరకు నీటిమీద రాతల్లాంటివే అనేందుకు బీసీ రిజర్వేషన్ల హామీనే క్లాసిక్ ఉదాహరణగా నిలుస్తోంది


స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కలగానే మిగిలిపోతుందా ? ఇపుడిదే అంశంపై తెలంగాణలో పెద్దఎత్తున చర్చజరుగుతోంది. తొందరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలుచేయటానికి ముఖ్యమంత్రి ఎనుముల (Revanth)రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించనుంది. 18వ తేదీన మేడారంలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించబోతోంది. (BC Reservations)బీసీలకు మున్సిపల్ ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై రేవంత్ ప్రభుత్వం దాదాపు సానుకూల నిర్ణయంతీసుకున్నట్లే. ఈమధ్యనే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం రిజర్వేషన్లను మాత్రమే కల్పించిన విషయం అందరికీ తెలిసిందే.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టిచూస్తే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాద్యంకాదని అర్దమైపోతోంది. పంచాయతీ ఎన్నికలతో పోల్చినపుడు మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17 నుండి 34శాతానికి పెరిగింది. ఎందుకు పెరిగిందంటే గ్రామీణప్రాంతాలతో పోల్చినపుడు మున్సిపాలిటీల పరిధుల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉంటుంది. అన్నీ మున్సిపాలిటీల్లో కలిపి ఎస్సీ, ఎస్టీల జనాభా 15శాతం మాత్రమే. అందుకనే బీసీలకు డెడికేటెడ్ కమిషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసుచేసింది. కమిషన్ సిఫారసును ప్రభుత్వం అనధికారికంగా ఓకే చేసేసింది. వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు, మేయర్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేయటమే ఆలస్యం.

రిజర్వేషన్లలో హెచ్చు తగ్గులు తప్పవా ?


అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత జరగబోయే పరిషత్ ఎన్నికల్లో మళ్ళీ బీసీల రిజర్వేషన్లు తగ్గే అవకాశముంది. ఎందుకంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పాల్టొంటారు. అపుడు ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి బీసీలకు రిజర్వేషన్ తగ్గే అవకాశముంది. ఆ తర్వాత జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరిగి బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశముంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్సీలు, ఎస్టీల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో అమలుచేస్తున్న 34శాతంకన్నా అపుడు రిజర్వేషన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే బీసీల రిజర్వేషన్లు ఎప్పుడూ స్ధిరంగా ఉండదని. అంటే 2023 ఎన్నికల సమయంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు ఎప్పటికీ ఆచరణలోకి వచ్చే అవకాశాలు లేవు అన్న విషయం స్పష్టమవుతున్నది. మరి రేవంత్ ఇచ్చిన హామీ ఏమైనట్లు ? ఏమైందంటే గాలిలో కలిసిపోయినట్లే అని అర్ధంచేసుకోవాలి. రాజకీయ నేతల హామీలు చాలావరకు నీటిమీద రాతల్లాంటివే అనేందుకు బీసీ రిజర్వేషన్ల హామీనే క్లాసిక్ ఉదాహరణగా నిలుస్తోంది. దీనిపైనే బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మండిపడుతున్నారు.

ఈ పరిస్ధితికి కారణం ఏమిటి ?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు సఫలంకాలేదు. అసెంబ్లీలో రెండుసార్లు బిల్లులు పెట్టి తీర్మానం చేయించింది. రెండు బిల్లులు రాష్ట్రపతి, కేంద్ర హాంశాఖ దగ్గర పెండింగులో ఉండిపోయాయి. తర్వాత మరో అసెంబ్లీ సమావేశంలో ఇంకో తీర్మానం చేయించి ఆర్డినెన్స్ జారీకి ప్రయత్నించింది. అసెంబ్లీ ఆమోదించిన ఆర్డినెన్సు ఆమోదంకోసం గవర్నర్ దగ్గరకు పంపితే అది కూడా పెండింగులో ఉండిపోయింది. అసెంబ్లీలో ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని రేవంత్ తో పాటు అందరికీ బాగా తెలుసు. ఎలాగంటే కాంగ్రస్ ప్రభుత్వం తీసుకున్న బీసీల రిజర్వేషన్ల బిల్లును బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఆమోదిస్తుంది ? కాబట్టి రాష్ట్రప్రభుత్వం తీర్మానంచేసిన 42శాతం బీసీల బిల్లుకు ఎన్డీయే ప్రభుత్వం ఆమోదం తెలపదన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లుకు కేంద్రం దగ్గర మోక్షం లభించలేదు.

అసలు జరగాల్సింది ఏమిటి ?

తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే అందుకు కేంద్రప్రభుత్వం సహకారం తప్పనిసరి. ఎలాగంటే, రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సింది కేంద్రప్రభుత్వమే. అంతకన్నా ముందు కేంద్రక్యాబినెట్ ఆమోదించాలి. తర్వాత బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాలి. అవసరమైతే ఓటింగ్ జరిపి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలి. తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపి సంతకం చేయించుకోవాలి. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాతే కేంద్రప్రభుత్వం గెజెట్ విడుదల చేస్తుంది. అప్పుడే రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టబద్దత వస్తుంది. అలాకాకుండా ప్రొసీజర్ ఫాలో అవకుండా ఏకపక్షంగా బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్రప్రభుత్వం అనుకున్నా సాధ్యంకాదు. ఒకవేళ అమలుచేయాలని ప్రయత్నించినా కోర్టులు అంగీకరించవు.

పైన చెప్పిన ప్రొసీజర్ తో సంబంధంలేకుండా ఈమధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచింది. దానిపైన కోర్టులో కేసుదాఖలు కాగానే రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని మహారాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. అందుకనే అలాంటి ప్రయత్నాన్ని రేవంత్ ప్రభుత్వం చేయటంలేదు.

ప్రభుత్వం మోసంచేసింది : జాజుల

42శాతం రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం బీసీలను మోసంచేసిందని బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ మండిపడ్డారు. బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ తన హామీని నిలుపుకోలేకపోయారని ఆరోపించారు. బీసీలకు చట్టబద్దంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్ధానిక ఎన్నికలను నిర్వహించాలన్న తమ డిమాండును ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలతో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు.

Read More
Next Story