
‘హెడ్’ లేని బాసర్ ట్రిపుల్ ఐటి
యూనివర్సిటీకి ఎంతో కీలకమైన పూర్తిస్ధాయి వైస్ ఛాన్సలర్ లేకుండా ఇన్ ఛార్జి వీసీల ఆధ్వర్యంలోనే కాలం గడిచిపోతోంది
బాసర అంటే చదువుల తల్లి సరస్వతిదేవి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసర పట్టణంలో 2008లో యూనివర్సిటి ఏర్పాటుచేశారు. తమపిల్లలకు చదువు బాగా వంటపట్టాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది జనాలు బాసర వచ్చి అక్షరాభ్యాసం చేయిస్తుంటారంటేనే ఈ క్షేత్రం ఎంత ప్రఖ్యాతిగాంచిందో అర్ధమవుతోంది. అలాంటిది అమ్మవారి సమక్షంలో, అమ్మవారి పేరుతో ఏర్పాటుచేసిన యూనివర్సిటిలో చదువుచెప్పే గురువులు ఎలాగుండాలి ? చదివే విద్యార్ధులు ఎలాగ చదవాలి ? అమ్మవారి పేరుతో వెలసిన యూనివర్సిటీ చదువుతో పాటు ఇతరత్రా విషయాల్లో ఎంత ఉన్నతంగా ఉండాలి ? కాని యూనివర్సిటిలో జరుగుతున్నది ఏమిటి, నిత్యం గొడవలే. యూనివర్సిటీకి ఎంతో కీలకమైన పూర్తిస్ధాయి వైస్ ఛాన్సలర్ లేకుండా ఇన్ ఛార్జి వీసీల ఆధ్వర్యంలోనే కాలం గడిచిపోతోంది. పూర్తిస్ధాయి వీసీ లేకపోతే యూనివర్సిటి పాలన ఎలాగ సాగుతుందన్న కనీసపు ఆలోచన కూడా ప్రభుత్వాలకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు చదువుకోవటానికి మంచి అవకావాలను కల్పించాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2008లో ప్రత్యేకించి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధి జ్ఞాపకార్ధం రాజీవ్ గాంధీయూనివర్సిటి నాలెడ్జీ టెక్నాలజీ(RGUKT) పేరుతో మూడు యూనివర్సిటీలను ఏర్పాటుచేశారు. తెలంగాణలోని బాసరలో ఒకటి ఏర్పాటైతే మిగిలిన రెండు ఏపీలోని నూజివీడు, ఇపుపులపాయలో ఏర్పాటయ్యాయి.
2010, ఫిబ్రవరి నుండి 2015, ఫిబ్రవరి వరకు ఖరగ్ పూర్ ఐఐటి ప్రొఫెసర్ ఆర్వీ రాజ్ కుమార్ మొదటి వీసీగా పనిచేశారు. 2015 నుండి ఇప్పటివరకు అంటే గడచిన 11 ఏళ్ళుగా ఇన్చార్జీ వీసీలే యూనివర్సిటీకి దిక్కయ్యారు. యూనివర్సిటీకి పూర్తిస్ధాయి వీసిని నియమించటం, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించటాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేసింది. విద్యావ్యవస్ధను బీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీస్తోందని విద్యావేత్తలు, మేథావులు ఎంతమొత్తకున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. బాసర విశ్వవిద్యాలయానికే కాదు తొమ్మిదిన్నరేళ్ళ హయాంలో చాలా యూనివర్సిటీలకు కేసీఆర్ వైస్ ఛాన్సలర్లను నియమించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాసర విషయంలో అదేపద్దతి కంటిన్యుచేస్తుండటమే బాధాకరం.
ఆర్వీ రాజ్ కుమార్ పదవీకాలం ముగియగానే ఓయూ మాజీ వీసీ సత్యనారాయణను ఇన్చార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. తర్వాత 2017 సెప్టెంబర్లో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను రెండో ఇన్చార్జి వీసీగా నియమించింది. 2020లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన రాహూల్ బొజ్జాను తాత్కాలిక వీసీగా మూడోసారినియమించింది. మళ్ళీ 2022లో బొజ్జా స్ధానంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటరమణ నాలుగో ఇన్చార్జి వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఇన్చార్జీల పద్దతి మారుతుందని అనుకుంటే ఏమీ మారలేదు. ఇపుడు ఐదో ఇన్చార్జి వీసీగా జేఎన్టీయూహెచ్ సీనియర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఉన్నారు. విద్యార్ధులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించినా పెద్దగా ఉపయోగం కనబడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దిక్కులేదా ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే రాజీవ్ గాంధీ పేరును స్మరిస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి రాగానే సచివాలయం ముందు 14 అడుగుల రాజీవ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సందర్భం వచ్చినపుడల్లా రాజీవ్ పేరుతో పాటు వైఎస్సార్ పేరును కూడా రేవంత్ ఎన్నిసార్లు ప్రస్తావించుంటారో లెక్కేలేదు. అలాంటిది రాజీవ్ పేరుతో వైఎస్సార్ ఏర్పాటుచేసిన యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహర్దశ పడుతుందని ఆశించిన వారిని రేవంత్ పూర్తిగా నిరసపరిచారనే చెప్పాలి.
యూనివర్సిటీలో దీర్ఘకాల సమస్యలు ఏమిటంటే పూర్తిస్ధాయి వీసీ లేరు. 146మంది పర్మినెంట్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఉన్నది 19 మంది మాత్రమే. మిగిలిన ఫ్యాకల్టీ అంతా కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీనే. అందుకనే వీళ్ళల్లో చాలామందికి టీచింగ్ పైన శ్రద్ధకనబడటంలేదు. అందుకనే బాసర యూనివర్సిటీలో చాలా విభాగాల్లో క్లాసులు సరిగా జరగటంలేదు. క్లాసులు సరిగా జరగక, మెస్ నిర్వహణలో లోపాల కారణంగా విద్యార్ధులు తరచూ ఆందోళనలబాట పడుతుంటారు. రెసిడిన్షియల్ యూనివర్సిటీలో 9 వేలమంది విద్యార్ధులు చదువుతున్నారు. ఏచిన్న సమస్య తలెత్తినా అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఫుడ్ బాగాలేదని, ఫ్యాకల్టీ లేదని విద్యార్ధులు ఎన్నిసార్లు సమ్మెలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు.
యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ సమస్యలపై మాట్లాడుదామని ‘తెలంగాణ ఫెడరల్’ ప్రయత్నిస్తే మాట్లాడేందుకు ఫ్యాకల్టీలో ఎవరూ ఇష్టపడలేదు. అయితే తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటి రాష్ట్ర అధ్యక్షుడు కడారి ఆకాష్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘యూనివర్సిటీలోని మొత్తం 7విభాగాల్లో 23 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి’’ అని చెప్పాడు. ‘‘అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు 41కి 41 ఖాళీగా ఉన్నాయి’’ అని చెప్పాడు. ‘‘82 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమైతే 63 ఖాళీగా ఉన్నాయి’’ అని తెలిపాడు. యూనివర్సిటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇంతదూరం వచ్చి పనిచేయటానికి ఎవరూ ఇష్టపడటంలేదు’’ అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో బ్రహ్మాండంగా నడిచిన యూనివర్సిటి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన 2014 నుండి నిర్లక్ష్యానికి గురయ్యింది’’ అని చెప్పాడు.
‘‘బాసర పట్టణంలో యూనివర్సిటి పెట్టడమే ప్రభుత్వంచేసిన తప్పు’’ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే పట్టణంలో 6 వేల జనాభా మాత్రమే ఉంది అని చెప్పాడు. ‘‘బాసర పుణ్యక్షేత్రం కాబట్టి ఈమాత్రం ప్రాముఖ్యత వచ్చిందని లేకపోతే ఇదికూడా ఉండదు’’ అన్నాడు. ‘‘పట్టణం అభివృద్ధి జరిగితే యూనివర్సిటీలో కూడా మంచివాతావరణం ఏర్పడుతుంది’’ అని చెప్పాడు. ‘‘క్యాంపస్ లో మంచి సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంకాని లేకపోతే పట్టణంలో మల్టీస్పాషాలిటీ ఆసుపత్రికాని చాలా అవసరం’’ అన్నాడు. ‘‘బాసర పట్టణంలోని జనాభాకన్నా యూనివర్సిటిలో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య చాలా ఎక్కువ’’ అని ఆకాష్ తెలిపాడు. ‘‘క్యాంటిన్ లో ఫుడ్ ఏమాత్రం బాగుండదు’’ అని ఆరోపించాడు. ‘‘ఫుడ్‌క్వాలిటి బాగుండటంలేదు అని ఎంతమొత్తుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు’’ అని మండిపడ్డాడు. యూనివర్సిటీలో నుండి ఒక్కవిద్యార్ధిని కూడా ఉన్నతాధికారులు బయటకు పంపటంలేదు’’ అని ఆరోపించాడు. ‘‘పార్టీల మధ్య ఉన్న విభేదాల వల్ల అటు బాసర పట్టణమూ డెవలప్ కావటంలేదు ఇటు యూనివర్సిటీ కూడా డెవలప్ అవటంలేదు’’ అని ఆకాష్ తేల్చిచెప్పాడు.
‘‘యూనివర్సిటీకి పూర్తిస్ధాయి వీసీ లేకపోవటం వల్ల ఓఎస్డీ మురళీధర్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు’’ అని ఆరోపించాడు. ‘‘విద్యార్ధులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఓఎస్డీనే అసలు కారణం’’ అని మండిపడ్డాడు. ‘ఓఎస్డీ హఠావో..క్యాంపస్ కో బచావో’ అనే నినాదం మొదలైనప్పటినుండి ఓఎస్డీ క్యాంపస్ లో కనబడటంలేదు’’ అని ఎద్దేవాచేశాడు. ‘‘ఇన్చార్జి వీసీతో పాటు ఓఎస్డీని సంతోష్ అనే కాంట్రాక్టర్ వెనుక ఉండి నడిపిస్తున్నాడు’’ అని ఆరోపించాడు. చదువులతల్లి బాసర యూనివర్సిటీ అభివృద్ధిపైనే ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవటం నిజంగా బాధాకరణమనే చెప్పాలి.

