
హైదరాబాద్ లో మరో ‘భోలక్‌పూర్’ ఎదురవుతుందా?
నగరంలోని స్థానిక నీటి వనరులను కాపాడుకోవాలి అని బి.వి. సుబ్బా రావు లాంటి నిపుణులు అంటున్నారు
ఇండోర్ లో 15 మంది ప్రజలు కలుషిత నీరు త్రాగి చనిపోవటం తో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఆ కంగారు మురికి వాడలకు నిలయాలైన మహానాగరాల్లో ముఖ్యంగా వ్యక్తం అయ్యింది. 2019 లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేసిన అధ్యయనం దేశంలోని 21 నగరాలలో ముంబై తరువాత హైదరాబాద్ అత్యంత పరిశుద్దమైన నీటిని సరఫరా చేస్తోందని చెప్పినా ప్రజల్లో నేటికీ నల్లా నీరు నేరుగా తాగగలిగే విశ్వాసం మాత్రం లేదు. దీనికి యిటీవల సరూర్ నగర్ లో లేదా ఏదో ఒక ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా అవుతోందని నిత్యం బయట పడటం కారణం. ఐక్య రాజ్య సమితి 2030 లోపు చేరుకోవాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మంచి నీటి లభ్యత కూడా ఒకటి.
ఇండోర్ లో కలుషిత నీరు త్రాగి 15 మంది చనిపోయిన ఘటన మరువక ముందే సరూర్ నగర్ లోని బాపూనగర్ లో ప్రజలు తమకు కలుషిత నీరు సరఫరా అవుతోందని గుర్తించారు. ఒక వారంగా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుండి తగిన స్పందన రాలేదని వారు చెప్పారు.
అధికారులు తగిన చర్యలు తీసుకోకపోగా కొలాయి నుండి నీరు 20 నిముషాలు వదిలి తరువాత తాగాలని లేదా వాటిని మరిగించి తాగమని చెప్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి యిలాగే కొనసాగితే 2009 లో 14 మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న సికింద్రాబాద్, భోలక్‌పూర్ లాంటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు.
సరూర్ నగర్ లాంటి ఘటనలు మాటి మాటికి జరుగుతుండటంతో మరో సారి భోలక్‌పూర్ లాంటి పరిణామం జరగదనే విశ్వాసం ప్రజలలో లేదు.
పరిస్థితి మెరుగు పడుతోందా?
భోలక్‌పూర్, బంగ్లాదేశ్ మార్కెట్ ప్రాంతంలోని ప్రజలు ప్రస్తుతం సరఫరా అవుతున్న నీరు బాగుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఘటనలో తన ఐదు ఏళ్ల కుమారుడిని కోల్పోయిన మహమ్మద్ షకీర్ (54), తన కుటుంబం కుళాయి నీరు తాగుతున్నామని చెప్పారు. తాగి ‘ఫెడరల్ తెలంగాణ’ కు చూపారు కూడా. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజు మార్చి రోజు నీరు విడుదల అవుతోంది.
“ప్రస్తుతం వస్తున్న నీళ్ళ క్వాలిటి బాగుంది. సిబ్బంది, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి నీళ్ళు సరిగలేదు అని ఏమాత్రం అనుమానం వున్నా తాగవద్దని మాకు చెప్తున్నారు. ఘటన తరువాత త్రాగే నీళ్ళ పైపులను రెండు అడుగుల క్రింద మురుగు నీటి పైపులను నాలుగు అడుగుల క్రిందికి వేశారు. ఆ కాలంలో ఆంబ్యులెన్స్ శబ్దం వింటేనే భయం కలిగేది. అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం చనిపోయిన వారికి రెండు లక్షల నష్ట పరిహారం యిచ్చింది. కానీ కేర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ఖర్చులు యిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు,” అని మహమ్మద్ గుర్తు చేశారు.
2009లో భోలక్‌పూర్ ఘటనలో ఐదు ఏళ్ల కుమారుడిని కోల్పోయిన మహమ్మద్ షకీర్.
ఇకపోతే ఘటన జరిగినప్పుడు టీనేజ్ లో వున్న సయ్యద్ అమీర్(36), భోలక్‌పూర్ ఘటనలో తన పెదనాన్నను కోల్పోయామని తనకు జ్వరం, వాంతులు అయ్యాయన్నారు. “మా అన్న కూడా జబ్బుపడ్డా కొలుకున్నారు,” అని చెప్పారు. ఆ దుర్ఘటన తరువాత తమ కుటుంబం ఆర్వొ కొనుక్కుందని కుళాయి నీరు నేరుగా తాగే ప్రసక్తే లేదని అన్నారు.
సరూర్ నగర్ లాంటి ఘటనలు పునరావృతం పదే పదే అవుతున్న రీత్యా పైప్ లైన్ లైన్ ల నుండి నీళ్ళు నేరుగా తాగే విశ్వాసం ప్రజల్లో రావటం లేదు. సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడుపల్లిలో వాచ్ మ్యాన్ గా పనిచేస్తున్న కె. శివయ్య తన కుటుంబం కుళాయి నీటిని బట్టతో వడగట్టి తాగుతామని చెప్పారు. “రెండు సంవత్సరాల ముందు వరకు నీటి నాణ్యత సరిగా వుండేది కాదు. ఫిర్యాదులు అందుకున్న పై అధికారులు కొత్త పైపులు వేశారు. అప్పటి నుంచి ఏ సమస్యా లేదు,” అన్నారు.
ఈ విశ్వాసం ఆయన ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ లలో వున్న వాళ్ళకు వున్నట్టు లేదు. ఆ ప్రాంతంలో తుల్జాభవాని ఎంటర్‌ప్రైజ్ ను నడిపే రావుల వినోద్ దగ్గర వాళ్ళు 20 లీటర్ల నీళ్ళ క్యాన్ లు కొంటున్నారు. “సాధారణ ఆర్వొ నీళ్ళు రు. 40 కి, కంపెనీ నీరు రు. 110కి అమ్ముతాము. నాలుగేళ్ళుగా ఈ వ్యాపారం చేస్తున్నాను. రోజుకు సాధారణ క్యాన్లు 70, మినరల్ వాటర్ 40 అమ్ముతాను,” అని వినోద్ చెప్పారు.
తన ఖాతాదారులలో హోటళ్లు, హాస్టళ్లు మాత్రమే కాక ప్రైవేట్ గా ఫంక్షన్లు చేసుకునే వారు వున్నారు.
హైదరాబాద్ కు నీటి వనరులు:
జంట నగరాల నీటి అవసరాలను తీర్చటంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్ లే కాక మంజీర, కృష్ణ, గోదావరి నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 1908 లో హైదరాబాద్ లో భీభత్సం సృష్టించిన వరదల నుండి నగరాన్ని కాపాడి తాగునీరు అందించేందుకు చివరి నిజాం ఈ చెరువులను తవ్వించారు. ఈ చెరువుల నుంచి నీళ్ళు గ్రావిటీ ద్వారానే సిటీ కి పైసా ఖర్చు లేకుండా చేరుతాయి. మంజీర, సింగూర్ నీళ్ళు కొంత గ్రావిటీ కొంత పంపుల ద్వారా సిటీ కి తరలించి సరఫరా చేస్తున్నారు. కృష్ణ, గోదావరి నీళ్ళు పంపుల ద్వారా సిటీ కి తరలించి సరఫరా చేస్తారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (Centre For Science and Environment) చేసిన అధ్యయనం ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి నగరానికి నీళ్ళు తీసుకురావటానికి ఒక కిలో లీటర్ కు రు. 6.4 నుండి రు. 18 వరకు ఖర్చు అవుతుంది.
తమ మాధాపూర్ ప్రాంతంలో నీళ్ళు సరిగ్గా రావటం లేదని అన్నారు, ప్రైవేట్ ఉద్యోగి, నీటి హక్కుల కార్యకర్త సాయి తేజ. “సాయంత్రం ఐదు నుండి తొమ్మిది మధ్యన ఎప్పుడైనా నీళ్ళు వదులుతారు. ఇటీవలే వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసి నీళ్ళు రాకపోతే ముందుగా చెప్తున్నారు. కూకట్‌పల్లి, మియాపూర్, కె.పి.హెచ్.బి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంత వాసులు నీళ్ళ ట్యాంకర్ల పైనే ఎక్కువగా ఆధార పడతారు. తుప్పు పట్టిన ట్యాంకర్లలోనే నీటిని తెస్తున్నారు,” అని ఆవేదన తో చెప్పారు.
జీహెచ్ఎంసీ తరఫున ఇళ్లకు నీళ్ళ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసే వాళ్ళు ప్రస్తుతం సరైన డిమాండ్ లేదని చెప్పారు. ఇటీవల పడిన అధిక వర్షాల వలన డిమాండ్ తగ్గి తగ్గి వుంటుందని అన్నారు.
మియాపూర్, జనప్రియ వెస్ట్ సిటీ లో నివాసం వుంటున్న రిటైర్డ్ డెంటల్ డాక్టర్ బి. భారత్ రావు, యిది నిజమే అంటున్నారు. “మాకు రోజు మంజీర నీరు వస్తోంది. కొందరు తమ ఇళ్ళలో పైప్ లైన్ కు మోటార్ లను అమర్చి ఎక్కువ నీళ్ళు వాడుకునే ప్రయత్నం చేయటం సమస్య గా వుంది,” అన్నారు.
సరఫరా పరిస్థితి:
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (Hyderabad Metropolitan Water Supply and Sewerage Board) ప్రతి యింటికి 20,000 లీటర్ల నీళ్ళను డిసెంబర్ 1, 2020 నుండి ఉచితంగా సరఫరా చేస్తోంది. 31 డిసెంబర్, 2021 లోపు పథకంలో భాగం అయిన వాళ్ళు అందరూ దీని క్రింద లబ్ధి పొందవచ్చు. వినియోగదారులు తమ ఇళ్ళలో పైప్ లైన్లకు నీటి మీటర్లను బిగించుకుంటే సరిపోతుంది. 20,000 లీటర్ ల కంటే ఎక్కువ నీరు వాడుకుంటే అందుకు తగిన సొమ్ము చెల్లించాలి.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలోని 21 నగరాలలో ముంబై తరువాత హైదరాబాద్ అత్యంత పరిశుద్దమైన నీటిని సరఫరా చేస్తోంది.
హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 90 శాతం నగరానికి నీరు సరఫరా వుంది. కానీ 70 శాతం మందికి మాత్రమే నీరు సరఫరా అవుతోంది. పరిసర మునిసిపాలిటీలలో 65 శాతం ప్రాంతంలో మాత్రమే నీరు వస్తోంది. ఈ ప్రాంతాల్లో కేవలం 40 శాతం జనాభా మాత్రమే నీళ్ళు పొందుతున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీక నీళ్ళు నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. పైపు లైన్ల ద్వారా మంచి నీళ్ళు సరఫరా అయినా పేదల ఇళ్ళల్లో సరైన నిల్వ పద్దతులు పాటించక పోవటంతో కలుషితం అవుతున్నట్టు అది తేల్చింది.
ఐక్య రాజ్య సమితి 2015 లో 2030 లోపు చేరుకోవాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి, పేదరిక నిర్మూలన, మంచి ఆరోగ్యం లతో పాటు మంచి నీటి లభ్యత కూడా ఒకటి. మన దేశం దీనిపై సంతకం చేసింది.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీనియర్ శాస్త్రవేత్త అనుమేహ వత్స్ ఈ అధ్యయనం చేసిన వారిలో ఒకరు. “నీళ్ళ సరఫరా అధికారులు ఖచ్చితంగా అప్రమత్తం గా వుండి సరఫరా, ధర తో పాటు వాటిని అందుబాటులో వుంచటం పైన దృష్టి పెట్టాలి. నీళ్ళు నిరంతరం సరఫరా చేయటంతో పాటు తగిన ప్రమాణాలు వుండేట్టు చూడటం ముఖ్యం,” అని ఆమె అన్నారు.
ఈ అధ్యయనాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కు చెందిన ఎన్విరాన్‌మెంట్ సర్వైలెన్స్ లేబొరేటరీ చేపట్టింది.
నగరంలోని చెరువులను మూడు దశాబ్దాల పాటు అధ్యయనం చేసిన బి.వి. సుబ్బా రావు వాటి సంరక్షణ పై దృష్టి పెట్టాలని నొక్కిచెప్పారు. “1946 వరకు హుస్సైన్ సాగర్ నీరు త్రాగేవాళ్ళు. కావుని చెరువు నీళ్ళు 2009 వరకు తీసుకున్నారు. స్థానిక నీటి వనరులను కాపాడుకోవటం ముఖ్యం. వాడిన నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకోటంపైనా దృష్టి పెట్టాలి. ఇళ్ళనుండి వచ్చే మురుగు నీటిని తీసుకెళ్లటానికి వుండాల్సిన వ్యవస్థ లేదు. ఫ్లై ఓవర్లు, ఫ్యూచర్ సిటీలపై పెట్టిన దృష్టి కనీస అవసరాలైన నీరు, గాలి లను మనం పెట్టలేదు,” అని ఆయన అన్నారు.

