
గోల్డ్ మ్యాన్ కొండ విజయ్‌పై ఐటీ విచారణ.. ఆస్తులపై ఆరా
గోల్డ్ మ్యాన్ కొండ విజయ్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ. ఆస్తులు, బంగారంపై ప్రశ్నలు.
తెలంగాణ హాకీ చైర్మన్, గోల్డ్ మ్యాన్‌గా పేరుపొందిన కొండ విజయ్ కుమార్‌పై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఆయనపై ఉన్న ఆస్తులు, బంగారం వ్యవహారాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడ్డుకుని, ఢిల్లీలో అదుపులోకి తీసుకుని గంటల తరబడి విచారించారు.
ఎయిర్‌పోర్టులో ఆపివేత
హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి హాజరుకావడానికి గురువారం ఢిల్లీకి బయలుదేరిన విజయ్ కుమార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఐటీ అధికారులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆయన పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆ తర్వాత ఆయనను ప్రయాణానికి అనుమతించారు. కాగా మళ్ళీ ఢిల్లీకి చేరుకున్న విజయ్ కుమార్‌ను అక్కడి ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికో తీసుకెళ్లకుండా కొండ విజయ్‌ను ఎయిర్‌పోర్టులోనే విచారించారు.
అసలు కేసు ఏంటంటే ?
విజయ్ కుమార్ పేరుపై ఉన్న స్థిర, చర ఆస్తులు, ఆయన వద్ద ఉన్న బంగారం మూలాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నలు సంధించారు. దాదాపు 12 గంటలపాటు ఐటీ అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆయన వద్ద ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించినట్లు సమాచారం.
తాత్కాలిక అనుమతి
విచారణ అనంతరం ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని హాకీ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో కొనసాగుతోంది. సేకరించిన వివరాల ఆధారంగా ఐటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

