జగన్ ఆగ్రహం: వేలాదిమంది అంగన్‌వాడీ సిబ్సంది బర్తరఫ్
x

జగన్ ఆగ్రహం: వేలాదిమంది అంగన్‌వాడీ సిబ్సంది బర్తరఫ్

అంగన్‌వాడీల ’చలో విజయవాడ‘ పిలుపు.. ఎస్మాను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్న ప్రభుత్వం


అంగన్‌వాడీల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. చలో విజయవాడకు అంగన్‌వాడీలు పిలుపిస్తే.. ఎస్మాను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. విధుల్లోకి వచ్చిన వారికి పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

ఎవరి పట్టు వారిదే...

అంగన్‌వాడీల ఉద్యమం కీలక మలుపు తీసుకుంది. ఎస్మాను ధిక్కరించిన వారిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. సమస్య పరిష్కారమయ్యే వరకు పట్టు వీడేదే లేదని అంగన్‌వాడీ సంఘాలు భీష్మించాయి.

అంగన్‌వాడీల చలో విజయవాడపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అంగన్‌వాడీల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు అంగన్వాడీల టెంట్లను తొలగించారు. అడ్డుపడిన అంగన్వాడీల అరెస్ట్ చేశారు. ఇవాళ అంగన్‌వాడీలు చలో విజయవాడకు పిలుపు ఇచ్చిన తరుణంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు. ఎస్మా చట్టం అమలులో ఉన్నందున చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అంగన్‌వాడీల సమ్మె ఇవాళ్టికి 42వ రోజుకు చేరింది.

దీక్షలపై పోలీసు లాఠీ...

విజయవాడలో 5 రోజులుగా దీక్షలో ఉన్న అంగన్‌వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వ్యాన్లను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రామలక్ష్మి అనే అంగన్‌వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏలూరుకి తరలిస్తున్న బస్సులో రామలక్ష్మి అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరినా పోలీసులు స్పందించలేదని అంగన్‌వాడీలు ఆరోపించారు. అంగన్‌వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.



విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు

విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్‌వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవల్లి టోల్‌ ప్లాజా వద్ద, ఏలూరు జిల్లా కలపర్రు వద్ద వందలాది మంది అంగన్‌వాడీలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. విజయవాడ ధర్నా చౌక్‌ వద్దకు చేరుకున్న అంగన్‌వాడీలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్‌కు ఇచ్చేందుకు తరలిరావాలని అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.

సర్కారుపై సంఘాల పోరు ఇది

సంతకాల ప్రతులను రెండు విడతల్లో సీఎం కార్యాలయానికి అందజేసేలా అంగన్‌వాడీ సంఘాలు కార్యచరణ చేపట్టాయి. మొదట విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు ఇవాళ విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు మంగళవారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది.

అంగన్‌వాడీలకు ప్రతిపక్షాల మద్దతు..

అంగన్‌వాడీలను తొలగించేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ తీరును సీపీఐ, సీపీఎం, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఖండించారు. ప్రభుత్వం దమనకాండ ఆపకపోతే ప్రత్యక్ష పోరుకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్‌వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్‌ తన అహాన్ని పక్కనబెట్టి అంగన్‌వాడీల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ ప్రభుత్వం తీసేసినా టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Read More
Next Story