
గల్ఫ్ యుద్ధంతో దెబ్బతిన్న ‘జావా లుంగీ’ల వ్యాపారం
ఎక్కడో స్విచ్చ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగిందన్నట్లుగా గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా యాదాద్రి జిల్లాలోని లుంగీల వ్యాపారం నిలిచిపోయింది
అకడెక్కడో జరుగుతున్న గల్ఫ్ యుద్ధ ప్రభావం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోనీ వీవర్స్ మీదపడింది. ఎక్కడో స్విచ్చ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగిందన్నట్లుగా గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా యాదాద్రి జిల్లాలోని లుంగీల వ్యాపారం నిలిచిపోయింది. గల్ఫ్ యుద్ధానికి యాదాద్రిలోని లుంగీల వ్యాపారానికి సంబంధంఏమిటి ? ఏమిటంటే తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, రఘునాధపురం గ్రామాల్లో లుంగీలను నేస్తారు. పై గ్రామాల్లో కొందరు లుంగీలను చేతితో నేస్తుంటే మరికొందరు పవర్ లూమ్ ల ద్వారా లుంగీలను నేస్తున్నారు.
పై గ్రామాల్లో నేస్తున్న లుంగీలు ప్రత్యేకశైలిలో నేస్తారు. ఇక్కడ తయారయ్యే లుంగీలకు జావాలుంగీలు అనిపేరు. ఇలాంటి లుంగీలను గల్ఫ్ దేశాల్లోని దుబాయ్, ఖతార్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాల్లో చాలా ఎక్కువగా కట్టుకుంటారు. ప్రత్యేకించి ముస్లిందేశాలైన పాకిస్ధాన్, బంగ్లాదేశ్ తో పాటు ఆఫ్రికాఖండంలోని ముస్లిందేశాల్లోని జనాలు ఎంతో ఇష్టపడి కడుతుంటారు. ముస్లిం దేశాల్లోని జనాలు ఎందుకు ఇష్టపడతారంటే లుంగీలపైన ఉండే డిజైన్లు, అందుకు వాడుతున్న రంగులనే చెప్పాలి.
యుద్ధం కారణంగా సరుకంతా నిలిచిపోయింది
మామూలుగా జావాలుంగీలకు వాడే ముదురురంగులు, డిజైన్లను ముస్లిందేశాల్లోని జనాలు బాగా ఇష్టంగా కొనుగోలు చేస్తారు. అందుకనే పై గ్రామాలనుండి గల్ఫ్ దేశాలకు ప్రతిఏడు ఎగుమతి అవుతుంటుంది. ఒక్కో లుంగీ ధర సుమారు వెయ్యిరూపాయలుంటుంది. పై గ్రామాల్లో సుమారు 20 మంది మాస్టర్ వీవర్స్ ఉన్నారు. వీరంతా దినసరి కూలీకి చేనేత కార్మికులను ఏర్పాటుచేసుకుని వారితోనే జావాలుంగీలను నేయిస్తుంటారు లేదా తయారుచేయిస్తుంటారు. జిల్లా మొత్తంమీద 5 వేల మరమగ్గాలుండగా సుమారు 25 వేలమంది లుంగీల తయారీపైన ఆధారపడ్డారు. ఎంత తక్కువగా వేసుకున్నా ప్రతి ఏడాది సుమారు రు. 15 కోట్ల విలువైన లుంగీలు గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి.
ఇపుడు సమస్య ఏమిటంటే 13రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్+అమెరికా మధ్య భారీ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ దేశాన్ని నేలమట్టం చేసేయాలన్న పట్టుదలతో యుద్ధం మొదలుపెట్టాయి. వీటికి ధీటుగా ఇరాన్ కూడా స్పందించటంతోనే యుద్ధం భీకరరూపాన్ని సంతరించుకున్నది. పొరుగుదేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్ధావరాలు, సాంకేతిక కార్యాలయాలపై విస్తృతంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. ఫలితంగా గల్ఫ్ దేశాల్లో చాలావరకు యుద్ధంలో భాగమైపోయాయి. అందుకనే పైదేశాల విమానాశ్రయాలు మూతపడిపోవటమే కాకుండా వర్తక, వాణిజ్యాలు పూర్తిగా దెబ్బతినేశాయి.
యుద్ధ ప్రభావం అనేక రంగాలమీద పడినట్లే జావాలుంగీల తయారీమీద కూడా పడింది. ఇపుడు రంజన్ మాసం నడుస్తున్నది కాబట్టి గల్ఫ్ దేశాల్లో జావాలుంగీల అమ్మకాలు చాలా జోరుగా ఉంటాయి. అందుకనే జనవరి, ఫిబ్రవరిలోనే పై గ్రామాల్లోని వ్యాపారులు జావాలుంగీలను తయారుచేసి ఎగుమతికి సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఎవరూ ఐహించని విధంగా యుద్ధం మొదలవ్వటంతో పై దేశాలు తమ వ్యాపారాలను నిలిపేశాయి. దాంతో యాదాద్రి జిల్లాలోని వ్యాపారులు రెడీచేసి పెట్టుకున్న జావాలుంగీలను ఎగుమతిచేయటం సాధ్యంకాక ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. యుద్ధం ఇంకా ఎంతకాలం సాగుతుందో ? ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేకున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగినా తమ లుంగీలను ఎగుమతులు చేసేందుకు అవకాశాలు లేవని ఇక్కడి వ్యాపారులు నిరాసలో ముణిగిపోయారు.
రంజాన్ మాసంలోనే ఎక్కువ : కేమ మల్లేష్
ఇదే విషయాన్ని పెద్దంబర్ పేటలోని జావాలుంగీలను నేసే కేమ మల్లేష్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు తాను నేసే జావాలుంగీలకు గల్ఫ్ దేశాల్లో బాగా డిమాండ్ ఉంది అనిచెప్పారు. తామునేస్తున్న లుంగీల రంగులు, నాణ్యతను ముస్లింలు ఎక్కువగా ఇష్టపడి కొంటారు అనిచెప్పారు. తాను నేసిన లుంగీలను హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బర్కాస్ ప్రాంతంలో అప్పగిస్తే అక్కడినుండి గల్ఫ్ లోని చాలాదేశాలకు ఎగుమతి అవుతుంది అని మల్లేష్ తెలిపారు. ఒక్కో లుంగీ ధర వెయ్యిరూపాయలు ఉంటుంది అని చెప్పారు. ప్రతి నెలలో 40 లుంగీలను తయారుచేసి పంపుతాను అని చెప్పారు. ఏడాదిలో సుమారు 500 జావాలుంగీలను తాను తయారుచేసి అమ్ముతున్నాను అని చెప్పారు. యుద్ధం కారణంగా తమ సరుకును వ్యాపారులు ఎవరు తీసుకోని కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతిచేసే అవకాశాలు దెబ్బతినేసినట్లు మల్లేష్ తెలిపారు. పై గ్రామాల్లోనే కాకుండా జావాలుంగీలను ఓల్డ్ సిటీ ప్రాంతంలోని ఉప్పాలగూడ, కార్వాన్ ప్రాంతంలోని తాళ్ళగడ్డలో కూడా తయారుచేస్తారు అని మల్లేష్ చెప్పారు.
గల్ఫ్ లో రు. 200 కోట్ల వ్యాపారం
గల్ప్ దేశాలకు మాత్రమే ప్రతి ఏడాది ఎగుమతి అయ్యే జావాలుంగీలు సుమారు రు. 200 కోట్ల విలువ ఉంటుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని సిరిసిల్ల, పోచంపల్లి, హనుమకొండ జిల్లాల్లో కూడా జావాలుంగీలు తయారవుతున్నాయి. ఈ లుంగీలను చేనేత పద్దతిలోనే కాకుండా పవర్ లూమ్ ద్వారా కూడా తయారుచేస్తున్నారు. అయితే చేనేతలు తయారుచేసే జావాలుంగీలకే అత్యధిక ఆధరణ ఉంటుంది. చేతితో తయారుచేసే లుంగీల నాణ్యత చాలా బాగుంటుంది కాబట్టి గల్ఫ్ దేశాల్లోని ముస్లింల్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మొత్తం గల్ఫ్ మార్కెట్ మొత్తంలో దుబాయ్ లోనే సుమారు 35 శాతం మార్కెట్ నమోదవుతుంది. గల్ఫ్ లో ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జావాలుంగీలను ప్రదర్శించి అమ్మకాలు చేస్తుంటారు.

