మనవడి వ్యవహారం  దేవెగౌడ ప్రతిష్టను దిగజార్చిందా?
x

మనవడి వ్యవహారం దేవెగౌడ ప్రతిష్టను దిగజార్చిందా?

కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. దేవెగౌడ కుటుంబాన్ని అపఖ్యాతి పాల్జేసింది.


కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. దేవెగౌడ కుటుంబాన్ని అపఖ్యాతి పాల్జేసింది. ప్రజ్వల్‌విగా చెప్పుకుంటున్న అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం, ఆపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చకాచకా జరిగిపోయాయి. ప్రజ్వల్ సెక్స్ స్కాండిల్ రాజకీయంగా మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి పెద్ద కుదుపే అని చెప్పుకోవాలి.

హాసన్‌ నియోజకవర్గం దేవెగౌడ తనయుడు హెచ్‌డి రేవణ్ణ, ఆయన భార్య భవానీ కుటుంబానికి కంచుకోట. వీరి కుమారుడు ప్రజ్వల్ ఇక్కడి నుంచే లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. మరో కుమారుడు సూరజ్ కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు.

కర్నాటకలో పోలింగ్ ప్రారంభం కావడానికి వారం రోజుల ముందు ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో 33 ఏళ్ల ప్రజ్వల్ జర్మనీకి వెళ్లినట్లు చెబుతున్నారు.

28 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో ఏప్రిల్ 26న తొలిదశ పోలింగ్ పూర్తయ్యింది. మే 7న రెండో విడత పోలింగ్ జరగనుంది.

ప్రచారానికి దూరంగా..

అయితే ప్రజ్వల్ వ్యవహారం కారణంగా దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి రేవణ్ణ , మరో కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ప్రస్తుతానికి ప్రచారానికి స్వస్తి పలికారు. 91 ఏళ్ల దేవెగౌడతో పాటు ఆయన కుటుంబ నియంత్రణలో ఉన్న పార్టీ ప్రతిష్టకు చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో దేవేగౌడ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం.

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్పిందే..

కుమారస్వామి కుటుంబాన్ని చుట్టుముట్టిన ఆరోపణలు అంత ఈజీగా కొట్టిపడేసేవి కావు. అందుకే కుమారస్వామి మీడియాతో చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ‘‘ఉప్పు తిన్న వాడు నీళ్లు తాగాలి.. తప్పు చేసిన వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాలి..నేను కానీ (మా నాన్న) హెచ్‌డీ దేవెగౌడ కానీ అలాంటి పని చేయలేదు.మహిళలకు గౌరవం ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాం. తప్పు చేసిన వారిని క్షమించబోమని ’’ అని ప్రజ్వల్ పేరు బయటపెట్టకుండానే కుమారస్వామి విలేఖరులతో అన్నారు.

ప్రజ్వల్‌పై ముందునుంచే వ్యతిరేకత..

బిజెపికి చెందిన ప్రేతమ్‌గౌడ, ఇతరులు ప్రజ్వల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. రెండోసారి జెడి (ఎస్) లోక్‌సభ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణను ప్రకటించడం వారికి ఇష్టం లేదు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థిగా ప్రజ్వల్‌ను బరిలోకి దింపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆసక్తి చూపలేదని సమాచారం.

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు దేవెగౌడ, కుమారస్వామి ఢిల్లీకి వెళ్లినప్పుడు కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందని, ప్రజ్వల్ రేవణ్ణను ఇష్టపడలేదని పార్టీ వర్గాలు ఫెడరల్‌కి తెలిపాయి.

మహిళా సంఘాల ఫిర్యాదు..

ప్రజ్వల్ వ్యవహారాన్ని మహిళా సంఘాలు సీరియస్‌గా తీసుకున్నాయి. కర్నాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఫిర్యాదు చేశాయి. మహిళల గౌరవానికి సంబంధానికి విషయం కావడంతో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ఆ తర్వాతే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఓ మహిళ తనను తండ్రీ, కొడుకులు చాలా కాలంగా శారీరకంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడాదేవెగౌడ కుటుంబానికి బాగా పట్టు ఉన్న హాసన్‌ నియోజకవర్గ పరిధిలోని హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

‘‘ఇది చాలా మంది వీఐపీల ప్రమేయం ఉన్న కేసులా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజ్వల్ , రేవణ్ణ పేర్లు తెరపైకి వచ్చాయి. దర్యాప్తులో మరిన్ని విస్మయకర విషయాలు బయటకు రావచ్చు’’ అని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

బీజేపీకి ఎదురుదెబ్బ..

మే 7న కర్ణాటకలో మిగిలిన 14 లోక్‌సభ స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనుంది. ఈ సమయంలో ప్రజ్వల్ వ్యవహారం పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ఉందని బిజెపి మహిళా నాయకురాలు ఫెడరల్‌ ప్రతినిథితో అన్నారు.

JD(S) నేత ఒకరు ఇలా అన్నారు "మాకు ఎన్నికల చిహ్నంలో 'తలపై వడ్లు మోస్తున్న మహిళా రైతు'ఉంటుంది. అంటే మహిళలకు మేం ఎంత ప్రాధాన్యం ఇస్తామో ఈ చిహ్నమే నిదర్శనం’’ అని అన్నారు. వాస్తవానికి ఇది ఇప్పుడు కేసు మాత్రమే. కోర్టు నుండి వచ్చిన తీర్పు కాదు." అని పేర్కొన్నారు.

పార్టీకి అప్రతిష్ఠ..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ కేవలం 19 స్థానాలను మాత్రమే జేడీ(ఎస్) గెలుచుకోగలిగింది. దీంతో నిరాశ చెందిన దేవెగౌడ యూ టర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీని కాపాడుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ప్రజ్వల్ వ్యవహారం ఆయనకు, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.

Read More
Next Story