కర్నాటకంలో దేవేగౌడ అలుక సీను... రంగంలోకి జేపీ నడ్డా!
x

కర్నాటకంలో దేవేగౌడ అలుక సీను... రంగంలోకి జేపీ నడ్డా!

పొత్తులో భాగంగా జేడీఎస్ నాలుగు లోక్‌సభ స్థానాలను కోరింది. అయితే బీజేపీ రెండింటిని మాత్రమే కేటాయించింది.


కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా కలిసొచ్చే వాళ్లందరితో దోస్తీ చేస్తుంది బీజేపీ. కర్ణాటకలో అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే ధ్యేయంగా జనతాదళ్ (ఎస్)తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. సీట్ల సర్దుబాటు అంశం ఈ రెండు పార్టీలు మధ్య ఒక కొలిక్కిరానట్టే కనిపిస్తుంది. అంతాబాగానే ఉన్నా.. జేడీఎస్ నాలుగు స్థానాలు కోరితే బీజీపీ రెండింటికి ఓకే చేసింది. దీనిపైనే జేడీఎస్ నేతల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని, జెడిఎస్ పెద్దాయన దేవే గౌడను బుజ్జగించేందుకు సెంట్రల్ బిజెపి రంగంలోకి దిగింది.

జేడీఎస్ నేతల అసంతృప్తి..

కర్నాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలున్నాయి. పొత్తులో భాగంగా కేవలం రెండు సీట్లను మాత్రమే బీజేపీ జెడి(ఎస్)కు కేటాయించడంతో ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేతలు జేడీఎస్ నేతలతో మరోమారు చర్చలు జరిగే అవకాశాలున్నాయి.

రంగంలోకి నడ్డా..

సీట్ల పంపకాల్లో అభ్యంతరాలపై వెంటనే జేడీ-ఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతో సంప్రదించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రకు చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి మాండ్య, హాసన్, కోలార్/చిక్కబల్లాపూర్, తుమకూరు - ఈ నాలుగు స్థానాలను జేడీఎస్ కోరింది. అయితే మాండ్య, హాసన్‌ ను మాత్రమే వదులుకునేందుకు బీజేపీ అంగీకరించింది.

నేతల మధ్య చర్చలు..

కాగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని దేవెగౌడ బిజెపిని కోరారని బిజెపి నాయకుడొకరు ఫెడరల్‌తో చెప్పారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలకు జేడీఎస్ నేతలను ఆహ్వానించడంపై దేవెగౌడ, విజయేంద్ర చర్చించారు. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో కూడా మాట్లాడినట్లు విజయేంద్ర మంగళవారం మీడియాకు తెలిపారు.

అన్ని సర్దుకుంటాయి..

‘‘కూటమిలోని చిన్నచిన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. సీట్ల పంపకం, ఇతర విషయాలపై మా జాతీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. మీడియా ఊహిస్తున్నట్లుగా ఏదీ జరగడం లేదు. ’’ అని విజయేంద్ర అన్నారు. 'బీజేపీ, జేడీఎస్‌ల మధ్య చిన్నపాటి విబేధాలు ఉన్నా, అంతా సుఖాంతం అవుతుంది. జెడి-ఎస్‌ను సంతృప్తిపరిచేలా మా జాతీయ నాయకులు తగిన నిర్ణయాలు తీసుకుంటారని మేం విశ్వసిస్తున్నాం. ” అని చెప్పారు స్టేట్ బీజేపీ చీఫ్ విజయేంద్ర.

డీకే సురేశ్‌కు పోటీగా సీఎన్ మంజునాథ్..

కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్‌పై బెంగళూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ జేడీఎస్‌కు సమాచారం అందించింది. దేవెగౌడ కోరిక మేరకే సీపీ యోగేశ్వర్‌ను ఆ నియోజకవర్గం నుంచి పోటీకి దించలేదని బీజేపీ పేర్కొంది. అందుకు దేవెగౌడ కుటుంబం కూడా అంగీకరించింది. ఇక కోలార్ సీటును జేడీఎస్‌కు ఇవ్వవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మాకు ఎలాంటి అసంతృప్తి లేదు..

ఇదిలావుండగా.. వైద్య సమస్యలపై కుమారస్వామి చెన్నై వెళ్లనున్నారు. పార్టీల మధ్య విభేదాలపై ఇరువర్గాల నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ‘‘బీజేపీపై మేం ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్‌ను ఓడించడానికి, మా సంబంధాలను మెరుగుపరచడానికి మేం కృషి చేస్తున్నాం." అని కుమారస్వామి పేర్కొన్నారు.

గతంలో విడివిడిగా.. ఇప్పుడు కలిసి..

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ, జేడీఎస్‌లను హస్తం పార్టీ ఓడించింది. ఇప్పుడు బీజేపీ, జేడీఎస్‌లు ఏకమై కాంగ్రెస్‌కు సవాలు విసరనున్నాయి.

Read More
Next Story