హర్యానాలో బలపరీక్షకు పట్టుబడుతున్నది ఎవరు?
హర్యానాలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.
హర్యానాలో ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బిజెపి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జెజెపి నాయకుడు దుష్యంత్ చౌతాలా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.
‘‘ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకునేందుకు ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను." అని గవర్నర్‌కు రాసిన లేఖలో చౌతాలా కోరారు.
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు - సోంబిర్ సాంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి) ధరంపాల్ గొండర్ (నిలోఖేరి) - రోహ్‌తక్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ కూడా ఉన్నారు.
కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం.
BJP మాజీ మిత్రుడు, JJP నాయకుడు కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశం ఉంది. “రెండు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడింది. వారికి మద్దతు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు - (ఒకరు బిజెపి, మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే) రాజీనామా చేశారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని జేజేపీ చెప్పింది. దీనిపై గవర్నర్‌కు లేఖ కూడా రాశాం.” అని చౌతాలా అన్నారు.
ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు..
లోక్‌సభ ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయం ఉండగా, అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో కర్నాల్, రానియా అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 88. బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. INLD , హర్యానా లోఖిత్ పార్టీకి ఒకరు చొప్పున ఉన్నారు. వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
Next Story