ఎన్టీవీ కేసులో పోలీసులకు క్లాసు పీకిన జడ్జి ?
x
Hyd Commissioner VC Sajjanar and NTV reporters

ఎన్టీవీ కేసులో పోలీసులకు క్లాసు పీకిన జడ్జి ?

అసలు కేసులు నిలబడకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.


కేసుల నమోదు విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరి విషయంలో పోలీసులు కేసులు నమోదు చేసేటపుడే కోర్టులో వీగిపోయేట్లుగా సెక్షన్లు పెడుతున్నారా ? అసలు కేసులు నిలబడకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇన్ని అనుమానాలంటే తాజాగా ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు కేసులో పోలీసులకు జడ్జి ఫుల్లుగా క్లాసు పీకిన కారణంగానే. ఒక మంత్రికి మరో ఐఏఎస్ అధికారికి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానపడేట్లుగా ఎన్టీవీలో ఒక కథనం ప్రసారమైంది. ఆ కథనంపై సమాజంలోని అనేక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనబడింది. దాంతో పోలీసులు వెంటనే ఎన్టీవీ రిపోర్టర్లు, యాంకర్ తదితరులపై కేసులు నమోదుచేశారు.

కేసులు నమోదుచేశారు కాబట్టి రిపోర్టర్లు దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత చారిని విడిచిపెట్టిన పోలీసులు మిగిలిన ఇద్దరిని రిమాండ్ నిమిత్తం మణికొండలోని మెజిస్ట్రేట్ ముందు ఇంట్లో హాజరుపరిచారు. అదుపులోకి తీసుకున్న రిపోర్టర్లకు రిమాండు విధించాలని పోలీసులు కోరారు. కేసును విచారణలో రిమాండ్ రిపోర్టును చదివిన జడ్జి పోలీసులకు బాగా చివాట్లు పెట్టినట్లు సమాచారం. ఎందుకంటే రిమాండ్ రిపోర్టులో ఎక్కడా విక్టిమ్ ఫిర్యాదు, స్టేట్మెంట్ కూడా కనబడలేదు. రిపోర్టర్లపై అసలు కేసు లేదు, విక్టిమ్ ఎవరో తెలీదు, విక్టిమ్ ఫిర్యాదు లేనపుడు కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను జడ్జి నిలదీసినట్లు తెలిసింది. విక్టిమ్ ఫిర్యాదు చేయనపుడు రిపోర్టర్ల మీద ఏమని కేసులు పెట్టారు ? ఏమి సెక్షన్లు నమోదుచేశారని సూటిగా ప్రశ్నించారు. బాధితురాలి ఫిర్యాదు లేనపుడు కేసులు పెట్టినా, కేసులు ఎలాగ నిలుస్తాయన్న జడ్జి ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారని సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు, స్టేట్మెంట్ లేనపుడు ఎవరిమీదా కేసులు పెట్టలేరని చెప్పి జడ్జి పోలీసుల రిమాండ్ రిపోర్టును కొట్టేశారు. కేసు కొట్టేయటమే కాకుండా రిపోర్టర్లు రమేష్, సుధీర్ కు బెయిల్ కూడా మంజూరు చేశారు. అయితే ఇద్దరు తమ పాస్ పోర్టులను సరెండర్ చేయాలని, తలా రు. 20 వేల విలువైన షూరిటీలను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.

రిమాండ్ రిపోర్టు విషయంలో జడ్జీ చేసిన వ్యాఖ్యలు, లేవనెత్తిన అనుమానాలకు పోలీసులు చెప్పిన సమాధానాలతోనే ఎన్టీవీ కథనంపై కేసులు నిలవవు అని అర్ధమైపోతోంది. అలాగే రిపోర్టర్లను పోలీసులు ఈ కేసులో అరెస్టులు చేసేందుకు కూడా లేదని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు లేదా స్టేట్మెంట్ లేకుండా ఎవరిపైనా కేసులు నమోదుచేసేందుకు లేదని, ఒకవేళ చేసినా కేసులు నిలవవని పోలీసులకు తెలీదా ? బాధితురాలి ఫిర్యాదు లేకుండా తయారైన రిమాండ్ రిపోర్టు కోర్టులో చెల్లదని, అరెస్టులు చేసేందుకు లేదని తెలీకుండానే పోలీసులు రిపోర్టర్ల మీద కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారా ? ఇక్కడే పోలీసుల వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎన్టీవీ పై కేసుల వ్యవహారాన్ని ప్రత్యక్షంగా హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనారే పర్యవేక్షిస్తున్నారు. పోలీసు శాఖలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న సజ్జనార్, ఇతర అధికారుల్లో ఎవరికీ తాము తయారుచేసిన రిమాండ్ రిపోర్టు చెల్లదని, రిపోర్టర్లకు జడ్జి రిమాండ్ విధించరన్న చిన్న విషయం తెలీకుండానే ఉంటుందా ? తెలిసినా సరే బాధితురాలి ఫిర్యాదు లేకుండానే రిమాండ్ రిపోర్టు తయారుచేసి జడ్జి ముందు రిపోర్టర్లను ప్రవేశపెట్టారంటేనే కేసులు వీగిపోయేట్లుగా రిమాండ్ రిపోర్టు తయారుచేశారా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరి ఛానల్ ఆఫీసుపైన దాడులు, సోదాలు చేయటం, అందరినీ బెదిరించటం, రిపోర్టర్ల ఇళ్ళపైన దాడులు, ఎయిర్ పోర్టులో రమేష్ అరెస్టు అంతా ఏమిటి ? అవంతా ఉత్తుత్తి వ్యవహారమే అని ఇపుడు అనుమానంగా ఉంది. ఉత్తినే పోలీసులు హడావుడి చేసి జనాల ముందు ఏదో షో చేసినట్లున్నారు. లేకపోతే బాధితులకు లేని సమస్య మధ్యలో పోలీసులకు ఎందుకు ? కథనంలో ఎవరిగురించి అయితే పరోక్షంగా చెప్పారో వాళ్ళిద్దరూ రెస్పాండ్ కాలేదు. బాధితులు పట్టించుకోకపోయినా పోలీసులే ఓవర్ యాక్షన్ చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పోలీసుల వైఖరిపై సర్వత్రా అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story