ఏపీలో జంప్ జిలానీలెందరో!
x
ఏపీలో రాజకీయ పార్టీల జెండాలు

ఏపీలో జంప్ జిలానీలెందరో!

ఒక్క జగన్ సొంత జిల్లా కడప నుంచే ముగ్గురు గోడ దూకుతారట. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 30, 35 వరకు ఉంటుందట. అదే నిజమైతే వీళ్లందర్నీ టీడీపీ వృద్ధ సింహాలు భరిస్తాయా!


(శిరందాసు నాగార్జున, విజయవాడ)

తెలంగాణ సెగ ఆంధ్రాపై పడింది. మూడు నాలుగు నెలలకు ముందే ఏపీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు ఫిబ్రవరిలోనే వస్తాయనే వదంతులతో రాజకీయపార్టీలు మూత కూత పెడుతున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు- వైసీపీ, టీడీపీ- అప్పుడే అప్రకటిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అభ్యర్థుల్ని ప్రకటించడమూ మొదలుపెట్టాయి.

తెలంగాణ తీర్పు అశనిపాతమే...

తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీ గెలుస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే, వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దాంతో రెండు పార్టీలు 2024 ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని వ్యూహాలు రచిస్తున్నాయి.

బాబు అరెస్ట్ తో సీన్ మారిందా..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే టీడీపీ, జనసేన బాగా దగ్గరయ్యాయి. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని మొదటి నుంచి జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ గట్టిగానే చెబుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఉంటుందని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీట్ల సర్దుబాటే ఇక మిగిలి ఉంది. టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీని ప్రకటించాయి. మ్యానిఫెస్టోపై కసరత్తూ సాగుతోంది.

ఎవరి సీటు గల్లంతవుతుందో...

ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ‘‘ అంతర్గత సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తాం’’ అని తేల్చి చెప్పారు. పనితీరు బాగాలేని నేతలను పక్కన పెడతామని హెచ్చరించారు. దాంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. సరిగ్గా ఇదే టైంలో వైసీపీలోనూ ఉక్కపోత షురూ అయింది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోవడం వైసీపీకి అశనిపాతమైంది. అక్కడ విమర్శలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందేమోనన్న భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో 50,60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ 18 మందిపై వేటు తప్పదా..

ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన శాసనసభ్యత్వానికి, పార్టీకి ఏక కాలంలో రాజీనామా చేశారు. ఇది ఆ పార్టీకి పెద్దదెబ్బ. ఇది ట్రైలర్ మాత్రమేనని పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. పార్టీ బలోపేతం, గెలుపు కోసమే ఈ నిర్ణయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. ఇంకా మార్పులు ఉండొచ్చని కూడా చావు కబురు చల్లగా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నది మంత్రి బొత్స సత్యనారాయణ మాట.

గోడ దూకేది ఎందరో..

దీంతో చాలామంది వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతల ద్వారా చంద్రబాబు కలిసి మంతనాలు సాగిస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప నుంచే ఎమ్మెల్యేలు ముగ్గురు గోడ దూకుతారన్న ప్రచారం నడుస్తోంది. ఈ సంఖ్య 30 వరకు ఉండొచ్చని అంచనా. అదే జరిగితే పార్టీని ఇంతకాలం అట్టిపెట్టుకుని ఉన్న తమ గతేంటని పాత టీడీపీ వాళ్లు వాపోతున్నారు. గోడ దూకే బ్యాచీని దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధిష్టానం పక్కాగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల కోడి కూయకముందే ఆంధ్రా నేతలు కూత పెడుతున్నారు. అస్త్రశస్త్రాలు సన్నద్ధం చేసుకుంటున్నారు.

Read More
Next Story