
హనుమంతుడు లంకను తగలబెట్టినట్లుగానే ఇపుడు ఇరాన్ గల్ఫ్ ను తగలబెడుతోందా ?
దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాలపై బాంబులు, మిస్సైల్స్ తో విరుచుకుపడి సర్వనాశనం చేస్తోంది
గల్ఫ్ యుద్ధంలో ఇపుడు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే రామయణంలో హనుమంతుడు లంకను కాల్చి బూడిదచేసిన ఘటనే గుర్తుకొస్తోంది. సీతమ్మవారి జాడను వెతుక్కుంటు హనుమంతుడు లంకలో కాలుపెడతాడు. అశోకవనంలో అమ్మవారి జాడను కనుక్కుంటాడు. సీతమ్మకి చెప్పాల్సింది చెప్పి మాట్లాడాల్సింది మాట్లాడుతున్నపుడు కాపలాగఉన్న రాక్షసులు హనుమంతుడిని గమనిస్తారు. వారినుండి తప్పించుకునే క్రమంలోనే హనుమంతుడు అశోకవనాన్ని పీకి పందిరివేస్తాడు. విషయం తెలుసుకున్న రావణాసురుడు హనుమంతుడిని బంధించి సభకు తెమ్మని ఆదేశాలిస్తాడు.
హనుమంతుడిని పట్టుకున్న రాక్షసులు రావణసభకు తీసుకొస్తారు. హనుమంతుడికి బుద్ధిచెప్పాలన్న ఉద్దేశ్యంతో రావణాసురుడు హనుమంతుడి తోకకు నిప్పుపెట్టమని ఆదేశిస్తాడు. ఆ ఆదేశమే లంకకు చేటుతెస్తుందని రావణుడు ఊహించడు. తోకకు నిప్పుపెడితే ఆమంటకు తట్టుకోలేక హనుమంతుడు లంకనుండి పారిపోతాడు అని రావణుడు భావిస్తాడు. అయితే హనుమంతుడు ఏమిచేస్తాడు ? తోకకు అంటించిన నిప్పుతోనే మొత్తం లంకలో మంటలుమండిస్తాడు. ఒకటనుకుంటే మరోటి అయ్యిందని రావణుడు తలపట్టుకుంటాడు.
తలపట్టుకుంటున్న ట్రంప్
ఇపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్ధితి కూడా అచ్చంగా అలాగే అయ్యుంటుంది అనటంలో సందేహంలేదు. అకాస్మత్తుగా యుద్ధం మొదలుపెట్టి ఇరాన్ ను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంలో మొదటిరోజు అధినేత అయుతుల్లా అలీ ఖమేనితో పాటు మరో 40 మంది ముఖ్యనేతలు, కమాండర్లు కూడా చనిపోయారు. ఇంకేముంది ఇరాన్ తమ వశం అయిపోయినట్లే అనుకున్నాడు ట్రంప్. ఇక్కడే ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు తప్పులో కాలేశారు.
ఎలాగంటే, క్షిపణులతో నాశనమైపోవటం కాదు పొరుగు దేశాలన్నింటినీ ఇరాన్ యుద్ధంలోకి లాగేసింది. తాను ఏమైపోయినా పర్వాలేదు తనతో పాటు గల్ఫ్ లోని ఇతర దేశాలు కూడా నాశనమైపోవాలని ఇరాన్ కోరుకున్నట్లుంది. అమెరికా, ఇజ్రాయెల్ వల్ల తనకు ఎప్పటికైనా ముప్పు తప్పదన్న ఆలోచన ఇరాన్ లో ఉంది. అందుకనే మిలిటరీ, ఆయుధపరంగా సిద్ధంగా ఉంది. తనపైన అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణలను ప్రయోగిస్తుంటే ఇరానేమో దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాలపై బాంబులు, మిస్సైల్స్ తో విరుచుకుపడి సర్వనాశనం చేస్తోంది. పై దేశాల్లోని అమెరికా సైనిక స్ధావరలపై దాడులు చేస్తున్నామని చెబుతునే ఇతర ప్రాంతాలపైన కూడా పదేపదే దాడులు చేస్తోంది ఇరాన్. ఇరాన్ దెబ్బకు పై దేశాలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో దిక్కుతోచటంలేదు.
చాలా దేశాల్లో మంటలు మండుతున్నాయి
ఇరాన్ బాంబు, క్షిపణలు దాడులతో పైన చెప్పిన దేశాల్లోని చమురు క్షేత్రాలు, వాణిజ్య సముదాయాలు, కీలకమైన ఆఫీసుల భవనాలు, చమురు నిల్వలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. చివరకు దుబాయ్ లో ఎంతో పాపులరైన పామ్ గ్రోవ్ ఐల్యాండ్స్, బుర్జ్ ఖలీఫా హోటల్ కూడా బాంబులు, క్షిపణుల కారణంగా బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తమదెబ్బకు లొంగిపోతుంది అనుకున్న ట్రంప్ ఇరాన్ చేస్తున్న పనిచూసిన తర్వాత పెద్ద షాక్ కు గురయ్యాడనే చెప్పాలి.
ఒకపుడు ఇరాక్ తో జరిగిన సుదీర్ఘ యుద్ధం కారణంగా ఇరాన్ యుద్ధంలో ఆరితేరిపోయింది. గల్ఫ్ దేశాలన్నింటిలోకి ఇరాక్, ఇరాన్ మాత్రమే ఆయుధాల పరంగా చాలా బలమైనవి. అమెరికా కారణంగా సంవత్సరాల క్రితమే ఇరాక్ దెబ్బతినేసింది. కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ పై యుద్ధంచేసేంత సీన్ ఏ దేశానికి లేదు. ఇరాన్ నుండి కాని లేదా ఏ ఇతర దేశాల నుండి కాని తమపై యుద్ధం జరిగే అవకాశాలు లేవన్న ఉద్దేశ్యంతో మిగిలిన దేశాలు ఆయుధాలను సమకూర్చుకోవటం, మిలిటరీని పటిష్టం చేసుకోవటంపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఏదైనా అవసరంవస్తే అమెరికా చూసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాయి. వస్తున్న ఆయిల్ డబ్బుతో అంతర్జాతీయ నగరాలను నిర్మించుకోవటం, పర్యాటకులను ఆకర్షించటంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాయి.
ఇలాంటి పరిస్ధితుల్లో సడెన్ గా మొదలైన యుద్ధం కారణంగా ఇరాన్ తమపై దాడులు చేస్తుంటే తిప్పికొట్టడం ఎలాగో తెలీక పై దేశాలు బిత్తరపోతున్నాయి. నిజానికి గల్ప్ దేశాలకు జరిగిన నష్టాలగురించి ప్రపంచానికి సరైన సమాచారం లేదనే అనిపిస్తోంది. పై దేశాల్లో ప్రజాస్వామ్యం లేదుకాబట్టి జరిగిన నష్టాల గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియటంలేదు. అంతర్జాతీయ విమానాశ్రయాలు మూతపడ్డాయంటేనే పై దేశాల్లోని పరిస్ధితులు ఎలాగున్నాయో ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే. యుద్ధం ముగిసిన తర్వాత కాని ఇరాన్ కారణంగా గల్ఫ్ దేశాలకు జరిగిన నష్టాలు బయటపడవేమో.

