
‘రాజ్యాంగం కోసం పోరాడదామనే పోటీలో దిగాను... నా నోరు మూయించ లేరు’
ఎంపిలంతా మనస్సాక్షి మాట విని ఓటేయాలంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి
-జి. రాం మోహన్
ఉపరాష్ట్రపతి ఎన్నికల పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నిక కాదు కాబట్టి పార్లమెంటు సభ్యులంతా అంతరాత్మ ప్రభోధానుసారం ఓటేయాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జిస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కోరారు.
సెప్టెంబర్ 9 జరిగే ఉప రాష్ట్రప్రతి ఎన్నిక ప్రచారంలో ఉన్న ఆయన హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కాంగ్రెస్, వామపక్ష నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం నాడు 'తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్' ల సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పుడు జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, నిరసన తెలిపే ప్రజల హక్కును గౌరవించి దానిని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఒక సైద్దాంతిక పోరాటం అని ఆయన వర్ణించారు.
తాను ప్రజాస్వామిక విలువలను నమ్మే ఒక లిబరల్ ప్రజాస్వామ్యవాదిని చెబుతూ ఏ పార్టీ లోనూ తాను సభ్యుడిని కానని, 63.7 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల తరపున పోటీలో వున్నానని జస్టిస్ రెడ్డి అన్నారు.
ఒక తెలుగు వాడిగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఏమి చెప్తారన్న ఒక ప్రశ్నకు సమాధానంగా తనకు అన్నీ పార్టీ లతో నూ మంచి సంబంధాలు వున్నాయని ఆయన చెప్పారు.
"చంద్ర బాబు నాయుడు ఒక విజనరీ లీడర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మంచి నాయకుడు. సెప్టెంబర్ 9 వరకు సమయం వుంది. ఈ లోపు అందరినీ కలుస్తాను. కలవలేకపోతే ఫోన్ లో మాట్లాడుతాను. నేను తెలుగు వాళ్ళు తలదించుకునే పనులు చేయలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్టీల పరంగా జరగదు. సభ్యులు అందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారే. నేను వారి అంతరాత్మ ప్రకారం వోటు వేయమని అడుగుతున్నాను. దేశం లో అన్నీ వ్యవస్థలు మసక బారిపోతున్న సందర్భం ఇది. అందులో న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదు," అని ఆయన అన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని తనను కాంగ్రె స్ సంప్రదించిందని అయితే, తాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరిస్తేనే పోటీ చేస్తానని తెలిపినట్లు ఆయన వెల్లడించారు. తన పోటీ వెనక ఒక కారణం ఉంది, బాధ్యత ఉంది అని ఆయన అన్నారు.
"అధికారం విచక్షణ కోల్పోతున్నపుడు రాజ్యాంగం కళ్లెం వేస్తుంది. మాకు పార్లమెంటులో మెజారిటీ వుంది ఏమైనా చేస్తాము అంటే కుదరదు. ఇపుడు దేశంలో సర్వత్రా భయం ఆవరించింది. చదువుకున్న వాళ్ళు, చదువుకోనివాళ్ళు, న్యాయవాదులు, వృత్తి నిపుణులు, జర్నలిస్ట్ లు అన్నీ వర్గాలను ఈ భయం ఆవరించింది. అధికారంలో ఉన్న వాళ్లు ఈ భయాన్ని సృష్టించ కలిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యంగ సంస్థలు ఒకదాని తరువాత ఒకటి నిర్వీర్యం అవుతున్నాయి. దాని వలన ప్రజాస్వామ్య ప్రక్రియ తిరోగమన పాలు అవుతోంది. దీనిని అరికట్టడానికి ఏదో విధంగా కృషి చేసేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాను. ఇది మాట్లాడాల్సిన సమయం, నిలబడాల్సిన సమయం, ఎదుర్కోవలసిన సమయం అని అనిపించింది అందుకే బరిలో వున్నాను,” ఆయన అన్నారు.
బీహార్ లో వోటర్ల జాబితా సవరణ (sir) పేరుతో ప్రజలకు వోటు హక్కు లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
"మనకు రాజ్యాంగం రాక ముందే వోటరు జాబితా తయారయ్యింది. ఎలెక్షన్ కమిషన్ తన విధులు నిర్వర్తించాలి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరపడం దాని రాజ్యాంగం బాధ్యత. సరైన వోటర్ల జాబితా తయారు చేయడం ముఖ్య భాగం. ఆధార్ కార్డులు యిచ్చే టప్పుడు అది మన హక్కు అన్నారు. హక్కు అంటే ఏమిటి? అందులో సామాన్యుడికి వోటు హక్కు లేదా? తనను ప్రశ్నించే వాళ్ళు లేరని కేంద్రం అని అనుకుంటున్నది. ఈ అంశాలమీద మీడియా లో సరైన చర్చలు జరగాలి. దానికి నేను ఉపయోగ పడాలనే ప్రతిపక్షాల అభ్యర్థి గా వుండటానికి ఒప్పుకున్నాను. నేను భవిష్యత్తులో కూడా యే పార్టీ లో చేరను," అని ఆయన అన్నారు.
తన ప్రత్యర్థితో ముఖా ముఖి చర్చ జరిగి, తామె ఎవరెమిటో ప్రజలకు తెలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. "తాను ఒక భావజాలానికి చెందిన వాడని బీజేపి పరిచయం చేసింది. నన్ను నక్సలైట్ ల మద్దతు దారుగా చూపుతోంది. అలా ముద్ర వేసి నా నోరు మూయించాలని చూస్తున్నారు. కానీ నేను అంత తొందరగా ఓటమిని అంగీకరించే రకం కాదు. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చ జరగాలి. పార్లమెంట్ సభలు సజావుగా జరగాలంటే సభాధ్యక్షుడి పైన విశ్వాసం వుండాలి. తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఒక వర్గం భావించటం వల్లే సభల్లో గందరగోళం వస్తున్నది," అని ఆయన అభిప్రాయ పడ్డారు.
సల్వాజుడుమ్ (Salwa Judum) తీర్పు మీద కొందరు చేస్తున్న వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఆ తీర్పు తన ఒక్కడి తీర్పు కాదని, ఆ తీర్పును దానిని మరో 13 మంది జడ్జ్ లు సమీక్షించి ఒక్క అక్షరం ముక్క కూడా మార్చలేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సల్వాజుడుమ్ కు మరో రూపమే నేటి డీఅర్జీ (District Reserved Guards) ల సుదర్శన్ రెడ్డి అన్నారు.