
బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో 32 మంది మృతి
సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం పేలి 18 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో అత్యధికులు మహిళలే. సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. వేట్లపాలెం - జి.మేడపాడు మధ్య ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో సుమారు 18 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా మొత్తం ఈ ప్రమమాదంలో 32 మంది మరణించినట్లు సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమద్యంలో పలువరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో అత్యధికులు మహిళలేనని సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు, శరీర భాగాలు సమీపంలోని పంట పొలాల్లోకి ఎగిరిపడటంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ప్రమాదం జరిగిన తీరు
శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులు టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మందుగుండు సామాగ్రి పేలింది. ఈ పేలుడు ధాటికి ఐదు కిలోమీటర్ల మేర శబ్దం వినిపించడమే కాకుండా, పక్క గ్రామంలోని పాఠశాల భవనం స్లాబ్‌కు కూడా పగుళ్లు వచ్చాయి. ప్రమాద సమయంలో సుమారు 20 మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు.
సురక్షిత ప్రమాణాల లోపం
వేట్లపాలెం ప్రాంతం ఏటా రూ. 60 కోట్లకు పైగా బాణసంచా వ్యాపారానికి నిలయంగా ఉంది. అయితే, నిబంధనలు పాటించకపోవడం, అజాగ్రత్త వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతంలో 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో కూడా 18 మంది మరణించిన ఘటనను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. జిల్లాలో అనేక లైసెన్స్‌డ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, తరచూ ఇలాంటి విషాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
'సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఘటనాస్థలికి బయలుదేరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

