
కేసీఆర్-హరీష్ కు తలనొప్పిగా తయారైన కవిత
కవిత ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక తండ్రి, బీఆర్ఎస్ అధినేత (KCR)కేసీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్(Harish Rao) తలలు పట్టుకుంటున్నారు
బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలపై కేసీఆర్ లేదా హరీష్ రావు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. గట్టిగా చెప్పాలంటే కవిత ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక తండ్రి, బీఆర్ఎస్ అధినేత (KCR)కేసీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్(Harish Rao) తలలు పట్టుకుంటున్నారు. 2025వ సంవత్సరం ప్రధాన ప్రతిపక్షం (BRS)బీఆర్ఎస్ ను సమస్యల్లోకి నెట్టేసిందనే చెప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో పోటీచేస్తే ఒక్కటంటే ఒక్కసీటులో కూడా గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా ఫలితంతో బాగా ఇబ్బందిపడుతున్న పార్టీ మీద కల్వకుంట్ల కవిత(Kavitha) పెద్ద బండరాళ్ళు వేస్తున్నారనే చెప్పాలి. తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్కవటంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలవానలాగ మారిపోయి చివరకు ఆమెను పార్టీలో నుండి బయటకు గెంటేసేదాకా వెళ్ళింది. పార్టీలో నుండి బయటకు వచ్చేసిన కవిత పార్టీపైన యధేచ్చగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. కవిత వైఖరి పార్టీని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోందనే చెప్పాలి.
పార్టీకి కవిత సమస్యగా ఎందుకు మారారని తెలుసుకోవాలంటే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బహిరంగసభ నుండి మొదలుపెట్టాలి. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో ఈసంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగసభ జరిగింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగించారు. బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగంపై కూతురు కవిత తన తండ్రికి మేనెలలో ఆరుపేజీల లేఖ రాశారు. తర్వాత ఆమె అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఆమె అమెరికాలో ఉండగా తండ్రికి రాసిన లేఖ లీకుల రూపంలో మీడియాలో ప్రత్యక్షమైంది. దాంతో పార్టీలో కలకలంమొదలైంది. ఆ లేఖలో ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్లను ఆమె ప్రస్తావించారు.
ఎప్పుడైతే కేసీఆర్ ప్రసంగంలోని మైనస్ పాయింట్లను ప్రస్తావించారో ఆ పాయింట్లే బాగా హైలైట్ అయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడకపోవటం, బీజేపీని టార్గెట్ చేయకపోవటం, ఉర్దులో మాట్లాడలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాట్లాడలేదని, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. ప్రత్యేకంగా ఎవరి పేరూ చెప్పకపోయినా కొన్నిదెయ్యాలు కేసీఆర్ ను ఏవిధంగా తప్పుదారిపట్టిస్తున్నాయి, పార్టీ ఓటమిలో దెయ్యాల పాత్ర ఏమిటనే మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. పై అంశాలతో కవిత రాసిన లేక బయటపడటం పార్టీలో పెద్ద సంచలనమైపోయింది. వారంరోజుల తర్వాత అమెరికా నుండి తిరిగొచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతు ఆ లేఖను తానే రాసానని అంగీకరించటమే కాకుండా తండ్రికి రాసిన లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పాలని పదేపదే డిమాండ్ చేయటం మరింత సంచలనంగా మారింది.
రెచ్చిపోతున్న కవిత
అప్పటినుండి పార్టీలో కవితను తిరుగుబాటు నేతగానే చాలామంది పరిగణించారు. కవిత రాసిన లేఖపైన తండ్రి కేసీఆర్, సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగా ఏమీ స్పందించలేదు. అయితే రోజులు గడిచేకొద్దీ కేటీఆర్ ను కవిత టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. పార్టీ పగ్గాలు అందుకోవటానికి వారసులుగా మగవాళ్ళేనా ఆడవాళ్ళు పనికిరారా అంటు మీడియాలో ప్రశ్నించటంతో పాటు కేటీఆర్ పైన పరోక్షంగా ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. దాంతో పార్టీలో కవిత వ్యవహారం తండ్రి, కొడుకులకు పెద్ద సమస్యగా మారిపోయింది. కవితను ఆరోపణలు చేయనీయకుండా నియంత్రించలేక అలాగని ఆమెను స్వేచ్చగా వదిలేయలేక నానా అవస్తలు పడ్డారు.
అదేసమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రకటించటమే కాకుండా సీబీఐ దర్యాప్తు కోరుతు హోంశాఖకు లేఖ కూడా రాశారు. ఆ విషయమై కాళేశ్వరంలో కొందరు అవినీతికి పాల్పడ్డారని చెప్పిన కవిత అవినీతి మరకను కేసీఆర్ కు అంటించారని చెప్పారు. తాజాగా నాగర్ కర్నూలులో మాట్లాడుతు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించటం సంచలనంగా మారింది. అలాగే తనతో పాటు భర్త అనీల్ కుమార్ ఫోన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు చెప్పటం కలకలం రేపింది. అప్పటివరకు కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలే జరగలేదని సమర్ధించుకుంటున్న కేటీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీమంత్రి హరీష్ రావు తదితరులకు కవిత ఆరోపణలు నెత్తిన పిడుగులాగపడ్డాయి.
బీఆర్ఎస్ అవినీతే టార్గెట్
కాళేశ్వరంలో అసలు అవినీతే జరగలేదని తాము ఒకవైపు చెబుతుంటే పార్టీ నేత, కేసీఆర్ కూతురు కవితేమో అవినీతి జరిగిందని అయితే ఆ అవినీతితో కేసీఆర్ కు సంబంధంలేదని చెప్పటంతో కేటీఆర్, హరీష్ కు ఏమి మాట్లాడాలో అర్ధంకాలేదు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను కవిత దగ్గరుండి చూశారు కాబట్టి ఆమె ఆరోపణలకు జనాలు విలువిస్తారు.
అలాగే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా పార్టీ అధినేతలను కవిత ఆరోపణలు బాగా ఇరుకునపడేశాయి. టెలిఫోన్ ట్యాపింగ్ లేదు ఏమీలేదని సమర్ధించుకుంటున్న కేటీఆర్ కు కవిత ఆరోపణలతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది. ఫోన్ ట్యాపింగ్ పై కవిత ఆరోపణలకు ఏమి సమాధానం ఇవ్వాలో అర్ధంకాక తండ్రి, కొడుకుల నోళ్ళు పెగలటంలేదు. కేసీఆర్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారన్న విషయం కలకలం రేపింది. రాజకీయ ప్రత్యర్ధులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, కొందరు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులు, కేంద్రమంత్రుల్లో కొందరి ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు బయటపడింది. ట్యాపింగ్ జరగలేదని సమర్ధించుకుంటున్న కేటీఆర్ చెల్లెలు ఆరోపణలు చేసిన దగ్గర నుండి మళ్ళీ ఇప్పటివరకు నోరిప్పలేదు.
ట్యాపింగ్ అరాచకం
విషయం ఏమిటంటే మీడియాతో కవిత మాట్లాడుతు తనిభర్త అనీల్ కుమార్ ఫోన్ తో పాటు పనివాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పటానికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. ఇంటల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయటానికన్నా మించిన అరాచకం ఇంకోటుంటుందా అని ప్రశ్నించారు. కవిత ఆరోపణలకు అర్ధం ఏమిటి ? తమ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంగీకరించటమే కదా. ట్యాపింగ్ కు కేసీఆర్, కేటీఆరే బాధ్యులని కవిత పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయ్యింది.
తన ఆరోపణలతో పార్టీలో బాగా వేడిపుట్టించిన కవిత అప్పటినుండి డైరెక్టుగా హరీష్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావుపై ఆరోపణలతో విరుచుకుపడటం మొదలుపెట్టారు. ఈఇద్దరే తనతండ్రిని అనేక అంశాల్లో తప్పుదోవపట్టించారు అనే అర్ధం వచ్చేట్లుగా ఆరోపణలతో రెచ్చిపోయారు. పనిలోపనిగా కేటీఆర్ నాయకత్వాన్ని తాను ఎప్పటికీ అంగీకరించేదిలేదని కూడా పెద్ద బాంబుపేల్చారు. రాజకీయ ప్రత్యర్ధులు చేసే ఆరోపణలను తిప్పకొట్టగలిగిన కేటీఆర్, హరీష్ తదితరులు సొంతపార్టీ నేత, పైగా అధినేత గారాలపట్టి కవిత ఆరోపణలు, విమర్శలకు ఎలా స్పందించాలో అర్ధంకాక తలలు పట్టుకున్నారు.
డ్యామేజీ కంట్రోల్ పై చర్చలు
కవిత వల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీపై కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ మరికొందరు సీనియర్లు చర్చించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందుకు పార్టీనుండి సస్పెండ్ చేస్తున్నట్లు నాయకత్వం ప్రకటించింది. సస్పెన్షన్ కారణంగా కవిత తన ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఎంఎల్సీ పదవికి కవిత చేసిన రాజీనామా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా ఆమోదించలేదు. సస్పెన్షన్ కారణంగా బయటకు వచ్చేసిన కవిత అధికారంలో ఉన్నపుడు ఏర్పాటుచేసిన జాగృతి సంస్ధను బలోపేతం చేయటంపై దృష్టిపెట్టారు.
జాగృతి అధ్యక్షురాలిగా పార్టీ నేతల్లో ఒక్కొక్కరిపైన అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా చేసిన తన్నీరు హరీష్ రావు, గుంటకళ్ళ జగదీశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమాలాకర్ తదితరులను టార్గెట్ చేసుకున్నారు. జాగృతిని బలోపేతం చేసి రాజకీయపార్టీగా మార్చే ఉద్దేశ్యంతో కవిత జనాల్లో పర్యటించాలని అనుకున్నారు. అందుకని ఈఏడాది అక్టోబర్ లో ‘జనంబాట’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలు తిరుగుతు జనాలను కలుస్తు, సమస్యలు, పరిష్కారాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే పైన చెప్పిన మాజీమంత్రుల అవినీతిపై జనంబాటలో విరుచుకుపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిలైందని కవిత పదేపదే ఆరోపిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏల ఆరోపణలు, మరోవైపు కవిత ఆరోపణలు, సవాళ్ళతో బీఆర్ఎస్ అధినేత, కేటీఆర్ తదితరులకు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు.
తంటాలు పడుతున్న పార్టీ
బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కవిత ఆరోపణలు ఒకెత్తు, పార్టీని బీజేపీలో విలీనం చేయటానికి ప్రయత్నాలు జరిగాయని చెప్పటం మరోఎత్తుగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను తీహార్ జైలులో ఉన్నపుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే చర్చలు జరిగాయని కవిత చేసిన ప్రకటన తప్పని ఇప్పటివరకు పార్టీ అధినేతలు ఖండిచకపోవటం గమనార్హం. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినపుడు చాలామంది నమ్మలేదు. అయితే అదే విషయాన్ని కవిత స్వయంగా చెప్పటంతో జనాలు కూడా నమ్మటం మొదలుపెట్టారు. కేసీఆర్ మీద రేవంత్ లేదా మంత్రులు ఆరోపించటం ఒకఎత్తు. ప్రతిపక్షాలుగా ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు చేయటాన్ని జనాలు పెద్ద సీరియస్ గా తీసుకోరు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సామాజిక తెలంగాణ సాధనలో ఫెయిలైందని స్వయంగా కవితే చెబితే నమ్మేవాళ్ళు ఎక్కువమందే ఉంటారు. ఇపుడు కవిత చేస్తున్న ఆరోపణలే బీఆర్ఎస్ నెత్తిన బండల్లాగ పడుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ నెత్తిన కవిత ఇంకెన్ని బండలు వేస్తారో చూడాల్సిందే.

