కవిత సంతోషాన్ని లాగేసుకున్న ఫార్వార్డ్ బ్లాక్
x
Kalvakuntla Kavitha

కవిత సంతోషాన్ని లాగేసుకున్న ఫార్వార్డ్ బ్లాక్

కవితకు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి ఏమీ సంబంధంలేదని పార్టీ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ప్రకటించారు


కొన్ని గంటల పాటుకూడా కల్వకుంట్ల కవిత సంతోషం నిలవలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గద్వాల జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని వడ్డేపల్లి(Vaddepalli) మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్(AIFB) పార్టీ గెలుచుకున్నదని వార్తలు వచ్చాయి. ఆ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 10 వార్డుల్లో ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్దులు గెలవగా మిగిలిన రెండుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారు. దాంతో వడ్డేపల్లి మున్సిపాలిటి గెలుపు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఖాతాలో పడింది. ఎప్పుడైతే ఈ గెలుపును అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందో వెంటనే తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఆఫీసులో సంబరాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి.

ఎందుకంటే కల్వకుంట్ల కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతినేతలే ఫార్వాడ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై గెలిచారని ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కవితే ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఫ్వార్డ్ బ్లాక్ పార్టీతో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ గుర్తు సింహంపై పోటీచేస్తున్నట్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పోటీచేస్తున్న ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుపై పోటీచేస్తున్న అభ్యర్ధులంతా జాగృతి నేతలనే అందరు అనుకున్నారు. అందుకనే ఫలితాలు రాగానే జాగృతి ఆపీసు దగ్గర కవితతో కలిసి అందరు సంబరాలు జరుపుకున్నారు.

అయితే కవిత సంతోషాన్ని కొన్ని గంటలు కూడా ఉండనీయకుండా ఫార్వార్డ్ బ్లాక్ నేతలు లాగేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కవితకు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి ఏమీ సంబంధంలేదని పార్టీ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. తామంతా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేతలమే అని, చాలా కాలంగా రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలిపారు. తమ గెలుపుకు కవితకు ఎలాంటి సంబంధంలేదని తేల్చేశారు. తమ గెలుపుకు కవిత వచ్చి ప్రచారం చేసిందిలేదు, తాము ప్రచారం చేయమని కవితను అడిగిందీ లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తమ పార్టీ తరపున బీఫారాలు అందుకునేందుకు ఆఫీసుకు వెళ్ళినపుడు అక్కడ కవిత కూడా ఉన్నారు కాబట్టి తమకు బీఫారాలను కవిత చేతుల మీదగా అందించినట్లు చెప్పారు.

తాము బీఫారాలను కవిత చేతుల మీదగా తీసుకున్నంత మాత్రాన తాము జాగృతి నేతలం అయిపోమని, ఈ గెలుపు జాగృతిది కాదని వడ్డేపల్లి స్పష్టంగా చెప్పారు. తమ గెలుపుకోసం కవిత ఒక్కసారి కూడా ప్రచారం చేయనపుడు గెలుపును జాగృతి ఖాతాలో ఎలా వేసుకుంటారని పెద్ద లాజిక్కే మాట్లాడారు వడ్డేపల్లి. మరి వడ్డేపల్లి శ్రీనివాస్ తాజా ప్రకటనపై కవిత లేదా జాగృతి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More
Next Story