కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం
x

కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం వేడుక


శ్రీనివాస మంగాపురం లోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు శ‌నివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున తామ‌ర పూలు, రోజా, తామ‌ర గింజ‌లు, వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, తుల‌సీ తదితర ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఫిబ్ర‌వ‌రి 15న రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ‌ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.45 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం 8 గంట‌ల‌కు ఆదిత్య మండలం సూర్యప్రభ వాహనంపై ఖడ్గం, గద, విల్లు ధరించి శ్రీ సూర్య‌రాయణ‌స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆయురారోగ్య‌ప్రాప్తి

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

వాహ‌న సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Read More
Next Story