పన్నుల పంపిణీలో వివక్ష..కేంద్రంపై ఉమ్మడిపోరుకు కర్ణాటక కసరత్తు
సౌత్ ఇండియాను కేంద్రం చిన్నచూపు చూస్తోందా? పన్నుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? కేంద్రంపై పోరుకు కూటమిని సిద్ధం చేస్తున్నదెవరు?
పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలాకాలంగా వస్తున్న మాట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, కర్నాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశం చేయాలన్న ఆయన కామెంట్ కలకలం రేపుతోంది.
కూటమికి సన్నాహాలు..
దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై కేంద్రంపై తిరుగుబాటుకు కర్ణాటక సిద్ధమవుతుంది.‘‘ఆర్థిక కూటమి’’ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక కూటమిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కూటమి ఉంటుందంటున్నారు. సమాఖ్య విధానంలో అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉండాలంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదన జాతీయ స్థాయిలో వినిపించాలంటే బలమైన వేదిక తప్పనిసరి అని రాయరెడ్డి పేర్కొన్నారు.
వివక్ష తగదు..
15వ ఆర్థిక సంఘం-తమకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం తగినంతగా ఇవ్వలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా విమర్శించారు. వనరుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎదుర్కోవడానికి దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
వేల కోట్ల నష్టం..
‘‘పన్నుల పంపిణీలో కర్ణాటకకు కేంద్రం అన్యాయం చేసింది. గత నాలుగేళ్లలో రాష్ట్రానికి రూ.45,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తమ ప్రజలు కట్టే పన్నులు కష్టకాలంలో తమకు ఉపయోగపడడం లేదని, ఆ డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు చేరుతోంది’’. అని సిద్ధరామయ్య ఆరోపించారు.
7న నిరసన ప్రదర్శన..
పన్నుల పంపిణీ, గ్రాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న న్యూఢల్లీిలో సిద్ధరామయ్య సహా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. వనరులు, పన్నుల్లో న్యాయపర వాటా కోసం పోరాటం చేయడం మినహా మరో దారి లేదని డీకే శివకుమార్ అంటున్నారు.
న్యాయం కోసం గళం విప్పిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ‘నేను మీ వెంటే ఉన్నాను, మనమంతా ఏకమైతే ఢిల్లీ దాకా అది వినిపిస్తుంది’ అని సిద్దరామయ్య ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.