
అసెంబ్లీలో డ్రంక్ టెస్టులు చేయాలి: కౌశిక్ రెడ్డి
కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పోలీస్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షురూ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు తాగి సభకు వస్తున్నారని, దానిని అరికట్టడం కోసం అసెంబ్లీలో డ్రంక్ టెస్ట్‌లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సభలో మద్యం సేవించి వస్తున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌశిక్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, డ్రంక్ టెస్ట్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా నిజం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహారశైలిపై ఆరోపణలు చేశారు. గత పదిహేను రోజులుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025 సెప్టెంబర్‌లో ఫైరింగ్ రేంజ్ వద్ద సీపీ సతీమణితో పాటు ఆమె మిత్రులు ఏకే 47, పిస్టళ్లతో సుమారు 160 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆయన ఆరోపించారు.
ఈ ఘటనలో బోనాలపల్లికి చెందిన అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలి గాయమైనట్లు వివరించారు. అయితే ఆమెకు రాయి తగిలిందని భావించినట్లు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇవ్వడం ఎలా సాధ్యమైందో ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు ప్రభుత్వ వాహనాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇలాంటి చర్యలతో పోలీస్ వ్యవస్థ నష్టపోతుందని తెలిపారు. గతంలో తనపై స్పందించిన ఐపీఎస్ అధికారుల సంఘం, ఇప్పుడు జరుగుతున్న అంశాలపై ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరినట్లు తెలిపారు. అలాగే సమాచారం ఇస్తున్న పోలీసులను బెదిరించవద్దని, తాను ఎలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

