కేసీఆర్ బిడ్డ  కవిత కన్నీరు,  ఐదు సూటి ప్రశ్నలు (వీడియో)
x
Kavitha crying in Council meeting

కేసీఆర్ బిడ్డ కవిత కన్నీరు, ఐదు సూటి ప్రశ్నలు (వీడియో)

కేసీఆర్ పాలనను దగ్గరుండి చూశారు కాబట్టి కవిత చేసిన అవినీతి ఆరోపణలు నిజాలే అని ప్రజలు అనుకుంటారు


ఇంతకాలం బీఆర్ఎస్ లోని హరీష్ రావు తదితరులను మాత్రమే డైరెక్ట్ ఎటాక్ చేస్తున్న కల్వకుంట్ల కవిత ఇపుడు నేరుగా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా ఎటాక్ చేశారు. శాసనమండలి వేదికగా కేసీఆర్ ను ఉద్దేశించి కవిత చాలా ప్రశ్నలు వేసినప్పటికీ ఐదుప్రశ్నలు మాత్రం అధినేతను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజా పరిణామాలతో కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని నిలదీయటం కాదు ముందు కవిత సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కవిత సంధించిన ప్రశ్నలు కేసీఆర్ ఇమేజీని బాగా డ్యామేజి చేస్తున్నాయి అన్నదాంట్లో ఎలాంటి సందేహంలేదు.

ఇంతకీ కవిత అడిగిన ప్రశ్నలు ఏమిటి ?

1. ప్రత్యేక తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ ఎందుకు ఆదుకోలేదు, ఉద్యమకారులకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు ?

2. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నీళ్ళు, నియామకాలు, నిధుల అజెండాకు కేసీఆర్ ఎందుకు గండికొట్టారు ?

3. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరుగుతోందని తాను చెప్పినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు ?

4. తెలంగాణలో ఏమి పీకి కట్టలు కట్టామని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని తాను అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పలేదు ?

5. తనతో పాటు ఇంటల్లుడి ఫోన్లను సొంత ప్రభుత్వమే ఎందుకు ట్యాపింగ్ చేయించిందన్న తన ప్రశ్నకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పలేదు ? అని, మండలి వేదికగా కవిత కన్నీళ్ళతో కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు అని ఆరోపించారు. ఈ ఆరోపణ ద్వారా కవిత ఏమి చెప్పదలచుకున్నారంటే కేసీఆర్ కు అమరుల కుటుంబాలన్నా, ఉద్యమాకారులన్నా ఎలాంటి గౌరవం లేదు అని.

పరిపాలనలో అవినీతి పెరిగి పెరిగిపోతోందని తాను ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే కవిత చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. నీటి ప్రాజెక్టుల్లోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మొత్తానికి హరీష్ రావు మాత్రమే కారణమని కవిత పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మరచిపోయింది ఏమిటంటే హరీష్ అవినీతికి పాల్పడినా లేక ఇంకే మంత్రి అవినీతికి పాల్పడినా బాధ్యత కేసీఆర్ దే అని.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన విషయమై కేసీఆర్ ను కవిత అడగటం చాలా సీరియస్ విషయంగానే చూడాలి. తెలంగాణలో టీఆర్ఎస్ ఏమిపీకి కట్టలు కట్టిందని జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ రూపంలో వెళుతోందని తాను అడిగినా కేసీఆర్ సమాధానం చెప్పలేదు అని అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటాన్ని తాను వ్యతిరేకించినట్లు కవిత ఇపుడు చెప్పారు.

తనతో పాటు ఇంటల్లుడి ఫోన్లను తమ ప్రభుత్వమే ట్యాప్ చేయించిందని సిగ్గువిడిచి చెబుతున్నట్లు కవిత చెప్పారు. ఇంటల్లుడి ఫోన్ ట్యాపయిందని చెబితే సిగ్గుపోతుంది అని కవిత అన్నారు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని. కాకపోతే కవిత అడగటం ఎలాగుందంటే ఎవరిఫోన్ అయినా ట్యాప్ జరగచ్చు కాని ఇంటల్లుడి ఫోన్ ట్యాపింగ్ జరగటం ఏమిటి ? అనే అర్ధమొస్తోంది.

మొత్తంమీద రేవంత్, మంత్రుల ఆరోపణలపై అంతెత్తున ఎగిరెగిరిపడుతున్న కేటీఆర్, హరీష్ మరి కవిత ఆరోపణలపైన ఎందుకు నోరిప్పటంలేదు ? అన్నదే అర్ధంకావటంలేదు. కేటీఆర్, హరీష్ అవినీతిపైన కవిత డైరెక్టుగానే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలకు ఇప్పటివరకు ఇద్దరూ సమాధానాలు చెప్పలేదు. ఇపుడు నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ పైనే కవిత అవినీతి, ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా సమాధానాలు చెప్పకపోతే కేసీఆర్ పాలనపైన కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజాలే అని ప్రజలు అనుకుంటారు. మరిప్పుడైనా కవిత ఆరోపణలు, విమర్శలకు కేటీఆర్, హరీష్ సమాధానాలు చెబుతారా ?

Read More
Next Story