
కృష్ణా జలాల్లో వాటా తగ్గింపై లోగుట్టును బయటపెట్టిన కల్వకుంట్ల కవిత
సంతకం చేసింది హరీషే అయినా మొత్తం బాధ్యత వహించాల్సింది కేసీఆరే అన్న విషయాన్ని కవిత మరచిపోయినట్లున్నారు
కృష్ణాజలాల్లో వాటాతగ్గటంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మద్దతుగా మాట్లాడారు. ఆదివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతు గుంటనక్క హరీష్ రావు సంతకం పెట్టడం వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణ వాట తగ్గిపోయిందని మండిపడ్డారు. గుంటనక్క హరీష్ వ్యవహారం తోకే కుక్కను ఊపినట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. కృష్ణాజలాల పంపకాల్లో తెలంగాణహక్కులు 4శాతాన్ని తగ్గించుకుని హరీష్ రావు(Harish) సంతకం పెట్టింది వాస్తవమే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సంతకం చేసింది హరీషే అయినా మొత్తం బాధ్యత వహించాల్సింది కేసీఆరే(KCR) అన్న విషయాన్ని కవిత మరచిపోయినట్లున్నారు.
కృష్ణా జలాల్లో వాటాను తగ్గించుకుంటు ఎందుకు సంతకం పెట్టాడో ముందు హరీష్ సమాధానం చెప్పిన తర్వాత పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. హరీష్ అవినీతి వల్లే జూరాల నుండి శ్రీశైలంకు ప్రాజెక్టును మార్చారని కవిత తీవ్రంగా ఆరోపించారు. హరీష్ నిర్ణయాలతోనే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టాలు వచ్చినట్లు మండిపడ్డారు. అసెంబ్లీలో తనను రేవంత్ ఒక మాట అన్నందుకే మొత్తం సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించేట్లుగా హరీష్ నిర్ణయం తీసుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సదరు అంశంపై చర్చ ముగిసిన తర్వాత మరోక అంశంపైన మాట్లాడేందుకు మళ్ళీ బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు సభకు వెళ్ళలేదని నిలదీశారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం వల్ల ఏమిటి ఉపయోగమని ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లులపైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండద్దా ? అని అడిగారు. సభ నుండి పార్టీ వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ దేనా అని అనుమానం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ తన సొంత గుంపును తయారుచేసుకున్నాడని ఆరోపించారు.
ఇదేసమయంలో అసెంబ్లీలో ప్రభుత్వ వైఖరిపైన కూడా కవిత మండిపడ్డారు. కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప కృష్ణా జలాల వాటాపైన సభలో సరైన దిశగా చర్చే జరగటంలేదన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒక ఉత్తరం రాస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ది ఉంటే కృష్ణా జలాలపైన సమగ్ర చర్చ జరపాలని సూచించారు. తుంగభద్ర, కృష్ణా జలాలపై సమస్యలు వచ్చినపుడు రెండురాష్ట్రాల్లోను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నపుడు చర్చలతో ఎందుకు సమస్యను పరిష్కరించుకోవటంలేదని అని నిలదీశారు. కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తు తమ తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

