
సింగరేణిలో దోపిడీ రాజ్యం.. కార్మికులపై కవిత ఫైర్
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని, డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మిక సంక్షేమంపై ప్రభుత్వం విఫలమైందని కవిత ఆరోపించారు.
సింగరేణి ప్రాంతంలో ప్రజల సమస్యలు పక్కనపెట్టి దోపిడీ జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నాలుగు రోజులుగా 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గుగనులను సందర్శించినట్లు తెలిపారు. కార్మికులు, స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు.
సింగరేణి ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల కంటే ఇసుక, మట్టి, బూడిద వ్యాపారాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. సింగరేణిలో సుమారు 2 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ కేవలం 500 ఉద్యోగాలే ఇచ్చారని కవిత పేర్కొన్నారు. ఉద్యోగాల ప్రకటనలను కూడా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
బొగ్గుగని కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. సమావేశాలకు హాజరైతే జీతాలు కట్ చేస్తామని కొందరు ఉద్యోగులను హెచ్చరిస్తున్నారని తెలిపారు. రామగుండం ప్రాంతంలో కాలుష్యం తీవ్రంగా ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీటి నాణ్యతపై కూడా స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ అంశాలపై సంబంధిత మంత్రులు వెంటనే దృష్టి సారించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న ఈ ప్రాంతంలో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీకి సూచించారు. అలాగే సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాకులు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులు, కోల్‌బెల్ట్ ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత కోరారు.

