
సీబీఐ నోటీసులు అందాయ్.. విచారణకు సహకరిస్తా: కవిత
సీబీఐ నోటీసులపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. తనకు గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నోటీసులు అందాయని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో సీబబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని వివరించారు. అందులో భాగంగానే తనకు నోటీసులు అందించారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉన్నది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.. ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్బీ సీబీఐ అధికారులు స్వయంగా తెలియచేసారు. ఈ విషయంపై మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నాం!! సత్యం నా తోడుగా సంపూర్నంగా అధికారులకు సహకరిస్తాను’’ అని కవిత వివరించారు.
రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయంపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. సోమవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో కీలకంగా ఉన్న వారిని పరిశీలన చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రలను అంచనా వేయడంలో ట్రయల్ కోర్టు పొరపాట్లు చేసిందని పేర్కొన్నారు. మద్యం పాలసీ వెనుక పెద్ద కుట్ర ఉందని సీబీఐ వాదించింది. కానీ ట్రయల్ కోర్టు మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల కేసు బలహీనపడిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ హైకోర్టుకు వెళ్లింది.

