
తెలంగాణ ఉద్యమకారుల కోసం కవిత భూపోరాటం
పోరాటంలో ఏర్పాటు చేసిన గుడిసెలో పాలు పొంగించిన కవిత.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో పోరాటం ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా మానుకొండూరులో భూపోరాటం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి చెందిన 5ఎకరాల స్థలంలో జెండాలు పాతి.. ఒక తాత్కాలిక గుడిసెను ఏర్పాటు చేశారు. అందులో ఉద్యమకారుల కుటుంబాలతో కలిసి కవిత.. వంటవార్పు చేశారు. పాలు పొంగించారు. ఈ సందర్భంగా వేసిన గుడిసెలో పాలు పొంగించారు.
తెలంగాణ పోరాటాలతో వచ్చింది
‘‘మానకొండూరులో తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యమకారులు కలిసి భూ పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల జాగ ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసేలా పోరాడుతున్నాం. మీరు ప్రామిస్ చేసినట్లుగా రూ. 25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో ఉద్యమకారులు వివిధ ఫోరమ్ లలో ఉద్యమం మొదలు పెట్టారు. వారందరికీ జాగృతి తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం’’ అని ప్రకటించారు.
జర్నలిస్టులకు జాగ జాడేది
‘‘మానకొండూరులో జర్నలిస్టులకు 2012 లో జాగలు ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గద్వాల్, నిజామాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ఇలాగే చేశారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా యాజమాన్యంతో కొట్లాడి జర్నలిస్టులు ఉద్యమ వార్తలను అందించారు. ఉద్యమంలో వార్తలను హైలెట్ చేసేందుకు వారి వంతు ప్రయత్నం చేశారు. అలాంటి జర్నలిస్టులకు కచ్చితంగా భూములు ఉండాలి. తెలంగాణ కోసం కొట్లాడిన వారికి భూముల మీద హక్కు ఉండాలి. ప్రతి జిల్లాలో ఇదే విధంగా భూపోరాటాలు కొనసాగిస్తూ ఉద్యమకారులకు అండగా నిలుస్తాం’’ అని స్పష్టం చేశారు.

