‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీని ప్రకటించిన కవిత..
x

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పార్టీని ప్రకటించిన కవిత..

నిజామాబాద్‌లో కీలక ప్రకటన చేసిన కవిత, యువత మహిళలకు ప్రాధాన్యతతో కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు.


తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ తన పార్టీ పేరుగా వెల్లడించారు. పార్టీని అతి త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు ORR సమీపంలోని మునీరాబాద్‌లో జెండా ఆవిష్కరణతో పార్టీని అధికారికంగా స్థాపించనున్నట్లు తెలిపారు. అదే రోజు పార్టీ జెండా, ఎజెండా, నిబంధనలు ప్రకటించనున్నారు.

పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. యువత, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధన, సర్వోదయం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ప్రజల్లోకి సొంత పార్టీతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కవిత వెల్లడించారు.

దీనికి అనుగుణంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకాలం స్వచ్చంద సంస్థగా పనిచేసిన జాగృతి పేరునే రాజకీయ పార్టీకి అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. రైతులు, పేదల కోసం దశాబ్దానికి పైగా చేసిన సేవలను రాజకీయ వేదికగా మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతు కొనసాగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ జాగృతి యూనిట్లను బలోపేతం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు, పాదయాత్రల ద్వారా ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల సమస్యపై చేపట్టిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి బాధితులకు పట్టాలు పంపిణీ జరుగుతోందని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మహిళ రాజకీయ పార్టీ స్థాపించడం రెండోసారి కావడం గమనార్హం. గతంలో ఏర్పాటు చేసిన పార్టీ తర్వాత విలీనం కావడం జరిగిన నేపథ్యంలో, తాజా ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ముందున్న రోజుల్లో ఈ పార్టీ ఎలా ముందుకు సాగుతుందనే అంశంపై ఆసక్తి కొనసాగుతోంది.

Read More
Next Story