
మొదలైన అసెంబ్లీ సమావేశాలు..
ఐదే ఐదు నిమిషాలు సభలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. కాగా ఐదే ఐదు నిమిషాలు ఉండి.. ఆయన వెళ్లిపోయారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్.. వెళ్లిపోయారు. సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంతా కూడా కేసీఆర్‌ను కలిసి.. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హరీష్ రావుతో కలిసి కేసీఆర్ సభనుంచి బయటకు వచ్చారు. అటు నుంచి అటే ఆయన తిరిగి వెళ్లిపోయారు.
అనంతరం సభ యథావిధిగా సాగింది. ఈ సభలో రాష్ట్ర నీటి సమస్యల గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల విలీనం, పరిధి విస్తరణ నేపథ్యంలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పిల్లల నిబంధనను రద్దు చేయడం, తెలంగాణ జీఎస్‌టీ సవరణలు, ఉద్యోగుల హేతుబద్ధీకరణ వంటి అంశాలకు చట్టబద్ధత కల్పించనున్నారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. శాసనసభ, శాసన మండలిని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనమండలి వాయిదా
అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసనమండలి సమావేశాలు కూడా సోమవారం నుంచి షురూ అయ్యాయి. సంతాప తీర్మానాల అనంతరం సభను వాయిదా వేశారు. మాధవరం జగపతి రావు, అహ్మద్ షబ్బీర్‌లకు నివాళులు అర్పించిన తర్వాత సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే వాటిని జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

