
కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ ప్రశ్నలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై తాను ఎలా బాధ్యుడో వివరించాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక అంశాలు ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన డిజైన్, ప్రణాళిక లోపాలకు తానే ఎలా బాధ్యుడినని కమిషన్ నిర్ణయించిందో వివరించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎంగా ఉన్నప్పటికీ ప్రతి సాంకేతిక అంశానికి తానే బాధ్యుడని తేల్చడం ఎలా సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వం అందించిన రికార్డుల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని సంబంధిత ఆధారాలను సమర్పించి తన వివరణ తీసుకున్న తర్వాతే తుది నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు. అయితే కమిషన్ ఆ విధానాన్ని పాటించలేదని కోర్టుకు తెలిపారు. సాక్షిగా పిలిచి తరువాత దోషిగా అభియోగాలు మోపారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 8బీ, 8సీ ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉందని వివరించారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారి వివరాలు తెలియజేయలేదని, వారిని ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
ఇదే అంశంపై హరీశ్ రావు, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున కమిషన్ తగిన అవకాశమిచ్చిందని వాదనలు వినిపించగా, పిటిషనర్లు సహజ న్యాయసూత్రాలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. కేసు తదుపరి దశపై అందరి దృష్టి నిలిచింది.

