కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏమిచేశారో తెలుసా ?
x
KCR signing in Assembly register

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఏమిచేశారో తెలుసా ?

రిజిస్టర్ లో సంతకంచేసిన కేసీఆర్ సభలో తన సీటులో కూర్చున్నారు


వచ్చాడు, వచ్చాడు అనుకున్నంతసేపు పట్టలేదు వెళ్ళిపోవటానికి. ఎవరిగురించో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును, బీఆర్ఎస్ అధినేత (KCR)కేసీఆర్ గురించే. సోమవారం నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని కారుపార్టీ నేతలు, మీడియా కొద్దిరోజుల నుండి ఒకటే ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ మొదలైంది. సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తోలును కేసీఆర్ ఎలా తీస్తారో చూడాలని చాలామంది అనుకున్నారు. అందరు అనుకున్నట్లే అధినేత అసెంబ్లీకి హాజరయ్యారు. రిజిస్టర్ లో సంతకం కూడా చేశారు. రిజిస్టర్ లో సంతకంచేసిన కేసీఆర్ సభలో తన సీటులో కూర్చున్నారు. సభాపతి రేవంత్ వచ్చి కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. మంత్రులు కూడా వచ్చి కేసీఆర్ ఆరోగ్యంగురించి వాకాబుచేశారు.

అసెంబ్లీకి హాజరయ్యారు కాబట్టి ఇంకేముంది రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ తోలుతీసేయటం ఖాయమనే అందరు అనుకున్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే కేసీఆర్ సభనుండి వెళ్ళిపోయారు. సభలోకి వచ్చిన కేసీఆర్ సమావేశాలు మొదలయ్యే సమయానికి ఎందుకు వెళిపోయినట్లు ? అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు ? ఎందుకు వెళ్ళిపోయారు ? ఎందుకు వచ్చారంటే అనర్హత వేటునుండి తప్పించుకోవటానికే అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. 2023లో అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు కేసీఆర్ సభకు హాజరైంది కేవలం రెండంటే రెండు రోజులు మాత్రమే. సమావేశాలకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే ఎంఎల్ఏ సభ్యత్వం రద్దయ్యే అవకాశముంది. ఎవరైనా సభ్యుడు సదరు ఎంఎల్ఏ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదు చేస్తే స్పీకర్ రివ్యు చేసి సభలో చర్చించి అనర్హతపై నిర్ణయం తీసుకుంటారు.

60 రోజుల సమావేశాలను ఎలా లెక్కిస్తారంటే 5 రోజులకు మించి సమావేశాలు వాయిదాపడితే ఆ సెషన్ ను లెక్కించరు. అలాగే సెషన్ నుండి మరో సెషన్ మధ్య ఉన్న రోజులను లెక్కించరు. ఇలాంటి టెక్నికల్ పాయింట్లను లెక్కించిన తర్వాతే కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసినట్లున్నారు. అసెంబ్లీలో జరిగింది చూసిన తర్వాత అర్ధమవుతున్నది ఏమిటంటే అనర్హత సమస్య నుండి తప్పించుకునేందుకే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని. అంతేకాని జలవివాదాలపై సభలో చర్చించి రేవంత్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేయటానికో లేకపోత చీరేయటానికో కాదు. మొత్తం మీద వస్తాడు..వస్తాడు అని జనాలు ఎదురుచూసినంత సేపు పట్టలేదు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవటానికి. సంతాప తీర్మానాలు, బిల్లుల ప్రవేశంతో ఈరోజు సమావేశం వాయిదాపడుతుంది. తిరిగి సమావేశాలు మొదలయ్యే 2వ తేదీనుండైనా కేసీఆర్ సభకు వస్తారో లేదో చూడాలి.

Read More
Next Story