
తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లపై కీలక నిర్ణయం
డిగ్రీలో చేరబోయే విద్యార్దులకు 2027 విద్యా సంవత్సరం నుండి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలన్న ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది
డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే డిగ్రీలో చేరబోయే విద్యార్దులకు 2027 విద్యా సంవత్సరం నుండి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలన్న ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. ఎంట్రన్స్ నిర్వహించాలనేందుకు మూడు కారణాలున్నాయి. ఇపుడున్న విధానం ఏమిటంటే ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ‘దోస్త్’ పోర్టల్లో విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దోస్త్ అంటే ఏమిటంటే డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్, తెలంగాణ. విద్యార్ధులకు వచ్చిన మార్కుల ఆధారంగా దోస్త్ ఏ కాలేజీల్లో సీట్లు వస్తుందో చెబుతుంది. దాని ప్రకారం తమకు కావాల్సిన గ్రూప్ ఏ కాలేజీలో సీటు వస్తుందో చూసుకుని విద్యార్ధి ఫీజుకట్టి చేరుతున్నాడు.
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి సుమారు 800 కాలేజీలుండగా దాదాపు 70 కాలేజీలు మినహా మిగిలిన కాలేజీలన్నీ దోస్త్ పోర్టల్లో ఉన్నాయి. 70 కాలేజీలు ఏమిటంటే కార్పొరేట్ కాలేజీలు. ఈ 70 కాలేజీల యాజమాన్యాలు దోస్త్ పోర్టల్ తో సంబంధంలేకుండానే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. మిగిలిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు కట్టే ఫీజుల స్ట్రక్చర్ ను ఈ 70 కాలేజీలు ఫాలో అవటంలేదు. తమిష్టమొచ్చినంత ఫీజులను యాజమాన్యాలు వసూలు చేసుకుంటున్నాయి. ఈ 70కాలేజీలను కూడా దోస్త్ పరిధిలోకి తీసుకురావటానికి ఉన్నతవిద్యాశాఖ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అలాగే అన్నీకాలేజీల్లో కలిపి సుమారు 3.70 లక్షల సీట్లుంటే ఇపుడు భర్తీ అవుతున్నది సుమారు 1.7 లక్షల సీట్లు మాత్రమే. అంటే మిగిలిన సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి.
ఇక పరీక్షల విషయాన్ని చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్ధులు పరీక్షలు రాయాలంటే 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఏ కారణం వల్లయినా 75శాతం హాజరు తగ్గితే అందుకు మెడికల్ సర్టిఫికేట్ లేదా ఇంకేదైనా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి అనుమతిస్తున్నాయి. అయితే పైన చెప్పిన 70 కాలేజీల్లో విద్యార్ధుల హాజరుతో సంబంధం లేకుండానే పరీక్షలు రాసేస్తున్నట్లు ఉన్నతవిద్యాశాఖ గుర్తించింది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గటానికి హాజరు అంశం కూడా కీలకమే అని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పైన చెప్పిన కార్పొరేట్ కాలేజీలు దోస్త్ తో సంబంధంలేకుండానే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. దోస్త్ లో చేరాలని ఉన్నతవిద్యాశాఖ అధికారులు కాలేజీల యాజమాన్యాలను ఎంతగా చెప్పినా వినటంలేదు. ఇలాంటి అనేక సమస్యలను ఉన్నతావిద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నతవిద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తదితరులు పైన చెప్పిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్నీ కాలేజీలను దోస్త్ పరిధిలోకి తేవాలన్నా, ఫీజులు ఒకే రకంగా ఉండాలన్నా, 75శాతం హాజరు నిబంధన అమలవ్వాలన్నా డిగ్రీలో ప్రవేశానికి ఎంట్రన్స్ పెట్టాల్సిందే అని సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించే కాలేజీల గుర్తింపును రద్దుచేయాలనే ప్రతిపాదనను కూడా సమావేశం చర్చించింది.
కాబట్టి ఇపుడున్న మార్కుల విధానంలో కాకుండా 2027 విద్యా సంవత్సరం నుండి డిగ్రీలో చేరటానికి ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి చేసింది. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ఎంట్రన్స్ టెస్టే ప్రాతిపదక కావాలని ఉన్నతవిద్యాశాఖ నిర్ణయించింది. ఏ యాజమాన్యం అయినా దోస్త్ మార్గదర్శకత్వంలో ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు అంగీకరించకపోతే సదరు కాలేజీల్లో అడ్మిషన్లు చెల్లకుండా చేయాలని తప్పని పరిస్ధితిలో గుర్తింపు రద్దుచేయటానికి కూడా వెనకాడకూడదని సమావేశం నిర్ణయించింది. కాబట్టి తెలంగాణలో డిగ్రీ చదవాలంటే విద్యార్దులు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే.

