ఖర్గే ప్రధాని అభ్యర్థి అవుతారా? జగ్జీవన్ రామ్ లాగా అయిపోతారా?
x
Mallikarjun Kharge - Jagjivan Ram (File)

ఖర్గే ప్రధాని అభ్యర్థి అవుతారా? జగ్జీవన్ రామ్ లాగా అయిపోతారా?

యాభై యేళ్ల తర్వాత మరో దళిత నేత ప్రధాని అభ్యర్థి అనే వార్త వచ్చింది. గతంలో ఇలాంటి ఆశ నిరాశ ఎదుర్కొన్న నేత బాబూ జగ్జీవన్ రామ్. ఆయన ప్రధాని అభ్యర్థి కధేంటో తెలుసా.


న్యూఢిల్లీలో డిసెంబర్‌ 19న ఇండియా కూటమి నేతలు సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచారం అంశాల మీద ఏకాభిప్రాయం కుదుర్చుకునేందుకు సమావేశమయినా సంచలన విషయాన్ని చర్చల్లోకి తీసుకువచ్చారు. ఎఐసిసి అధ్యక్షుడిగా ఉన్న కర్నాటక నేత మల్లి కార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)ను ప్రధాని అభ్యర్థి చేయాలనేది ఆ సంచలన ప్రతిపాదన. ఇది కాంగ్రెస్ పార్టీ నే కాదు అనేక ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీలను కంగుతినిపించే వార్త. కాంగ్రెస్ నేతలెవరూ ఈ ప్రతిపాదనను జీర్ణించకోలేరు. వాళ్ల వాళ్ల నరనరాలలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే కోరిక దాక్కుని ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే వాళ్ల నినాదం కూడా. రాహుల్ గాంధీని కాదని మరొక వ్యక్తిని ప్రధానిగా ఎవరూ ప్రతిపాదించినా వాళ్ల జీర్ణించుకోలేరు. కాకపోతే, అలాంటి ప్రతిపాదన సోనియా చేయవచ్చు. గతంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటవుతున్నపుడు ఇలాంటి ప్రధాని సమస్య వచ్చినపుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆమె ప్రతిపాదించారు. అపుడు ఢిల్లీ అక్బర్ రోడ్డులో ఎంత డ్రామా నడించింది. సోనియాగాంధీ ప్రధాని కావాలని హైదరాబాద్ నుంచి వెళ్లిన వాళ్లు కూడా నిరాహార దీక్ష కూర్చొన్నారు. చివరకు సోనియా ప్రధాని అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు. ఆమె నుంచే డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపాదనవచ్చింది.

అయితే, నిన్న ఇండియా మీటింగ్ లో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరు వచ్చింది. 2024 ఎన్నికలలో మోదీకి ధీటుగా ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రమోట్ చేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపాదించినట్లు ఒక వార్త బయటకు వచ్చింది.

తమిళనాడు మరుమలార్చికళగం (ఎండిఎంకె) నేత వై గోపాలస్వామి ఈ విషయాన్ని విలేకరులకు చెప్పారు. తర్వాత కేరళ కాంగ్రెస్ (Congress) నేత థామస్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఖర్గే పేరును ప్రతిపాదించలేదని, కేవలం ప్రధాని అభ్యర్థి పదవికి దళితనేతను ఎంపికచేస్తే బాగుంటుందని సూచించారని చెప్పారు. ఏది ఏమయినా మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదనకు వచ్చింది, వార్తలకెక్కింది. దీనిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదని తెలిసింది. కాకపోతే, ముందుగా మనం గెలవాలి, ఎక్కువ సీట్లు గెలిచే వ్యూహం చర్చించుకుందాం అని ఖర్గే అన్నట్లు తెలిసింది.

మొత్తానికి ఖర్గే ప్రధాని అభ్యర్థి అనే విషయం మీద ఇక చర్చ జరుగుతుంది. ఖర్గే పేరును ఉత్తరాది నేతలు స్వీకరిస్తారా .. ఎందుకంటే, ప్రధాని అభ్యర్థి మీద బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ కన్నేసి ఉంచారు. ఖర్గే పేరుకు లాలూ ప్రసాద్ అంగీకరిస్తారా.. సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఏమంటారు. ఇవన్నీ చర్చకు వస్తాయి.

దళితనేతను ప్రధానిగామోదీ మీద ప్రయోగించాలన్నది కొత్త ఆలోచన. ఇదే విధంగా దళితను ప్రధాని గా చేయాలన్నది కూడా కొత్త ఆలోచన. ఎందుకంటే, ఇలాంటి చర్చ ఎపుడో 1995 ఒక సారి, 1977 లో జనతా ప్రభుత్వ హాయంలో మరొక సారి జరిగింది.

ప్రధాని పదవి అందుకోలేకపోయిన జగ్జీవన్ రామ్

ఈ తరానికి బాబూ జగ్జీవన్ రామ్ (Jagjivan Ram) పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. బీహార్ కు చెందిన చాలా గొప్ప దళితనాయకుడు. బీహార్‌ రాష్ట్రంలో దళిత కుటుంబంలో జన్మించిన జగ్జీవన్‌రామ్‌ కేంద్రంలో ఎక్కువ కాలం క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన నేత. ఆయన జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ ల క్యాబినెట్ లలో పనిచేశారు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ క్యాబినెట్ లో రక్షణ మంత్రిగా పని చేశారు. 1977-79 మధ్య మొరార్జీ ప్రధానిగా ఉన్నపుడు డిప్యూటి ప్రధాని గా పనిచేశారు. మూడేళ్ల పాటు ఎఐసిసి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందే ఆయన దళితుల తరఫున నిలబడ్డారు. గాంధీజీకి బాగా సన్నిహితుడు. నెహ్రూ క్యాబినెట్ మంత్రులను ఎంపిక చేసుకుంటున్నపుడు జగ్జీవన్ రామ్ గాంధీ దగ్గిరికి వెళ్లి డాక్టర్ అంబేడ్కర్ ని క్యాబినెట్ మంత్రిగా తీసుకోవాలని నెహ్రూకు సూచించారట. ఈ విషయాన్ని జగ్జీవన్ రామ్ భార్య ఇంద్రాణీ తన జ్జాపకాలలో రాశారు.

దళితులకు సమానత్వం కోసం ఆల్‌-ఇండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ స్థాపన (1935)లో కీలక పాత్ర పోషించారు. 1940 ప్రారంభంలో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసార్లు జైలుకెళ్లారు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక అతి పిన్న వయసులో కేంద్ర క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 1952 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌ రామ్‌ తర్వాత నెహ్రూ క్యాబినెట్‌ (1952-56)లో సమాచార శాఖ మంత్రిగా, (1956-62)లో రవాణ, రైల్వే శాఖ మంత్రిగా, (1962-63)లో రవాణ, కమ్యూనికేషన్‌ మంత్రిగా ఉన్నారు.

నెహ్రు కూతురైన ఇందిరా గాంధీ ప్రధాని కావడానికి మద్దతు ఇచ్చారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి తర్వాత 1966లో ఇందిరా ప్రధాని అయినపుడు జగ్జీవన్‌ రామ్‌ (1966-67) కార్మిక, ఉపాధి, పునరావాస మంత్రిగా పనిచేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా (1967-70) పనిచేశాక.. 1970లో రక్షణశాఖ మంత్రి అయ్యారు. 1974 నుంచి 1977 వరకు వ్యవసాయం, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించేందుకు మద్దతు పలికారు. తర్వాత ఆయన ఇందిరా గాంధీతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ (సిఎఫ్ డి) అనే పార్టీ పెట్టి 1977 ఎన్నికల్లో గెల్చారు. జనతా కూటమిలో చేరారు.

ఎమర్జన్సీకి ముందొక సారి

అయితే, ఆయన పేరు ప్రధానిగా చాలా సార్లు వినిపించింది. మొదటి సారి ఆయన పేరు వినిపించింది 1975లో. 1971 లో రాయ్ బరేలీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో అలహాబాద్ హైకోర్టు ఆమె లోక్ సభ సభ్యత్వం మీద అనర్హత వేటువేసింది. ఆపుడు ఆమె తప్పుకుంటే వాసుడెవరు అనే చర్చ వచ్చింది. ఆ సమయంలో ప్రధానంగా వినిపించిన పేరు వ్యవసాయ మంత్రి బాబూ జగజ్జీవన్ రామ్ దే. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆయనే నాయకత్వం వహిస్తారని వూహాగానాలు వినబడ్డాయి. అయితే, ఇందిరాగాంధీ ఎమర్జన్నీ విధించడంతో కథ మరొక మలుపు తిరిగింది.

జనతా పార్టీ హాయంలో రెండు సార్లు

తర్వాత ఆయన జనతా పార్టీలో ఉన్నపుడు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. పోయింది. మొదటి సారి ఆయన జనతా సంకీర్ణం ఏర్పడుతున్నపుడు. జగజ్జీవన్ రామ్ పెట్టిన కొత్త పార్టీ కాంగ్రెస్ ఫర్ డెమోక్రట్స్. ఈ పార్టీకి 1977 ఎన్నికల్లో కేవలం 28 సీట్లు మాత్రమే వచ్చాయి. జన్ సంఘ్ కు చెందిన దాదాపు నూరుమంది సభ్యులు మద్ధతునిచ్చారు. అపుడు ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు. అనేక తర్జన భర్జనలు పడ్డాక జయప్రకాశ్ నారాయణ్ మద్దతు లభించడంతో మొరార్జీ ప్రధాని అయ్యారు. మరొకటి జనతా పార్టీ అవసాన దశలో ఉన్నపుడు అవకాశం జారింది. అపుడు రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డి వల్ల ఆయనకు చాన్స్ పోయిందని చెబుతారు. మొదట మొరార్జీ ప్రభుత్వం కూలిపోయాక చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన ప్రభుత్వం కూడా కూలిపోయాక రాష్ట్ర పతి నీలం సంజీవరెడ్డి అపుడు రక్షణ మంత్రిగా ఉన్న జగ్జీవన్ రామ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలుస్తారని భావించారు. జగ్జీవన్ రామ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని జనతా పార్టీ నేత చంద్రశేఖర్ రాష్టప్రతికి విజ్ఞ ప్తి చేశారు. అయితే, రాష్ట్రపతి 1979లో దానిని తిరస్కరించారు. ఇలా రెండోసారి ఆయన పేరు ప్రధాని అభ్యర్థిగా వచ్చినట్లే వచ్చి మాయమయింది.

యాభై యేళ్ల తర్వాత ఖర్గే పేరు

ప్రధాని పదవికి మరొక దళిత నేత పేరు యాభై యేళ్ల తర్వాత మళ్లీ వినిపించింది. ఖర్గే కూడా చాలా పేరున్న దళితనాయకుడు. మాపన్నమల్లికార్జున్‌ ఖర్గే 2022 నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2020 నుంచి కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్న ఖర్గే 2021 నుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్నారు. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 2013 నుంచి 2014 వరకు రైల్వే మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రివర్గంలో 2009 నుంచి 2013 వరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా, 2018 నుంచి 2020 వరకు మహారాష్ట్రకు ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేశారు. అంతకుముందు1996 నుంచి 1999 వరకు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2005 నుంచి 2008 వరకు కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ సారి ఏమవుతుందో చూడాలి

అప్పటి జనతా సంకీర్ణంలో ఎన్నివిబేధాలున్నాయో ఇపుడు ఇండియా కూటమిలో కూడా అన్నే విబేధాలున్నాయి. అప్పటిలాగానే ఇపుడు కూడా నలుగురైదుగురు ప్రధాని కావాలని కాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో ఖర్గే పేరు నిలుస్తుందా, వచ్చినట్లే వచ్చి మాయమవుతుందా? ఇపుడే చెప్పడం కష్టం. రాజకీయాల్లో ఎపుడైనా ఎమయినా జరగవచ్చు. జరక్కపోవచ్చు.

ఇండియా కూటమి..

భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యం. జూలై 18, 2023లో ఆవిర్భవించిన ఈ కూటమి యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ (యూపీఎ) నేతృత్వంలో కొనసాగుతోంది. 28 పార్టీల భాగస్వామ్యంలో ఏర్పడిన ఇండియా కూటమి సభ్యులు ఇప్పటి దాకా నాలుగుసార్లు సమావేశమయ్యారు. తొలి సమావేశం పాట్నాలో, రెండోది బెంగళూరులో, మూడోది ముంబాయిలో, నాల్గో సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.

పీఎం పీఠంపై ఎందరో ప్రముఖులు..

దేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. జవహర్‌లాల్‌ మొదలు కొని ఇప్పటి మోదీ దాకా కాంగ్రెస్‌, జనతపార్టీ, జనతాదళ్‌, సమాజ్‌వాదీ జనతాపార్టీ, బీజేపీ(BJP)కి చెందిన చెందిన ప్రముఖులు ఆ స్థానం దక్కించుకున్నారు.

దక్షిణ భారత దేశం నుంచి పీవీ నరసింహారావు (P V Narasimha Rao) మాత్రమే పీఎం కాగలిగారు. రాజీవ్‌ గాంధీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయన ఎన్నికయిన విషయం తెలిసిందే.

దళితుడు ఇప్పటివరకు ప్రధాని కాలేదు. ప్రస్తుతం ఖర్గే పేరు బయటకు రావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆయన ప్రధాని అయితే సౌత్‌ ఇండియా నుంచి ఎన్నికయిన తొలి దళిత ప్రధానిగా ఖడ్గే చరిత్రలో నిలిచిపోతారు. గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన జగ్జీవన్‌ రామ్‌ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.

మల్లికార్జున ఖర్గే..

గుర్మిత్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9 సార్లు గెలుపొందారు. తర్వాత 2009, 2014లో గుల్బార్బా నుంచి పోటీ చేసి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2020లో రాజ్యసభకు ఎంపికయ్యారు. తన రాజకీయ చరిత్రలో ప్రత్యర్థి అభ్యర్థులందరినీ ఓడిరచిన రికార్డు ఖర్గేకు మాత్రమే ఉంది.

Read More
Next Story