
చల్లారని క్యాతనపల్లి.. కొనసాగుతున్న బంద్
తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారని, తమతో అసభ్యకరంగా ప్రవర్తించారన్న బీఆర్ఎస్, సీపీఐ మహిళ కౌన్సిలర్లు
క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నిక మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక మంగళవారం జరగాల్సి ఉండగా దానిని మంత్రి వివేక్ అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారని, తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సీపీఐ మహిళ కౌన్సిలర్లు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో క్యాతనపల్లి వాతావరణం మరింత వేడెక్కింది.
తమ నేతపై కొందరు కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై చేస్తున్న ఆరోపణలు అందులో భాగమేనని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బంద్ నేపథ్యంలో క్యాతనపల్లిలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటిని పోలీసులు మోహరించారు. అంతేకాకుండా సీపీఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌ను కూడా అదులోకి తీసుకున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాల్క సుమన్ ఇంటి దగ్గర పోలీసులు మోహరించడంతో బీఆర్ఎస్ కార్యర్తలు ఒక్కసారిగా కదిలి వచ్చాడు. భారీ సంఖ్యలో బాల్క సుమన్ ఇంటికి చేరుకుని కాంగ్రెస్, మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బుధవారం కూడా అక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడటంలేదు.

