సికింద్రాబాద్‌లో కనుల పండుగగా కైట్ ఫెస్టివల్
x

సికింద్రాబాద్‌లో కనుల పండుగగా కైట్ ఫెస్టివల్

పతంగుల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.


సంక్రాంతి సంబరాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత శోభను జోడించింది. సంక్రాంతి రోజున ఎగరవేసే గాలిపటాల ఆటను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. చాలా ఏళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా సంక్రాంతి రోజున కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది దానిని మరింత స్పెషల్ మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కేవలం కైట్ ఫెస్టివల్‌గా కాకుండా అదే సమయంలో తెలంగాణ సంకృతిని ప్రొమోట్ చేసేలా ప్లాన్స్ రెడీ చేశారు. దాదాపు 1200 రకాల స్వీట్స్‌‌తో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రొఫెషన్ కైట్ ఫ్లయర్స్‌కు కూడా వచ్చారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సెలబ్రేట్ ది స్కై” కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాలు–మిఠాయిల పండుగ 2026ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు.

మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగే ఈ పండుగకు మధ్యాహ్నం నుంచే కుటుంబాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రానికి రంగురంగుల స్ట్రోబ్ లైట్లు, వెలుగులు వెలిగే గాలిపటాలు వేదికను పండుగ వాతావరణంతో నింపాయి.

ఈ పండుగలో భారీ పరిమాణంలో ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన గాలిపటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాత్రివేళ గాలిపటాల ఎగరవేత సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు సంప్రదాయ మిఠాయిలను విక్రయించనున్నారు. వేదిక వద్ద వైద్య శిబిరం, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పతంగుల పండుగకు శతాబ్దాల చరిత్ర ఉందని గుర్తుచేశారు. గాలిపటాల తయారీని హైదరాబాద్‌లోనే పెద్ద స్థాయిలో ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో రాష్ట్ర ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు హైడ్రా అభివృద్ధి చేసిన కొన్ని చెరువుల వద్ద కూడా గాలిపటాల పండుగ నిర్వహించనున్నారు. జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, జనవరి పదహారు నుంచి పదిహేడు వరకు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది.

భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, సందర్శకుల సౌకర్యాల కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పండుగ హైదరాబాద్ పర్యాటకానికి మరింత ఊపునిస్తుందని పేర్కొంటూ నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం ఆహ్వానించింది.

Read More
Next Story