
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
ఉగాది ఆస్థానానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. మార్చి 19న జరగనున్న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం ఈ పవిత్ర కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి ఆలయం అంతటా ప్రత్యేక శుద్ధి చేపట్టారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించారు. కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు దర్శనం కల్పించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు మాట్లాడుతూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు వివరించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

