Koti firing
x

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు.. అసలేం జరిగింది?

హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో దుండగులు కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. గాయపడిన రిషద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో శనివారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం సమీపంలో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఉదయం 7 గంటల సమయంలో రిషద్ అనే వ్యక్తి ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిని వెంబడించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల అనంతరం దుండగులు రిషద్ వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడైంది. ఈ ఘటనలో రిషద్ కాలికి తూటా గాయమైందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన రిషద్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బాధితుడు నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కదలికలపై దృష్టి పెట్టారు. ఈ ఘటనాస్థలిని డీసీసీ శిల్పవల్లి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్స్ ప్రాథమిక వివరాలు సేకరించినట్లు తెలిపారు.

ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఘటన జరిగినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story