నా పేరుతో సంస్థలు పెట్టొద్దు: కేటీఆర్
x

నా పేరుతో సంస్థలు పెట్టొద్దు: కేటీఆర్

కేటీఆర్ సేన, సేవా సమితి వంటి పేరుతో సంస్థలు ఏర్పాటు చేయడంపై కేటీఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదని, పార్టీలోనే పనిచేయాలని స్పష్టం చేశారు.


తన పేరు మీద వెలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సేనల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తాజాగా తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో 'కేటీఆర్ సేవా సమితి', 'కేటీఆర్ సేన' వంటి పేర్లతో కొందరు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. తన పేరుతో ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అటువంటి ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని ఆయన తేల్చి చెప్పారు.

కేటీఆర్ ప్రకటనకు కారణం ఇదే..

ప్రజా సేవ చేయాలనుకునే వారు లేదా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలనుకునే వారు వ్యక్తిగత పేరుతో కాకుండా, ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలని ఆయన భావిస్తున్నారు. ఎవరైనా నిజాయితీగా పని చేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి (BRS) అనే వ్యవస్థ పరిధిలోనే ఉండి పనిచేయాలని, అప్పుడే ఆ కార్యక్రమాలకు ఒక గుర్తింపు, క్రమశిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. తనపై ఉన్న అభిమానాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించాలని, వ్యక్తిగత సంస్థల ద్వారా గందరగోళం సృష్టించవద్దని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన పేరుతో కొనసాగుతున్న సంస్థలకు ఎలాంటి గుర్తింపు గానీ, అనుమతి గానీ లేదన్న విషయాన్ని అభిమానులు, ప్రజలు గమనించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పేరుతో చేస్తున్న కార్యక్రమాలను తక్షణమే ఆపేయాలని, పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ జెండా కింద కలిసి పనిచేయాలని ఆయన కోరారు. వ్యక్తిగత సంస్థల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యమని, అందరూ క్రమశిక్షణతో పార్టీలోనే కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story