
‘రేవంత్ ఇవాళ కొట్టాడు.. రేపు కరుస్తాడు’
సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని ప్రజల ముందే కొడుతున్నాడని, ఇలాగే కొనసాగితే రేపు కరుస్తాడేమోనని ఆయన భార్య గీతకు చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ పట్టణం భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి పరిపాలనపై అవగాహన లేదని మూటలు మోసడం తప్ప ఇంకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. గోదావరి ఎక్కడ ఉందో కూడా తెలియని వ్యక్తి కేసీఆర్‌కు నీళ్లపై పాఠాలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెప్పడం కాంగ్రెస్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేటీఆర్ అన్నారు. రైతులు యూరియా కోసం చలిలో నిలబడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనకటి రోజులు తెస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజలకు రాబందు కాలం తెచ్చాడని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలే రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారని తెలిపారు.
తెలంగాణను అరవై సంవత్సరాలు దోచుకున్న కాంగ్రెస్ చరిత్రను మరిచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నదులు తెలంగాణపై కనీస అవగాహన లేని వ్యక్తి రేవంత్ రెడ్డని విమర్శించారు.
ఇంటింటికీ నీళ్లు ఆసరా పెన్షన్లు రైతుబంధు రైతుబీమా సాగునీటి ప్రాజెక్టులు పంటల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం సాధించడంలో కేసీఆర్ పాత్రను కేటీఆర్ గుర్తు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.
జనగామ ర్యాలీని చూస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయినట్టే అనిపించిందని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా కనిపించగానే ప్రజలు చప్పట్లు కొడుతుండటం ఆనందం కలిగించిందని చెప్పారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో ఓటు వేయాలని కోరారు.
చాకలి ఐలమ్మ షేక్ బందగీ దొడ్డి కొమురయ్య రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ జనగామ అని పేర్కొంటూ ఈ నేలపై మరోసారి గులాబీ జెండా ఎగిరిపడుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

