
హైకోర్టు ఆదేశాలతో మళ్లీ చర్చల్లోకి కెవీపీ
వైద్యుడిగా ప్రారంభమైన కెవీపీ రాజకీయ ప్రయాణం వైఎస్సార్‌తో అనుబంధం, ప్రభుత్వ సలహాదారు పదవి, రాజ్యసభ సభ్యత్వం వరకు సాగింది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చాలా కాలంగా మరుగునపడిపోయిన పేరు మళ్ళీ ఇప్పుడు చర్చల్లో నిలిచింది. అదే కేవీపీ రామచంద్ర రావు. ఒకప్పుడు ఆంధ్రారాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు (2004- 2009)ప్రభుత్వంలో పార్టీలో ఆయనప్రధాన వ్యక్తి. ముఖ్యమంత్రి కనపడి నిర్ణయాలు తీసుకుంటే, కనిపించకుండా ఆ నిర్ణయాలను అమలుచేసిన వ్యక్తి కెవిపి. అందుకే ఒకరు వ్యక్తిమరొక ఆత్మ అనే వాళ్లు. మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్స్ అంతా మిధ్య. కెవిపి మాత్రమే నిజం. అందుకే ముఖ్యమంత్రి కలుసుకోవడం కంటే కెవిపిని కలుసుకుంటేనే పనులు అవుతాయని అంతా నమ్మే వారు.
ఒక వేళ ఎవరైనా కష్టపడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శనం పొందినా ఆయన సున్నితంగా మందలించి కెవిపి దగ్గరికు పంపేవాడు. ఇలా కెవిపి అనే మూడక్షరాలు రాజ్యమేలిన కాలం 2004-2009. రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో కెవిపి కూడా మసక బారడం మొదలయింది. దానికితోడు తెలంగాణ ఉద్యమం కూడా ఆయన అవసరం తగ్గించింది. ఆయన పార్టీలో చేతులు తిప్పగలడు గాని, ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రాలు ఆయన సబ్జక్టు కాదు. అందుకే 2009తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన రోల్ తగ్గింది.
అయితే, రాజ్య సభ్యుడు కావడంతో అపుడపుడు కనిపించే వారు, సభలో గొంతు వినిపించే వారు. అయితే, ఆయన్ని తెలంగాణ కాంగ్రెస్ పట్టించుకోవడం మానేశారు. మరొక వైపు రాజశేఖర్ రెడ్డి వారసత్వం కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కించుకోవడంతో కెపివి పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయింది. తండ్రి తీసుకున్నట్లుగా జగన్.. కెవిపి నీ ఆత్మీయుడిడా, ఆత్మగా లేదా సలహాదారుగా తీసుకోలేదు. రాజ్యసభ నుంచి రిటైరయ్యాక ఆయన కనుమరుగయ్యారు.
ఆయన ఆంధ్ర కాంగ్రెస్ కి అవసరం లేకుండా పోయారు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు దగ్గరకు రానీయలేదు. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వం తీసుకున్నాక, కాంగ్రెస్ నుంచి పాతతరం మొత్తం కనుమరగయింది. ఇందులో కెవిపి కూడా ఒకరు,
ఇపుడు ఉన్నట్లుండి కెవివి పేరు మళ్లీ వార్తలకెక్కింది. తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐకి ఇచ్చిన కొన్ని కీలక ఆదేశాలతో మరోసారి టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. గతంలో ఆయనకు ఇచ్చిన ఇంటర్‌పోల్ రెడ్ క్రాస్ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవాలని తెలంగాణ హైకోర్టు బుధవారం సీబీఐని ఆదేశించింది. దీంతో కేవీపీ మరోసారి చర్చల్లో నిలిచారు.
టైటానియం ప్రాజెక్ట్‌కు కోసం లంచాలు ఇచ్చిన కేసుకు సంబంధించి కేవీపీకి అమెరికా ఇంటర్‌పోల్ రెడ్ క్రాస్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు అమెరికాలోని ఉత్తర ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టులో 2013లో నమోదైంది. కోర్టు ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు పొందడానికి ప్రభుత్వ అధికారులు 18.5 మిలియన్లు డాలర్లు (సుమారు 153.6 కోట్ల రూపాయలు) లంచాలుగా అందుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) ఈ కేసును పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంది.
అందులో బాగంగానే 2014లో కేవీపీపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు (Red Corner Notice) జారీ చేసింది. అయితే, ఈ నోటీసును ఆయన వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆయన పిటిషన్‌ను హైకోర్టులో 2015లో తాత్కాలికంగా స్వీకరించింది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటిషన్‌లో పూర్తి స్థాయి సమాధానం ఇప్పటివరకు రాలేదు.
ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈ కేసు మళ్లీ వినిపించింది. కేవీపీపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఇప్పటికీ అమల్లో ఉందా, లేదా అనే అంశంపై స్పష్టత తీసుకోవాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. నోటీసు ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ద్వారా జారీ చేయబడినది కాబట్టి, సవాలు కోసం సరైన జూరిస్డిక్షన్‌లో దాఖలు చేయాలని సూచించింది. కోర్టు ఈ విషయాన్ని రెండు వారాల తర్వాతు వాయిదా వేసింది
కెవీపీ రామచంద్రరావు 1950 జూన్ 21న తూర్పు గోదావరి జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే చదువులో ఆసక్తి చూపిన ఆయన వైద్య విద్యను అభ్యసించారు. గుల్బర్గా మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఆయనకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కేవలం కాలేజీ దగ్గరే ఆగిపోలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వారి స్నేహం నిలిచింది. రాజకీయాల్లో వైఎస్ఆర్‌కు కేవీపీ నీడలా మారారు.
కేవీపీ.. వైద్య విద్య పూర్తయ్యాక కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. అయితే ప్రజా జీవితం, సామాజిక సేవలపై ఆసక్తి పెరగడంతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1980ల నుంచి ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేశారు. పార్టీ కార్యకలాపాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. వైద్య విద్య సమయంలో ప్రారంభమైన వైఎస్సార్‌తో ఆయన స్నేహం కాలక్రమంలో రాజకీయ భాగస్వామ్యంగా మారింది. రాజకీయ వర్గాల అభిప్రాయం ప్రకారం, వైఎస్సార్ ఎదుగుదల వెనుక కెవీపీ వ్యూహాత్మక పాత్ర ఉండేది. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయం సాధించడం, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించడం వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారని పార్టీ వర్గాలు పేర్కొనేవి.
2003లో వైఎస్సార్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఆ పాదయాత్ర ప్రణాళిక రూపకల్పనలో కెవీపీ కీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో అప్పట్లో అభిప్రాయం వ్యక్తమైంది. పాదయాత్రలో ప్రతి రోజు మార్గం, కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలు వంటి అంశాలను ముందుగానే ప్రణాళికబద్ధంగా రూపొందించారని చెప్పబడింది.
ఈ పాదయాత్ర అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ యుటిలిటీస్ మరియు పబ్లిక్ వెల్ఫేర్ కార్యకలాపాలపై సలహాదారుగా నియమితులయ్యారు. ఈ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించబడింది. దీంతో సచివాలయంలో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటైంది. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ అంశాలపై ఆయన సూచనలు కీలకంగా ఉండేవని అప్పట్లో రాజకీయ వర్గాలు పేర్కొనేవి.
ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల బదిలీలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అభిప్రాయం ముఖ్యమని అప్పటి రాజకీయ చర్చల్లో వినిపించేది. అందుకే కొందరు ఆయనను తెరవెనుక కీలక నాయకుడిగా అభివర్ణించేవారు. తర్వాత 2008లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి 2014 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ కాలంలో పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పలుమార్లు మాట్లాడారు. అదే సమయంలో పలు పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ అంశంపై ఆయన పలుమార్లు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాలక్రమంలో ఆయన పేరు కొన్ని వివాదాల్లో కూడా వినిపించింది. ముఖ్యంగా టైటానియం ప్రాజెక్ట్‌కు సంబంధించిన లంచాల కేసులో ఆయన పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు అంశం కూడా చర్చకు వచ్చింది.
ఇటీవల ఈ రెడ్ కార్నర్ నోటీసు ఇప్పటికీ అమల్లో ఉందా లేదా అన్న విషయంపై వివరాలు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో కెవీపీ రామచంద్రరావు పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. వైద్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం తరువాత కాంగ్రెస్ పార్టీలో వ్యూహాత్మక నాయకుడిగా కొనసాగింది. ముఖ్యంగా వైఎస్సార్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించకపోయినా, గతంలో పోషించిన పాత్ర కారణంగా ఆయన గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా న్యాయ పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో ప్రస్తావనకు రావడం గమనార్హంగా మారింది.

