హైదరాబాద్ శివార్లలో భూముల జోరు: తొర్రూర్‌లో రికార్డు ధరలు
x
తొర్రూర్ లో భూముల ధరలకు రెక్కలు

హైదరాబాద్ శివార్లలో భూముల జోరు: తొర్రూర్‌లో రికార్డు ధరలు

భూమి మీద భరోసా… రాజీవ్ స్వగృహ వేలానికి కుటుంబాలే క్యూ!


హైదరాబాద్ నగరానికి సమీపంలో భద్రమైన పెట్టుబడిగా మారిన రాజీవ్ స్వగృహ భూములు మరోసారి హాట్‌టాపిక్ అయ్యాయి. తొర్రూర్ వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి.తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నగర శివార్లలోని తొర్రూర్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ భూమి చదరపు గజం ధర రూ.45 వేలకు కొనుగోలు చేశారు. ఈ భూముల విక్రయాల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు రూ. 56 కోట్లు ఆదాయం వచ్చింది.

విమానాశ్రయానికి చేరువలో...

అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాటసింగారం ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేలం పాట తొలిరోజున శనివారం 70 ప్లాట్లను అధికారులు విక్రయించారు. ఈ ప్రాంతంలోని భూములను గరిష్టంగా చదరపు గజం రూ 45 వేలకు కొనుగోలు చేశారు. తొర్రూర్ తోపాటు ఓఆర్ ఆర్ కు సమీపంలోని బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం విక్రయించిన భూముల ద్వారా తమకు రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరక్టర్ వి.పి .గౌతం చెప్పారు.

ప్లాట్ల కొనుగోలుకు పోటీ

తొర్రూర్ లోని ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేయడానికి 150 మంది ముందుకు వచ్చారు. వీరిలో అనేక మంది కుటుంబ సమేతంగా వచ్చి , తమకు నచ్చిన ప్లాట్ ను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. ఒక కార్నర్ ప్లాట్ ను దక్కించుకోడానికి వేలం పాటలో 20 సార్లకు పైగా ధరలు పెంచుతూ పోటీ పడటమే ఇక్కడి ప్లాట్లకు ఉన్న డిమాండ్ కు నిదర్శనం. 200 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల చదరపు గజం కనీస ధర (అప్ సెట్ ప్రైజ్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్ల ను రూ.45 వేలు,రూ. 43వేలు, రూ.41 వేలకు కూడా కొనుగోలు చేశారు. మొత్తం మీద ఇక్కడ వేలం వేసిన భూములు సగటున చదరపు గజానికి రూ.31 వేల కు విక్రయించారు.రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జి. వి.రమణా రెడ్డి, ఇ. ఇ. నరేందర్ రెడ్డి తో పాటు స్థానిక రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేలం పాట ను నిర్వహించారు.కాగా తొర్రూర్ లే అవుట్ లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు ఆదివారం నాడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు.

పోచారం, బండ్లగూడల్లో 71 ఫ్లాట్ల కేటాయింపు

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి లాటరీ ప్రక్రియ లో కేటాయించడం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.
మొత్తం మీద రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహించిన ఈ వేలం హైదరాబాద్ శివార్లలో భూములపై ఉన్న నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో నగర శివార్లలో భూముల ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.తొర్రూర్ వేలం విజయంతో హైదరాబాద్ శివార్ల రియల్ ఎస్టేట్ మరో దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది.
Read More
Next Story