పచ్చని అడవులు కేవలం ప్రకృతి అందాలు మాత్రమే కాదు… జీవవైవిధ్యానికి నిలయాలు, వన్యప్రాణుల ఆశ్రయాలు, మనిషి శ్వాసకు ఆధారం. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా ఈ సహజ సంపద ముప్పును ఎదుర్కొంటున్న వేళ, పర్యావరణ ప్రేమికులు ముందుకొచ్చారు. ‘వన ప్రక్షాళన్’ పేరిట చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంతో అడవులను శుభ్రపరిచి, ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు స్వచ్ఛంద సేవకులు అటవీశాఖతో కలసి చైతన్య యాత్ర మొదలుపెట్టారు. వికారాబాద్ నుంచి అమ్రాబాద్ వరకు సాగుతున్న ఈ పచ్చదనం ఉద్యమం అడవిని కాపాడాలనే సామూహిక సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అడవుల పరిరక్షణ,పరిశుభ్రత, జీవవైవిధ్యంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందనే వాస్తవాన్ని గ్రహించిన పర్యావరణ ప్రేమికులు అడవుల పరిశుభ్రతకు ముందుకు వచ్చి ‘వన ప్రక్షాళన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ స్వచ్ఛంద సేవకులు ,అటవీశాఖ అధికారులతో కలిసి ఆదివారం వికారాబాద్‌లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వన ప్రక్షాళన్ (అటవీ పరిశుభ్రత, అవగాహన డ్రైవ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, ఎండోమెంట్ శాఖల అధికారుల సహకారంతో అమెజాన్ కంపెనీ నుంచి 28 మంది వాలంటీర్లు, హైటికోస్ నుంచి 8 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
వికారాబాద్ అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన వాలంటీర్లు
వాలంటీర్లు సైన్‌బోర్డ్ ల ద్వారా వన ప్రక్షాళన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికారాబాద్ లోని అనంతర పద్మనాభ స్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో 38 బస్తాల వ్యర్థాలను వాలంటీర్లు సేకరించారు.వ్యర్థాలను పునర్వినియోగపరచదగిన, పునర్వినియోగించలేని పదార్థాలుగా విభజించారు.అడవిలో ఆలయ పరిసరాలు, పరిసర అటవీ ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని ఏరివేసి శుభ్రం చేశారు.సందర్శకులు, భక్తులకు పర్యావరణ అవగాహన కల్పించారు.
“ఈ అడవిని శుభ్రంగా ఉంచుకుందాం.ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని రీసైకిల్ చేయండి’’అనే ముఖ్య సందేశంతో ఉన్న వన ప్రక్షాళన్ అవగాహన కార్యక్రమాన్ని పర్యావరణ వేత్తలు చేపట్టారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను వ్యాన్ లో తరలిస్తున్న అటవీశాఖ సిబ్బంది
అడవిని రక్షించుకుందాం
అడవిని, వన్యప్రాణులను రక్షించడానికి స్వీయ-స్థిరమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చేపట్టారు. అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు మన్ననూర్ ప్రవేశ ద్వారం నుంచి దోమల పెంట రేంజ్ చెక్ పోస్ట్ వరకు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు పడి ఉన్నాయి.ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణులకు తీవ్ర నష్టం చేయడంతోపాటు వాటి ఆహారపు అలవాట్లలో మార్పుపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త ఫరియా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కోతులు, అడవి పందులు, వన్యప్రాణులను రక్షించడానికి ప్లాస్టిక్ రహిత జోన్‌ను ప్రారంభించారు. మన్ననూర్ నుంచి దోమలపెంట రేంజ్ వరకు రాష్ట్ర రహదారి వెంట వ్యర్థాల సేకరణ కోసం ఏడుగురు వ్యక్తులను నియమించారు.
ప్లాస్టిక్ ఫ్రీ అమ్రాబాద్
అమ్రాబాద్ పులుల అభయారణ్యం మధ్యలో నుంచి జాతీయ రహదారి 765 వెళుతుండటంతో దీనిపై శ్రీశైలంకు ప్రయాణించే యాత్రికులు హైవే వెంట ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2024 జులై 1వతేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్రీ అమ్రాబాద్ ను ప్రకటించి, ప్లాస్టిక్ బాటిళ్లు , క్యారీబ్యాగులు రోడ్డు పక్కన పడేయకుండా జాతీయ రహదారిపై మన్ననూర్ , దోమలపెంట వద్ద ప్లాస్టిక్ తనిఖీ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 16 మంది స్వచ్ఛ సేవకులు మూడు పెట్రోలింగ్ వాహనాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ ను సేకరిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం వద్ద వాహనాలను తనిఖీ చేసి నిషేధిత ప్లాస్టిక్ పదార్థాలను సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత అమ్రాబాద్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డుకు రెండు వైపులా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ ఫ్రీ అమ్రాబాద్ కార్యక్రమాన్ని తమ అటవీ శాఖ విజయవంతంగా కొనసాగిస్తుందని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎస్ సునీల్ హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కవాల్ అభయారణ్యంలో స్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసిన వాలంటీర్లు
కవాల్ అభయారణ్యంలో చెత్త తొలగింపు
కవాల్ పులుల అభయారణ్యంలో ప్రజలు వేసిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్లు, పాఠశాల విద్యార్థులు సేకరించి తొలగిస్తున్నారు. వన్యప్రాణులున్న అడవిలో జీవవైవిధ్యానికి ఆటంకం కలగకుండా పర్యావరణవేత్తలు చెత్తను సేకరించి అడవికి దూరంగా తరలిస్తున్నారు. రోడ్ల పక్కన, అడవిలో కాలిబాటలపై ఉన్న చెత్తాచెదారం ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు. కవాల్ అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం తాము చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయ కర్త డాక్టర్ వెంకట్ అనగంధుల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అడవులను కాపాడితేనే జీవవైవిధ్యం నిలుస్తుంది… జీవవైవిధ్యం నిలిస్తేనే మన భవిష్యత్తు భద్రమవుతుంది. ‘వన ప్రక్షాళన్’ వంటి కార్యక్రమాలు కేవలం చెత్త తొలగింపునకే పరిమితం కావు; అవి సమాజంలో బాధ్యతా భావాన్ని పెంపొందించే పచ్చని ఉద్యమాలు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వాలంటీర్లు, విద్యార్థులు అందరూ కలిసి అడవిని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో ముందుకు రావడం ఆశాజనక పరిణామం.