దేశంలో పొడవైన సముద్రపు వంతెన ఇదే!  2 గంటల జర్నీ 20 నిమిషాల్లో...
x
దేశంలోనే అతి పొడవైన వంతెన

దేశంలో పొడవైన సముద్రపు వంతెన ఇదే! 2 గంటల జర్నీ 20 నిమిషాల్లో...

రూ.21,200 కోట్ల వ్యయం, ఆరు లేన్లత సముద్రంపై నిర్మించిన స్టీలు వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో రెండు గంటల ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతుంది..


దేశంలోనే అతిపెద్ద వంతెన ముంబైలో అందుబాటులోకి వచ్చింది. సముద్రంపై 21.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ అటల్‌ సేతు బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2 గంటల ప్రయాణాన్ని 20 నిమిషాలకు కుదించేలా 17వేల 840 కోట్ల ఖర్చుతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి వల్ల దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి ప్రయాణ దూరం చాలా తగ్గుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో 6 లేన్లతో నిర్మించిన ఈ వంతెన భూకంపాలను సైతం తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది.

అత్యంత పొడవైన వంతెన...

దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలోకెల్లా అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నహవా శేవాను కలిపే ఈ బ్రిడ్జిని 17 వేల 840 కోట్ల రూపాయలతో ఆరు లైన్లతో నిర్మించారు. ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ అనే ఈ వంతెనను అట‌ల్ బిహారీ వాజ్‌పేయి సేవారి-న‌హ‌వా సేవా అట‌ల్ సేతు అని పిలుస్తారు.

2016లో శంకుస్థాపన..

ఈ అటల్‌ సేతు వంతెనకు 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి కావాల్సిన వంతెనను.. గడువుకు ఆరు నెలల ముందే సిద్ధం చేశారు. 21.8 కిలోమీట‌ర్ల పొడవైన ఈ వంతెన... 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైన, 5.5 కిలోమీటర్లు భూభాగంపై నిర్మించారు. ఆరు లేన్ల ఈ వంతెన నిర్మాణంలో.. భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికను వినియోగించారు.

2 గంటల జర్నీ 20 నిమిషాలకు..

ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంతేకాదు.. దీని వల్ల ముంబై, నవీ ముంబై ఎయిర్‌ పోర్టుల మధ్య ప్రయాణ దూరం కూడా భారీగా తగ్గుతుంది. అలాగే.. ముంబై నుంచి పుణె, గోవాకు వెళ్లే సమయం కూడా కలిసివస్తుంది. ఇక ముంబై పోర్టు నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టుకు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.

మోటార్‌ సైకిళ్లకు నో ఎంట్రీ...

ఈ అటల్‌ సేతు.. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. రోజుకు 70 వేల ఫోర్‌ వీలర్స్‌.. 100 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈ బ్రిడ్జి పైనుంచి వెళ్లొచ్చు. ట్రాక్టర్లు, ఆటోరిక్షాలు, మోటార్‌ సైకిళ్లకు ఈ వంతెనపై అనుమతి లేదు.

Read More
Next Story