
చారిత్రాత్మక మైలురాయి అందుకున్న మహాలక్ష్మీ పథకం
మహిళల ఉచిత బస్సు ప్రయాణం విస్తృతి పెరిగింది. రోజూ లక్షల మంది ప్రయాణం, స్మార్ట్ కార్డుల అమలుకు ప్రభుత్వం సిద్ధం.
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకం కీలక మైలురాయిని అందుకుంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు రూ.10వేల కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలను అందించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత్ర ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం సాధించిన చారిత్రాత్మక మైలురాయిని వేడుకగా జరుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజా భవన్‌లో కీలక కార్యక్రమం నిర్వహించనుంది. మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్ 9న ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి మహిళలు భారీగా ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 290 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి.
రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. పథకం ప్రారంభానికి ముందు మహిళా ప్రయాణికుల శాతం 40గా ఉండగా, ఇప్పుడు అది 67 శాతానికి పెరిగింది. ఈ పథకం కింద జారీ చేసే జీరో టికెట్ల విలువను ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. దీంతో సంస్థకు ఆదాయం కూడా పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి మహిళలు ప్రయాణం చేస్తున్నారు. అయితే, కొన్ని సాంకేతిక సమస్యలు, ధృవీకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, పథకాన్ని మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు.
సమస్యల పరిష్కారానికి స్మార్ట్ కార్డ్
దీనిలో భాగంగా, చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్డులతో ఆధార్ అవసరం లేకుండానే మహిళలు ఉచితంగా ప్రయాణించగలరు. స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియ 2026 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్డుల కోసం గ్రామ సభలు, మున్సిపల్ కార్యాలయాలు లేదా ప్రజా పాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు, ఫోటోతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
ఇక స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చే వరకు, ప్రస్తుత విధానంలోనే ఆధార్ కార్డు ద్వారా ప్రయాణం కొనసాగుతుంది. మొత్తంగా, మహాలక్ష్మి పథకం మహిళల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, విస్తృత స్థాయిలో అమలు అవుతోంది. భవిష్యత్తులో మరింత మార్పులతో ఈ సేవలు కొనసాగనున్నాయి.

