కొడిమ్యాలలో కలవరపెడుతున్న మహారాష్ట్ర పులి
x
కొడిమ్యాలలో కలవరపెడుతున్న జే1 పులి

కొడిమ్యాలలో కలవరపెడుతున్న మహారాష్ట్ర పులి

తాడోబా నుంచి తెలంగాణకు వలస వచ్చిన పులి జే–1.రోజుకో గ్రామంలో పశువులపై దాడులు


మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి తెలంగాణలోకి వలస వచ్చిన పులి జే–1 అటవీ గ్రామాల్లో కలకలం రేపుతోంది. గత రెండున్నర నెలలుగా జిల్లాలు మారుస్తూ సంచరిస్తున్న ఈ పులి రైతుల ఆవులు, దూడలను వేటాడుతూ భయాందోళనలు సృష్టిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం, సూరంపేట గ్రామాల్లో రెండు ఆవులను చంపడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


పొరుగున ఉన్న మహారాస్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన పులి జే 1 అటవీగ్రామాల్లో సంచరిస్తూ రోజుకో ఆవును చంపుతోంది. ఇప్పటికే గడచిన రెండున్నర నెలలుగా రోజుకో ప్రాంతానికి వెళుతూ రైతుల ఆవులు, దూడలను వేటాడుతూ కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలోని అటవీ గ్రామాల్లో తిరిగిన పులి రోజుకో ప్రాంతానికి వెళుతుంది.జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పులి సంచరిస్తోంది. పులికి కావాల్సిన సురక్షిత ఆవాసం, ఆడపులి తోడు లభించక పోవడంతో అది రోజుకో ప్రాంతానికి వెళుతూ పశువులపై దాడులు చేస్తోంది.

ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి కదలికలు

సోమవారం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం గంగారం, సూరంపేట గ్రామాల్లో పులి రెండు ఆవులను చంపింది. అటవీశాఖ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అధికారులు పులి కదలికలను ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నా దాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారు. రెండు రోజుల క్రితం ఈ పులి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిపల్లి మండలం కోనాపూర్ శివార్లలోని రాళ్లవాగు ప్రాజెక్టు ప్రాంతంలో సంచరించిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కథలాపూర్ మండలంలోని కాలికోట సూరమ్మ ప్రాజెక్టు ప్రాంతంలోని తుర్తి అడవుల్లో తిరిగిందని సమాచారం.

పులిని బంధించాలని ప్రజల వినతి

పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గుట్టల సమీపంలో పులి నాలుగు దూడలపై దాడి చేసింది. పులి దాడుల్లో మరణించిన ఆవులు, దూడలకు అటవీశాఖ అధికారులు నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకుంటున్నారే కానీ పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పులి తెలంగాణ గ్రామాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ఇప్పటికే 30కి పైగా పశువులను వేటాడింది.
పులి సంచారంతో పలు అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రెండున్నర నెలలుగా తమకు నిద్ర లేకుండా చేస్తున్న పులిని బంధించి అడవికి తరలించాలని అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పులి కదలికలను ట్రాప్ కెమెరాల ద్వారా అటవీశాఖ అధికారులు గమనిస్తున్నప్పటికీ దాన్ని బంధించడంలో ఇప్పటివరకు విజయవంతం కాలేదు. పులి సంచారంతో అటవీ గ్రామాల ప్రజలు రాత్రిళ్లు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.


Read More
Next Story